Reorganization of the state
-
ఉద్యోగులకు ఆప్షన్లు!
విభజనపై ప్రతి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయం కొత్తగా జాబితాలు రూపొందించాలని సీఎస్ల ఆదేశం జూన్ 1 నాటికి సీనియారిటీ పరిగణనలోకి.. హైదరాబాద్: ఆప్షన్ల ఆధారంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరుగనుంది. ఇందుకోసం కేడర్, డిప్యూటేషన్లు, దీర్ఘకాలిక సెలవులు సహా ఉద్యోగుల పూర్తి వివరాలతోపాటు జూన్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల సీనియారిటీతో జాబితాలను రూపొందించనున్నారు. కేడర్ సహా ఉద్యోగుల జాబితాను తయారుచేయడంపై వివిధ శాఖల ప్రత్యేక కార్యదర్శులు, అధిపతులతో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్ఆర్) విభాగం అధికారులు పీవీ రమేష్, రామకృష్ణారావు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రధానికి పంపించామని.. అనుమతి రాగానే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎస్‌లు సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియ రెండు నెలల్లో ముగుస్తుందని తెలిపారు. మార్గదర్శకాలకనుగుణంగా ప్రతీ ఉద్యోగికీ ఆప్షన్ పత్రాలు, ఆప్షన్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కేడర్‌లో 51 వేల పోస్టులుండగా వెయ్యి మంది ఉద్యోగుల పంపిణీకే ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. రాష్ర్టపతి ఉత్తర్వులే ప్రామాణికం.. రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని... ఎంత మంది ఉద్యోగులను నోటిఫై చేశారు? ఆర్థికశాఖ మంజూరు చేసిన పోస్టులెన్ని? ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను నివేదికలో పొందుపర్చాలని సీఎస్‌లు సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కమల్‌నాథన్ నేతృత్వంలోని సలహా మండలి దృష్టికి తేవాలని సూచించారు. ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా సమర్పించాలని చెప్పారు. కొత్తగా జాబితాలు! జూన్ 1వ తేదీ నాటికి ఉన్న వివరాలన్నింటినీ పరిగణించి జాబితాను తయారుచేయాలని.. పాత నివేదికలతో సంబంధం లేకుండా కొత్తగా జాబితాలను రూపొందించాలని అధికారులను సీఎస్‌లు, ఎస్ఆర్ అధికారులు ఆదేశించారు. ఇందుకోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభజన ప్రక్రియ ప్రారంభమైతే రెండు నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. ఎస్ఆర్ విభాగానికి పూర్తిస్థాయి అధికారి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగానికి పూర్తిస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించి, బాధ్యతలు అప్పగిస్తామని సీఎస్‌లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంట్లో ఇరు రాష్ట్రాల అధికారులూ ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్ఆర్ విభాగానికి సభ్య కార్యదర్శిగా పీవీ రమేష్ ఉన్నారు. కాగా... విభజనను త్వరగా పూర్తిచేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీలు పాల్గొన్నారు. -
ఏకపక్ష ధోరణి తగదు
* పీపీఏల రద్దుపై ఏపీని తప్పుపట్టిన సీఈఏ * 65 మెగావాట్లు అదనంగా పొందనున్న ఏపీ సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసుకోవడంపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) ఉన్నతస్థాయి కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందిన తీరు వల్లే ఈ సమస్య వచ్చిందని వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉత్పన్నమవుతున్న విద్యుత్ వివాదాలు, సమస్యలను పరిష్కరించేందుకు సీఈఏ ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఈఏ చైర్మన్ నీరజా మాథుర్ నేతృత్వంలో ఈ నెల 1న ఆరుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆగస్టు 1లోగా తమ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ కమిటీ తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. దీనికి కమిటీ చైర్మన్, సభ్యులతో పాటు తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా, ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా... విభజన చట్టం గందరగోళంగా ఉందని, సమస్య అంతా చట్టంలోని అంశాల వల్లే వచ్చిందని కమిటీ అభిప్రాయపడింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లను ఏకపక్షంగా రద్దు చే సుకోవడంపై ఏపీ రాష్ట్రాన్ని తప్పుపట్టింది. అలాగే పీపీఏల కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2009, 2010లో చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించకుండా అప్పటి ఏపీఈఆర్సీ వ్యవహరించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ఏపీఈఆర్సీ సభ్యుడిని పిలిచినా రానందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా పీపీఏలను రద్దు చేయడం కుదరదని తెలంగాణ వాదించగా.. రద్దు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. అయితే పీపీఏల రద్దు పద్ధతి ప్రకారం జరగాలని కమిటీ పేర్కొంది. కాగా, కేంద్ర విద్యుత్తు ప్రాజెక్టుల (సీజీఎస్) ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఆ విద్యుత్‌లో తమకు అన్యాయం జరిగిందని.. ఆంధ్రప్రదేశ్ వివరించింది. దీనిని తెలంగాణ అంగీకరించడంతో ఏపీకి సీజీఎస్ వాటా 1.77 శాతం పెంచాలని నిర్ణరుుంచారు. దీంతో ఏపీకి 65 మెగావాట్ల మేరకు అదనంగా విద్యుత్ లభించనుంది. -
వీరికి పెంపు వర్తించదు
పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ ఆర్థికశాఖ సర్క్యులర్ హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని శిక్షణ సంస్థలు, తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, మండలి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన 89 సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగలకు కూడా పెంపు వర్తించదని వివరించింది. -
హామీలు నెరవేర్చండి
హామీలు నెరవేర్చండి ప్రధానికి సోనియాగాంధీ లేఖ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యసభలో ప్రధాని ప్రసంగం, హోంమంత్రి హా మీలను అమలుచేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధానికి లేఖ రాశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హామీలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే. అప్పటి ప్రధాని, హోం మంత్రి ఫిబ్రవరి 20న రాజ్యసభలో మరికొన్ని హామీలు ఇచ్చారు. జలవనరులు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం వంటి అంశాలు ఇందులో ప్రధానమైనవి. మీ ప్రభుత్వం వీటిని ముందుకు తీసుకెళుతుందని ఆకాంక్షిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.