ఉద్యోగులకు ఆప్షన్లు!
విభజనపై ప్రతి ఉద్యోగి ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయం
కొత్తగా జాబితాలు రూపొందించాలని సీఎస్‌ల ఆదేశం
జూన్ 1 నాటికి సీనియారిటీ పరిగణనలోకి..
హైదరాబాద్: ఆప్షన్ల ఆధారంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన జరుగనుంది. ఇందుకోసం కేడర్, డిప్యూటేషన్లు, దీర్ఘకాలిక సెలవులు సహా ఉద్యోగుల పూర్తి వివరాలతోపాటు జూన్ 1వ తేదీ నాటికి ఉద్యోగుల సీనియారిటీతో జాబితాలను రూపొందించనున్నారు. కేడర్ సహా ఉద్యోగుల జాబితాను తయారుచేయడంపై వివిధ శాఖల ప్రత్యేక కార్యదర్శులు, అధిపతులతో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్‌ఆర్) విభాగం అధికారులు పీవీ రమేష్, రామకృష్ణారావు బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రధానికి పంపించామని.. అనుమతి రాగానే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని సీఎస్‌లు సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియ రెండు నెలల్లో ముగుస్తుందని తెలిపారు. మార్గదర్శకాలకనుగుణంగా ప్రతీ ఉద్యోగికీ ఆప్షన్ పత్రాలు, ఆప్షన్ ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కేడర్‌లో 51 వేల పోస్టులుండగా వెయ్యి మంది ఉద్యోగుల పంపిణీకే ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
రాష్ర్టపతి ఉత్తర్వులే ప్రామాణికం..
రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని... ఎంత మంది ఉద్యోగులను నోటిఫై చేశారు? ఆర్థికశాఖ మంజూరు చేసిన పోస్టులెన్ని? ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను నివేదికలో పొందుపర్చాలని సీఎస్‌లు సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే కమల్‌నాథన్ నేతృత్వంలోని సలహా మండలి దృష్టికి తేవాలని సూచించారు. ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం ఉన్న ఉద్యోగుల వివరాలను కూడా సమర్పించాలని చెప్పారు.
కొత్తగా జాబితాలు!
జూన్ 1వ తేదీ నాటికి ఉన్న వివరాలన్నింటినీ పరిగణించి జాబితాను తయారుచేయాలని.. పాత నివేదికలతో సంబంధం లేకుండా కొత్తగా జాబితాలను రూపొందించాలని అధికారులను సీఎస్‌లు, ఎస్‌ఆర్ అధికారులు ఆదేశించారు. ఇందుకోసం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విభజన ప్రక్రియ ప్రారంభమైతే రెండు నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు.
ఎస్‌ఆర్ విభాగానికి పూర్తిస్థాయి అధికారి..
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగానికి పూర్తిస్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించి, బాధ్యతలు అప్పగిస్తామని సీఎస్‌లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంట్లో ఇరు రాష్ట్రాల అధికారులూ ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్‌ఆర్ విభాగానికి సభ్య కార్యదర్శిగా పీవీ రమేష్ ఉన్నారు. కాగా... విభజనను త్వరగా పూర్తిచేయాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీలు పాల్గొన్నారు.