Working journalists
-
ఏపీ: వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఫ్రీ హెల్త్ క్యాంపు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా అహర్నిశలు శ్రమించి విధులు నిర్వహించే ఫ్రంట్ లైన్లో జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖలు సంయుక్తంగా హెల్త్‌క్యాంప్ నిర్వహిస్తున్నాయి. జర్నలిస్టులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. విజయవాడలోని లయోలా ఇంజినీరింగ్ కాలేజీలో మే 13, 14వ తేదీల్లో రెండు రోజుల పాటు హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ క్యాంప్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. జర్నలిస్ట్ కుటుంబాలకు ఫ్రీగా వైద్య సేవలు అందించేందుకు ఆంధ్రా హాస్పిటల్, కేపిటల్, కామినేని, సెంటిని, పిన్నమనేని, అమెరికన్ ఆంకాలజీ & ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డిక్ సెంటర్, HCG క్యూరి సిటీ క్యాన్సర్ సెంటర్ & హార్ట్ కేర్ సెంటర్, సన్ రైజ్, అను, స్వర హాస్పిటల్.. మొత్తం 11 ప్రముఖ ఆస్పత్రులకు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందంచే ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనుంది. ఇప్పటికే https://forms.gle/UEKdx4fZG7yUGBns7 లింక్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు.. శనివారం(మే 13వ తేదీ) ఉదయం 7 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు హెల్త్ క్యాంపులో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. తొలి రోజు వర్కింగ్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేస్తారు. రెండో రోజు(మే 14వ తేదీన) డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(హెల్త్ క్యాంపు) లో మామోగ్రామ్, హృద్రోగ సంబంధిత టెస్ట్ లు, ఈసీజీ, 2డీఎకో, ట్రేడ్ మిల్ టెస్ట్(టిఎంటీ), ఆల్ట్రా సౌండ్ స్కానింగ్, సీబీపీ, లివర్ పంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొపైల్ టెస్ట్, థైరాయిడ్, డయాబెటిక్ టెస్ట్ లు, ఎక్స్ రే, కళ్లు, డెంటల్ పరీక్షలు వంటి తదితర 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చిన్న పిల్లలకు సైతం అవసరమైన వైద్య సదుపాయం అందిస్తారు. హెల్త్ క్యాంపులో నిర్ధారిత పరీక్షలు చేశాక.. అత్యవసర వైద్య సేవలు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సాయం పొందాల్సి వస్తే ఆరోగ్యశ్రీ అనుబంధిత ఆస్పత్రుల(రిఫరల్ హాస్పిటల్)కు వెళ్లడానికి జర్నలిస్ట్ హెల్త్ కార్డు తప్పనిసరి. కాబట్టి కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన జర్నలిస్టులు హెల్త్ కార్డు పొందడానికి వీలైనంత త్వరగా రూ.1,250 చెల్లిస్తే, దీనికి ప్రభుత్వం తరపున మరో రూ.1,250 చెల్లిస్తుందని కమిషనర్ విజయ్‌కుమార్ వెల్లడించారు. అవసరం మేరకు హెల్త్ క్యాంపులో కూడా కొత్తగా హెల్త్ కార్డు పొందే సదుపాయాన్ని ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. క్యాంపుకు హాజరయ్యే జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లేదంటే విధులు నిర్వర్తిస్తున్న సంస్థకు సంబంధించిన గుర్తింపు(ఐడీ) కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. ఈ క్యాంప్ నిర్వహణ కోసం.. ప్రభుత్వం చర్చలు జరిపింది. మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, విడదల రజని, సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరిందర్ ప్రసాద్ సమీక్షలు నిర్వహించారు కూడా. ఇదీ చదవండి: కొర్రీలు పెట్టొద్దు.. ఉదారంగా ఉండండి -
జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు : వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్ట్లందరికి ఇళ్లు స్థలాలు మంజూరు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 267వ రోజు పాదయాత్రలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులు వైఎస్ జగన్‌ను కలిసి వారి సమస్యలపై వినతిపత్రం అందచేశారు. పదవీ విరమణ చేసిన జర్నలిస్ట్‌లకు నెలకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు జర్నలిస్ట్ చనిపోతే భార్యకు నెలకు ఐదువేలు పెన్షన్ ఇవ్వాలని వైఎస్ జగన్‌ను కలిసిన ప్రతినిధులు కోరారు. జర్నలిస్ట్ సమస్యలపై స్పందించిన జగన్.. పూర్తి అధ్యయనం చేసిన తరువాత పెన్షన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జర్నలిజం విభాగాల్లో సాంకేతిక వనరుల కల్పనకు జగన్ హామీ ఇచ్చారు. -
జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లు
తిరుపతి తుడా: వర్కింగ్ జర్నలిస్టులందరికీ త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు వేగవంతంగా ప్రతిపాదనలు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. తుడా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జర్నలిస్టు సంఘాలతో కలెక్టర్ ఇళ్ల స్థలాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు చెప్పారు. తిరుపతి నుంచే ఇళ్ల స్థలాల కేటాయింపులు ప్రారంభమయ్యేలా, అందరికీ రోల్ మోడల్‌గా ఉండేలా తాను స్పీడ్ ప్రాజెక్టు కింద వేగంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూములు లేనందున జీ ప్లస్ త్రీ అపార్టుమెంట్లు నిర్మించి త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు కేటాయించాలని నిర్ణయిచినట్టు చెప్పారు. తిరుపతి అర్బన్ పరిధిలో ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున స్థలాల కేటాయింపు సాధ్యం కాదన్నారు. 1999 సీనియారిటీ లిస్ట్ ప్రకారం గుర్తించిన 124 మంది జర్నలిస్టుల్లో పెండింగ్‌లో ఉన్న 54 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్‌లోని 34 మంది జాబితాను ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపుతానన్నారు. మిగిలిన జర్నలిస్టులు సొసైటీగా ఏర్పడి నిబంధనల మేరకు జాబితా ఇస్తే వెంటనే ప్రతిపాదనలు ప్రారంభిస్తామన్నారు. తిరుమల జర్నలిస్టుల సంఘం నాయకుడు మల్లి, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళీ మోహన్, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, ఇరుగు సుబ్రమణ్యం, జాప్ మీడియా సెంటర్ జిల్లా కన్వీనర్ మనోహర్, సెక్రటరీ సురేంద్రరెడ్డి, జర్నలిస్ట్ ఫోరం నుంచి లక్ష్మీపతి, గిరిధర్, ఫెడరేషన్ నాయకులు శ్రీధర్, ఆదిమూలం శేఖర్, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు కె. గిరిబాబు, రాధాకృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మురళి పాల్గొన్నారు. -
బీమాపై ఏదీ ధీమా!
రూ. 5 లక్షల ప్రమాద బీమాపై సర్కారు ప్రచారం శూన్యం అమల్లోకి వచ్చి నెలన్నర గడిచినా దరఖాస్తులు నిల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9.5 లక్షల మంది డ్రైవర్లు, 40 వేల మంది హోంగార్డులు, 10 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద మరణ బీమా పథకం ఆచరణలో మాత్రం నీరుగారుతోంది. ఈ పథకాన్ని కార్మికశాఖ ప్రారంభించి నెలన్నర గడుస్తున్నా ప్రచారం లేక ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తూ అందలేదు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాల్సిన శాఖలు, అధికారులు దీనివైపు కన్నెత్తి చూడకపోవడంతో పథకం వల్ల లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది. సామాజిక భద్రతలో భాగంగా ‘మే డే’ సందర్భంగా ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తక్కువ వేతనం కలిగిన వారు ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి వీధిన పడే ప్రమాదముందని...అందువల్ల అటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు బీమా కింద బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేని ఈ పథకం కోసం ప్రభుత్వం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ప్రీమియం కూడా చెల్లించింది. 10 లక్షల మందికి బీమా... ఈ బీమా పథకం ద్వారా 18 నుంచి 70 ఏళ్ల వయసుగల ట్రాన్స్‌పోర్టు, నాన్ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కలిపి మొత్తం 10 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రమాదాలు సహా హత్య, అగ్నిప్రమాదం, విషప్రయోగం, నీటిలో మునక, పిడుగుపాటు, కరెంట్ షాక్, పాముకాటు, జంతువు దాడి వల్ల లబ్ధిదారుడు మరణించినా బీమా వర్తించేలా సర్కారు పథకం రూపొందించింది. రాష్ట్ర రవాణా శాఖ నుంచి లెసైన్సు కలిగి ఉన్న ట్రాన్స్‌పోర్టు డైవర్లు, ప్రైవేటు వాహనాలు, గూడ్స్ ట్రాన్స్‌పోర్టు, నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటో డ్రైవర్లు వంటి 9.5 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు. వీరి వివరాలను రవాణాశాఖ నుంచి కార్మికశాఖ సేకరించింది. హోం శాఖలో పనిచేస్తున్న 40 వేల హోంగార్డులతోపాటు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955 ప్రకారం ఐ అండ్ పీఆర్ కమిషనర్ నిర్దేశించిన 10 వేల మంది వివరాలను తీసుకుంది. నిల్ క్లెయిమ్స్: నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం రాష్ట్రంలో నిత్యం 55 ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా 47 మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది డ్రైవర్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే ప్రమాద బీమా ద్వారా ఇంతవరకు ఒక్కరూ లబ్ధి పొందకపోవడం గమనార్హం. బీమా కోసం ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటోడ్రైవర్లు ఆయా ఏరియాల సహాయ కార్మిక అధికార్లను సంప్రదించాలి. కానీ బాధిత కుటుంబాల వారు సంప్రదిస్తే ప్రమాదం జరి గినట్లు పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాచారమివ్వాలని కార్మికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల సమన్వయలేమి వల్ల ఇప్పటివరకు ఒక్క దరఖాస్తూ క్లెయిమ్ కాలేదు. -
జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, పదవీ విరమణ జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా బుధవారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్దేశిత జాబితాలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలో ఇన్‌పేషెంట్ వైద్యసేవలు పొందొచ్చు. ఈ పథకాన్ని ‘వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం’గా పరిగణిస్తారని ప్రభుత్వం పేర్కొంది. జాబితాలో పేర్కొన్న వ్యాధులన్నింటికీ ఏమాత్రం ఆర్థిక పరిమితి లేకుండా నగదురహిత చికిత్సలు పొందొచ్చు. జర్నలిస్టుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తారని సర్కారు స్పష్టంచేసింది. తెల్లరేషన్‌కార్డున్న జర్నలిస్టులు ఆరోగ్యశ్రీ పథకంలోనైనా ఉండొచ్చు... లేదా జర్నలిస్టుల ఆరోగ్యపథకంలోనైనా చేరొచ్చు. అయితే రెండింటిలో ఉండటాన్ని అనుమతించరు. మార్గదర్శకాలు ఇవే... * జర్నలిస్టులపై ఆధారపడిన తల్లిదండ్రులకూ ఈ పథకం వర్తిస్తుంది. దత్తత పిల్లలకు, నిరుద్యోగ కూతుళ్లు, పెళ్లికాని వారు లేదా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారికీ, అలాగే 25 ఏళ్లలోపున్న నిరుద్యోగ కుమారులకూ వర్తిస్తుంది. * వైద్య, సర్జిక ల్ చికిత్సలకు ఇన్‌పేషెంట్ వైద్యం పొందొచ్చు. చికిత్స పూర్తయ్యే వరకు నగదురహిత చికిత్సలు పొందొచ్చు. వైద్య పరీక్షలు, మందులు, డిశ్చార్జ్ అయ్యాక పది రోజుల వరకు మందులు తదితర సదుపాయాలు వర్తిస్తాయి. * నిర్దేశిత ప్యా కేజీ మేరకు ఏడాదిపాటు కన్సల్టేషన్, ఫాలోఅప్ వైద్య సేవలు వంటివి కూడా పొందొచ్చు. * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ వైద్య సేవలు అందుతాయి. దానికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేస్తారు. * ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులన్నీ జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తాయి. * ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రకారమే ఇస్తారు. * జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అమలు చేస్తుంది. సమాచార పౌరసంబంధాలశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆరోగ్య పథకం కిందికి వచ్చే జర్నలిస్టుల వివరాలన్నింటినీ ఈ శాఖే ఆరోగ్యశ్రీకి అందజేస్తుంది. అనంతరం అక్కడి నుంచే జర్నలిస్టుల ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. కార్డులను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్సైట్ నుంచి పొందొచ్చు. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నంబరే జర్నలిస్టుల ఆరోగ్య పథకం గుర్తింపు నంబర్‌గా పరిగణిస్తారు. * ఆరు నెలల తర్వాత పథకం అమలుతీరును ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకం కింద 60 శాతం మేరకు సేవలు అందించాయా లేదా అన్నదీ సమీక్షిస్తారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘60 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు: సీఎం
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఆదేశించారు. అక్రెడిటేషన్ లేకున్నా హెల్త్ కార్డు: అల్లం అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకూ ఈ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షించ దగ్గ విషయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హెల్త్ కార్డుల మంజూరు ఫైల్‌పై సీఎం సంతకం చేసినందుకు జర్నలిస్టుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న విలేకరులకు కూడా త్వరలో ఖర్చులేని వైద్యం అందనుందన్నారు. ఈ కార్డులు లేక ఇటీవల 40 మంది విలేకరులు చనిపోయారని గుర్తు చేశారు. రూ.10 కోట్లు ఉన్న వెల్ఫేర్ ఫండ్‌ను రూ.100 కోట్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సచివాలయ జర్నలిస్టుల చొరవ ఇందులో ఎక్కువగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహదారు రమణాచారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన టీయూడబ్ల్యూజే జర్నలిస్టుల హెల్త్ కార్డుల ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పేర్కొంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యపై సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.