జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు: సీఎం
హైదరాబాద్: తెలంగాణ లోని వర్కింగ్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై మంగళవారం సంతకం చేశారు. హెల్త్ కార్డులు అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఆదేశించారు.
అక్రెడిటేషన్ లేకున్నా హెల్త్ కార్డు: అల్లం
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకూ ఈ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షించ దగ్గ విషయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హెల్త్ కార్డుల మంజూరు ఫైల్‌పై సీఎం సంతకం చేసినందుకు జర్నలిస్టుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న విలేకరులకు కూడా త్వరలో ఖర్చులేని వైద్యం అందనుందన్నారు. ఈ కార్డులు లేక ఇటీవల 40 మంది విలేకరులు చనిపోయారని గుర్తు చేశారు. రూ.10 కోట్లు ఉన్న వెల్ఫేర్ ఫండ్‌ను రూ.100 కోట్లకు పెంచేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సచివాలయ జర్నలిస్టుల చొరవ ఇందులో ఎక్కువగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ సలహదారు రమణాచారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
హర్షం వ్యక్తం చేసిన టీయూడబ్ల్యూజే
జర్నలిస్టుల హెల్త్ కార్డుల ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పేర్కొంది. దీంతో పాటు ఇళ్ల స్థలాలు, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యపై సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.