డీటీసీ, ఆర్టీవో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున వసూళ్లు
అయ్యగారికి రూ.10 కోట్లు సమర్పయామి
ముడుపులు ఇవ్వని ముగ్గురు అధికారులకు దక్కని పోస్టింగులు
అదనపు కమిషనర్ కావాల్సిన ఉన్నతాధికారి హఠాత్తుగా విశాఖకు బదిలీ
‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..! పిల్లలకు చాలు పప్పు బెల్లాలు..!’ అంటూ దసరా పాట ఒకప్పుడు వినిపించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకున్నా రవాణా శాఖలో కొత్త పాట వినిపిస్తోంది. ‘అయ్యగారికి చాలు 10 కోట్ల రూపాయలు..!’ అని అంటున్నారు!! అన్నట్టుగానే బదిలీలకు ముడుపులు వసూలు చేసి కీలక నేతకు సమర్పించారు.
రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా కీలక నేతే స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ మీ పోస్టులు ఉండాలంటే ముడుపులు చెల్లించాలని హుకుం జారీ చేయడం.. వసూళ్ల కోసం ఏకంగా ముగ్గురు అధికారులను వినియోగించడం విభ్రాంతి కలిగిస్తోంది. – సాక్షి, అమరావతి
పోస్టు ఉండాలంటే ముడుపులు చెల్లించాల్సిందే
రవాణా శాఖలో ఉన్నతాధికారుల బదిలీల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ), ఆర్‌టీవోల బదిలీల్లో భారీ దందా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖలో కీలక నేత ఉన్నతాధికారుల బదిలీల పేరిట హైడ్రామాకు తెరతీశారు. ప్రాధాన్యమున్న కేంద్రాల్లో పోస్టులు కావాలంటే భారీగా సమర్పించుకోవాలని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగాలన్నా... ప్రాధాన్యత పోస్టులకు బదిలీ కావాలన్నా పేషీకి ముడుపులు సమర్పించుకోవల్సిందేనని.. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని సెలవిచ్చారు. అందుకోసం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కేంద్రాన్ని బట్టి డీటీసీ పోస్టుకు రూ.25 లక్షలు, ఆర్‌టీవో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.10 కోట్లు వరకు కీలక నేత పేషీకి సమర్పించారు.
ముడుపులు ఇవ్వని ముగ్గురిపై వేటు
కీలక నేత పేషీ నుంచి ఫోన్లు చేసినా ముగ్గురు డీటీసీలు ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమకు ఎక్కడ పోస్టింగు ఇచ్చినా విధులు నిర్వహిస్తామని, ముడుపులు ఇవ్వలేమని డీటీసీలు పురేంద్ర, రాజారత్నం, మీరా ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. దాంతో ఆ ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం గమనార్హం.
సీనియర్ అధికారిపై కక్ష సాధింపు..
రవాణా శాఖలో కమిషనర్ తరువాత అత్యంత కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(జేటీసీ) రమాశ్రీకి ఆ పోస్టు ఇవ్వాలి. సర్వీసు రికార్డులో ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. అయితే ఆమెను అదనపు కమిషనర్‌గా నియమించేందుకు మంత్రి పేషీ ససేమిరా అంది.
నిబంధనల మేరకు వ్యవహరించే ఆమె కీలక స్థానంలో ఉంటే తమ అక్రమాలకు సాగవని భావించింది. ఈ నేపథ్యంలో రమాశ్రీని హఠాత్తుగా విశాఖ జేటీసీగా బదిలీ చేసి ఆమె కంటే జూనియర్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. భారీ అవినీతికి రంగం సిద్ధం చేస్తున్న కీలక నేత అందుకు వత్తాసు పలికే అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారని రవాణా శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment