సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, పదవీ విరమణ జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్దేశిత జాబితాలోని నెట్‌వర్క్ ఆసుపత్రులన్నింటిలో ఇన్‌పేషెంట్ వైద్యసేవలు పొందొచ్చు. ఈ పథకాన్ని ‘వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం’గా పరిగణిస్తారని ప్రభుత్వం పేర్కొంది.
జాబితాలో పేర్కొన్న వ్యాధులన్నింటికీ ఏమాత్రం ఆర్థిక పరిమితి లేకుండా నగదురహిత చికిత్సలు పొందొచ్చు. జర్నలిస్టుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తారని సర్కారు స్పష్టంచేసింది. తెల్లరేషన్‌కార్డున్న జర్నలిస్టులు ఆరోగ్యశ్రీ పథకంలోనైనా ఉండొచ్చు... లేదా జర్నలిస్టుల ఆరోగ్యపథకంలోనైనా చేరొచ్చు. అయితే రెండింటిలో ఉండటాన్ని అనుమతించరు.
మార్గదర్శకాలు ఇవే...
* జర్నలిస్టులపై ఆధారపడిన తల్లిదండ్రులకూ ఈ పథకం వర్తిస్తుంది. దత్తత పిల్లలకు, నిరుద్యోగ కూతుళ్లు, పెళ్లికాని వారు లేదా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారికీ, అలాగే 25 ఏళ్లలోపున్న నిరుద్యోగ కుమారులకూ వర్తిస్తుంది.
* వైద్య, సర్జిక ల్ చికిత్సలకు ఇన్‌పేషెంట్ వైద్యం పొందొచ్చు. చికిత్స పూర్తయ్యే వరకు నగదురహిత చికిత్సలు పొందొచ్చు. వైద్య పరీక్షలు, మందులు, డిశ్చార్జ్ అయ్యాక పది రోజుల వరకు మందులు తదితర సదుపాయాలు వర్తిస్తాయి.
* నిర్దేశిత ప్యా కేజీ మేరకు ఏడాదిపాటు కన్సల్టేషన్, ఫాలోఅప్ వైద్య సేవలు వంటివి కూడా పొందొచ్చు.
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ వైద్య సేవలు అందుతాయి. దానికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేస్తారు.
* ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రులన్నీ జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తాయి.
* ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రకారమే ఇస్తారు.
* జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అమలు చేస్తుంది. సమాచార పౌరసంబంధాలశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆరోగ్య పథకం కిందికి వచ్చే జర్నలిస్టుల వివరాలన్నింటినీ ఈ శాఖే ఆరోగ్యశ్రీకి అందజేస్తుంది. అనంతరం అక్కడి నుంచే జర్నలిస్టుల ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. కార్డులను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబరే జర్నలిస్టుల ఆరోగ్య పథకం గుర్తింపు నంబర్‌గా పరిగణిస్తారు.
* ఆరు నెలల తర్వాత పథకం అమలుతీరును ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకం కింద 60 శాతం మేరకు సేవలు అందించాయా లేదా అన్నదీ సమీక్షిస్తారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘60 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకం
Published Thu, Jul 23 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement