ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు
ఆంధ్ర ఉద్యోగులను పంపే కుట్ర : టీ ఉద్యోగ జేఏసీ
8 ఎఫ్‌ను తొలగించాలి
స్థానికత ధ్రువపత్రాలు వెబ్‌సైట్లో పెట్టాలి
హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆప్షన్లను తొలగించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల విభజనలో భాగంగా తెలంగాణలోని ఖాళీల్లోకి ఆంధ్రా ఉద్యోగులను పంపించే కుట్ర జరుగుతోందని జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే విభజన మార్గదర్శకాల్లో ‘18 ఎఫ్’ క్లాజును పెట్టారని మండిపడ్డారు. దానిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవోల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. అనంతరం దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) పరిధి నుంచి తొలగించి, స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని.. లేదా తెలంగాణ రాష్ట్ర అధికారులకు అందులో భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబరు 31లోగా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని.. రాష్ట్ర స్థాయి అధికారులు, సిబ్బందితోపాటు జోనల్, మల్టీజోనల్, జిల్లా స్థాయిల్లోనూ ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరారు. ఉద్యోగుల స్థానికత తదితర వివరాలను తెలియజేసే ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు. ఉద్యోగుల సర్వీసు బుక్ నిర్మాణమే సరిగా లేదని, అందులో స్థానికత అంశమే లేదని, ఈ విషయాన్ని కమలనాథనే చెప్పారని దేవీప్రసాద్ చెప్పారు. అనంతరం తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ... కమలనాథన్ కమిటీ ఉత్సవ విగ్రహంలా మారిందని, ఆంధ్రప్రదేశ్ అధికారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. మిగులు ఉద్యోగులను ఎక్కడి వారిని అక్కడే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు కేసీఆర్ అంగీకరించారని చెప్పారు.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది: శ్రీనివాస్‌గౌడ్
కమలనాథన్ కమిటీకి ఎన్నో వినతిపత్రాలు అందజేసినా చివరకు తాము భయపడ్డ తరహాలోనే నిర్ణయం తీసుకున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి చెందిన వారు అదే ప్రాంత ప్రభుత్వంలో పనిచేసేలా కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. తాజా మార్గదర్శకాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉన్నాయని విమర్శించారు.