* పీపీఏల రద్దుపై ఏపీని తప్పుపట్టిన సీఈఏ
* 65 మెగావాట్లు అదనంగా పొందనున్న ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసుకోవడంపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) ఉన్నతస్థాయి కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు వల్లే ఈ సమస్య వచ్చిందని వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉత్పన్నమవుతున్న విద్యుత్ వివాదాలు, సమస్యలను పరిష్కరించేందుకు సీఈఏ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఈఏ చైర్మన్ నీరజా మాథుర్ నేతృత్వంలో ఈ నెల 1న ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆగస్టు 1లోగా తమ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ కమిటీ తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది.
దీనికి కమిటీ చైర్మన్, సభ్యులతో పాటు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా... విభజన చట్టం గందరగోళంగా ఉందని, సమస్య అంతా చట్టంలోని అంశాల వల్లే వచ్చిందని కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లను ఏకపక్షంగా రద్దు చే సుకోవడంపై ఏపీ రాష్ట్రాన్ని తప్పుపట్టింది. అలాగే పీపీఏల కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2009, 2010లో చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించకుండా అప్పటి ఏపీఈఆర్‌సీ వ్యవహరించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ఏపీఈఆర్సీ సభ్యుడిని పిలిచినా రానందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా పీపీఏలను రద్దు చేయడం కుదరదని తెలంగాణ వాదించగా.. రద్దు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. అయితే పీపీఏల రద్దు పద్ధతి ప్రకారం జరగాలని కమిటీ పేర్కొంది. కాగా, కేంద్ర విద్యుత్తు ప్రాజెక్టుల (సీజీఎస్) ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విద్యుత్‌లో తమకు అన్యాయం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ వివరించింది. దీనిని తెలంగాణ అంగీకరించడంతో ఏపీకి సీజీఎస్ వాటా 1.77 శాతం పెంచాలని నిర్ణరుుంచారు. దీంతో ఏపీకి 65 మెగావాట్ల మేరకు అదనంగా విద్యుత్ లభించనుంది.
ఏకపక్ష ధోరణి తగదు
Published Tue, Jul 15 2014 12:51 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement