రూ. 5 లక్షల ప్రమాద బీమాపై సర్కారు ప్రచారం శూన్యం
అమల్లోకి వచ్చి నెలన్నర గడిచినా దరఖాస్తులు నిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9.5 లక్షల మంది డ్రైవర్లు, 40 వేల మంది హోంగార్డులు, 10 వేల మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా ప్రమాద బీమా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ప్రమాద మరణ బీమా పథకం ఆచరణలో మాత్రం నీరుగారుతోంది. ఈ పథకాన్ని కార్మికశాఖ ప్రారంభించి నెలన్నర గడుస్తున్నా ప్రచారం లేక ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తూ అందలేదు. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాల్సిన శాఖలు, అధికారులు దీనివైపు కన్నెత్తి చూడకపోవడంతో పథకం వల్ల లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది.
సామాజిక భద్రతలో భాగంగా ‘మే డే’ సందర్భంగా ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. తక్కువ వేతనం కలిగిన వారు ఏదైనా అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తే ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయి వీధిన పడే ప్రమాదముందని...అందువల్ల అటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు బీమా కింద బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేని ఈ పథకం కోసం ప్రభుత్వం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొని ప్రీమియం కూడా చెల్లించింది.
10 లక్షల మందికి బీమా...
ఈ బీమా పథకం ద్వారా 18 నుంచి 70 ఏళ్ల వయసుగల ట్రాన్స్‌పోర్టు, నాన్ ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు కలిపి మొత్తం 10 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రమాదాలు సహా హత్య, అగ్నిప్రమాదం, విషప్రయోగం, నీటిలో మునక, పిడుగుపాటు, కరెంట్ షాక్, పాముకాటు, జంతువు దాడి వల్ల లబ్ధిదారుడు మరణించినా బీమా వర్తించేలా సర్కారు పథకం రూపొందించింది. రాష్ట్ర రవాణా శాఖ నుంచి లెసైన్సు కలిగి ఉన్న ట్రాన్స్‌పోర్టు డైవర్లు, ప్రైవేటు వాహనాలు, గూడ్స్ ట్రాన్స్‌పోర్టు, నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటో డ్రైవర్లు వంటి 9.5 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు. వీరి వివరాలను రవాణాశాఖ నుంచి కార్మికశాఖ సేకరించింది. హోం శాఖలో పనిచేస్తున్న 40 వేల హోంగార్డులతోపాటు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955 ప్రకారం ఐ అండ్ పీఆర్ కమిషనర్ నిర్దేశించిన 10 వేల మంది వివరాలను తీసుకుంది.
నిల్ క్లెయిమ్స్: నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం రాష్ట్రంలో నిత్యం 55 ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా 47 మంది మృత్యువాత పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది డ్రైవర్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే ప్రమాద బీమా ద్వారా ఇంతవరకు ఒక్కరూ లబ్ధి పొందకపోవడం గమనార్హం. బీమా కోసం ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు, నాన్ ట్రాన్స్‌పోర్టు ఆటోడ్రైవర్లు ఆయా ఏరియాల సహాయ కార్మిక అధికార్లను సంప్రదించాలి. కానీ బాధిత కుటుంబాల వారు సంప్రదిస్తే ప్రమాదం జరి గినట్లు పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమాచారమివ్వాలని కార్మికశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల సమన్వయలేమి వల్ల ఇప్పటివరకు ఒక్క దరఖాస్తూ క్లెయిమ్ కాలేదు.
బీమాపై ఏదీ ధీమా!
Published Sat, Oct 3 2015 2:48 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement