ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం | KCR Deepavali gift for Pensioners, Telangana Employess | Sakshi
Sakshi News home page

ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం

Published Wed, Oct 22 2014 12:58 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం - Sakshi

ఆరోగ్య భాగ్యం, ఆంక్షల్లేని వైద్యం

  • టీ ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుక
  •   ఉద్యోగ సంఘాలతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
  •   వ్యయ పరిమితి లేకుండా నగదు రహిత వైద్యం
  •   {పీమియం కూడా చెల్లించనక్కర్లేదు
  •   నేడు సీఎం చేతుల మీదుగా హెల్త్‌కార్డుల జారీ షురూ
  •   దశలవారీగా అన్ని శాఖల వారికీ వర్తింపు 
  •   వచ్చే నెల 1 నుంచే వైద్య సేవలు మొదలు
  •   సర్కారుపై ఏటా రూ. 400 కోట్ల మేర భారం
  •   కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు
    •  సమగ్ర వివరాలు
    •  మొత్తం ఉద్యోగులు: 3.19 లక్షలు
    •  హెల్త్ కార్డులకు ఎన్‌రోల్ చేసుకున్నది: 2.41 లక్షలు
    •  ఇంకా నమోదు చేసుకోవాల్సింది: 78 వేలు
    •  మొత్తం పెన్షనర్లు: 2.56 లక్షలు
    •  ఇప్పటివరకు నమోదైన వారు: 1.19 లక్షలు
    •  ఇంకా మిగిలిన వారు: 1.37 లక్షలు
    •  వైద్య సేవలు అందించే ఆసుపత్రులు: 460
    •  ప్రభుత్వం గుర్తించిన రోగాల సంఖ్య: 1,885
     
     సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఆంక్షల్లేని వైద్య సేవల కల నెరవేరింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి పరిమితి లేకుండా, వైద్యానికి ఎంత ఖర్చయినా, ఆ మొత్తాన్ని భరించేందుకు ఆయన అంగీకరించారు. దీంతో దాదాపు 5.75 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇకపై ఆంక్షల్లేని వైద్యం అందనుంది. గత ప్రభుత్వాల హయాంలో అనేకసార్లు సమావేశాలు జరిగినా ఈ విషయం కొలిక్కిరాలేదు. వైద్య సౌకర్యాలు, నగదు పరిమితి తదితర అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో హెల్త్‌కార్డుల జారీపై తాజాగా సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఉద్యోగవర్గాలను  సంతృప్తిపరిచేలా నిర్ణయం తీసుకున్నారు. హెల్త్ కార్డుతో వచ్చే నెల 1 నుంచి అన్ని రిఫరల్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యాన్ని పొందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారమే కొంత మంది ఉద్యోగులకు(100 మంది వరకు) కేసీఆర్ స్వయంగా హెల్త్ కార్డులను జారీ చేసి ప్రక్రియను ప్రారంభించనున్నారు. క్రమంగా మిగతా ఉద్యోగులు, పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు అందుతాయి. మొదట ఉద్యోగులకు ఈ పథకం అమలుకానుంది. ప్రభుత్వరంగ సంస్థలు, మున్సిపల్, ఎయిడెడ్, గ్రంథాలయ తదితర శాఖల ఉద్యోగులకు దశలవారీగా వర్తింపజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధ, గురువారాల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరణ వంటి అంశాలపై దీపావళి తర్వాత.. అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలతో వస్తే చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దేవీప్రసాద్ వెల్లడించారు.
     
     ప్రీమియం, పరిమితి నిబంధనలన్నీ రద్దు
     ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. రెండు లక్షల రూపాయల వరకే వైద్య ఖర్చుల పరిమితి నిబంధనన తాజాగా తొలగిపోయింది. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు. గతంలో 345 రోగాలకు వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే పొందాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం దీన్ని కూడా తొలగించారు. అలాగే గత ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు నెలకు రూ. 90 చొప్పున, అధికారులు రూ. 120 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఏటా రూ. 86.27 కోట్లవుతుంది. దీనికితోడు ప్రభుత్వం తన వాటాగా రూ. 129 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. అయితే కేసీఆర్ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు, పెన్షనర్లు పైసా చెల్లించాల్సిన అవసరముండదు. స్టంట్లకు ఇంత మొత్తమే చెల్లించాలని విధించిన ప్యాకేజీలు రద్దయినట్లే. ప్రీమియం విధానంపై కొంతమంది అధికారులు సూచనలు చేసినా సీఎం పట్టించుకోలేదు. ఉద్యోగుల నుంచి పైసా తీసుకోవద్దని, ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఉచిత వైద్యం కారణంగా ప్రభుత్వంపై ఏటా దాదాపు 400 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.
     
     ఆరు నెలల తర్వాత సమీక్ష!
     ఈ పరిమితి లేని నగదు రహిత వైద్య విధానం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని సమీక్షించనుంది. ఆలోగా ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను రూ. 100 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. నిలోఫర్ ఆసుపత్రిని రూ. 30 కోట్లతో, మిగతా ఆసుపత్రులకు రూ. 25 కోట్ల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగ నేతలకు సీఎం కేసీఆర్ తెలియజేసినట్లు సమాచారం. ఆరు నెలల తర్వాత ఉద్యోగులు, పెన్షనర్లంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడాన్ని తగ్గించాలని, తద్వారా 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందేలా చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక ్టర్ రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతోపాటు ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, వెంకట్‌రెడ్డి, విఠల్, చంద్రశేఖర్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, మమత, హర్షవర్ధన్‌రెడ్డి, రాజిరెడ్డి, మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలన్నీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో సంబురాలు జరుపుకున్నాయి. 
     
     రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్
     తనది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వంగా కేసీఆర్ నిరూపించారు. ఏ రాష్ట్రంలో లేని ఆరోగ్య విధానాన్ని తెచ్చారు. ఉద్యోగులపై సీఎంకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజా సేవలో సర్కారుకు అండగా ఉంటాం. ఆరు నెలల్లో రాష్ర్టంలో పాలనను దేశానికే ఆదర్శమయ్యేలా చేస్తాం. పీఆర్‌సీ కూడా ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సర్వీసు రూల్స్‌పై ఉద్యోగ సంఘాల తరఫున ప్రతిపాదనలు అందజేస్తాం.
     
     గత ప్రభుత్వాలు తేల్చనేలేదు: టీజీవోల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్
     
     హైల్త్ కార్డులపై గత ప్రభుత్వాలు 42 సార్లు సమావేశాలు పెట్టినా తేల్చలేదు. ఉద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి.. నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించేందుకు అంగీకరించారు. ఉద్యోగుల ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. ఏ జబ్బుకైనా వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్కారు ఆదాయం పెంచడంలో ఉద్యోగులంతా భాగస్వాములవుతారు.
     
     ఎయిడెడ్ టీచర్లకూ సీఎం హామీ: పీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి
     ఎయిడెడ్ టీచర్లకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీఎం ఆకాంక్షల మేరకు విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులంతా కృషి చేస్తారు. ఇందుకు రాష్ర్టంలోని లక్షన్నర మంది టీచర్లు పాటుపడతారు. 
     
     సర్వీసు రూల్స్‌లో మార్పులు: టీ-ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్
     ఉద్యోగులకు అమలు చేస్తున్న బ్రిటీష్‌కాలం నాటి సర్వీసు రూల్స్ మార్పునకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతిపాదనలతో రమ్మని చెప్పారు. నిబంధనలన్నీ తొలగించి ఉద్యోగులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన ఘనత కేసీఆర్‌దే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement