స్టాపేజ్‌ రిపోర్ట్‌ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే | High Court key verdict on motor vehicle tax | Sakshi
Sakshi News home page

స్టాపేజ్‌ రిపోర్ట్‌ ఇవ్వకుంటే వాహన పన్ను కట్టాల్సిందే

Published Sun, Dec 22 2024 5:46 AM | Last Updated on Sun, Dec 22 2024 5:46 AM

High Court key verdict on motor vehicle tax

మోటారు వాహనాల పన్నుపై హైకోర్టు కీలక తీర్పు

పన్ను మినహాయింపు కావాలంటే.. వాహనం రోడ్డుపై తిప్పడం లేదని ముందే చెప్పాలి

లేకపోతే వాహనం తిరుగుతున్నట్టే భావించి పన్ను వసూలు చేసే అధికారం రవాణా శాఖకు ఉంది

హైకోర్టు సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసిన సీజే ధర్మాసనం

సాక్షి, అమరావతి: మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన మోటారు వాహనం లేదా వాణిజ్య వాహ­నాలను వాటి యజమానులు రోడ్లపై తిప్పకూడదనుకున్నప్పుడు ఆ విషయాన్ని రాతపూ­ర్వ­కంగా రవాణా శాఖ అధికారులకు తెలియచేసి తీరాలని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పుడు మాత్రమే ఆ వాహనానికి పన్ను మినహాయింపు కోరడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. 

తమ వాహనం లేదా వాహనాలు రోడ్డుపై తిరగడం లేదని, పన్ను చెల్లింపు త్రైమాసిక గడువు ముగిసిన తరువాత ఆ వాహనాలను రోడ్లపై తిప్పబోమంటూ వాహన యజమానులు ‘స్టాపేజ్‌ రిపోర్ట్‌ లేదా నాన్‌ యూజ్‌ రిపోర్ట్‌’ ఇవ్వకుంటే.. వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్టుగానే భావించి పన్ను విధించే అధికారం రవాణా అధికారులకు ఉందని పేర్కొంది. 

ఒకవేళ రవాణాయేతర వాహన యజమాని స్టాపేజ్‌ రిపోర్ట్‌ సమర్పించడంలో విఫలమైన­ప్పటికీ, ఆ తరువాత వాహనాన్ని తిప్పడం లేదని అధికారులకు అన్ని ఆధారాలను ఇస్తే, ఆ వాహనం తిరగడం లేదనే భావించాల్సి ఉంటుందని తెలిపింది. తమ వాహనాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లోపల సెంట్రల్‌ డిస్పాచ్‌ యార్డ్‌ (సీడీవై)లో తిరుగుతు­న్నా­యని, సీడీవై ‘బహిరంగ ప్రదేశం’ కిందకు రాదని, అందువల్ల తమ వాహనాలకు మోటారు వాహన పన్ను మినహాయింపు వర్తిస్తుందన్న తారాచంద్‌ లాసిజ్టిక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. 

ఈ వాదన ఏపీ మోటారు వాహన పన్నుల చట్టంలోని సెక్షన్‌ 12ఏకి విరుద్ధమని తేల్చిచెప్పింది. సీడీవై బహిరంగ ప్రదేశం కిందకు రాదు కాబట్టి, తారాచంద్‌ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్నును తిరిగి వారికి వెనక్కి ఇవ్వా­లని రవాణా అధికారులను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. 

సెక్షన్‌ 12ఏ ప్రకారం స్టాపేజ్‌ రిపోర్ట్‌కు బహిరంగ ప్రదేశం, ప్రైవేటు ప్రదేశం అన్న తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మా­స­నం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. 

రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలన్న సింగిల్‌ జడ్జి
తారాచంద్‌ లాసిజ్టిక్‌ సొల్యూషన్స్‌ కంపెనీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఐరన్‌ స్టోరేజీ, హ్యాండ్లింగ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. ఈ పనులకు 36 వాహనాలను వినియోగిస్తోంది. ఈ వాహనాలు అప్పటివరకు రోడ్లపై తిరిగినందుకు కాంట్రాక్ట్‌ పొందడానికి ముందే సదరు కంపెనీ ఆ వాహనాలకు మోటారు వాహన పన్ను చెల్లించింది. 

పన్ను చెల్లించిన కాల పరిమితి ముగియడంతో అధికారులు ఆ వాహనాలకు రూ.22.71 లక్షల మేర పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై తారాచంద్‌ కంపెనీ తమ వాహనాలు రోడ్లపై తిరగడం లేదని, సీడీవైలోనే తిరుగుతున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలంటూనే రూ.22.71 లక్షల పన్ను చెల్లించింది. ఆ తరువాత తమ వాహనాలకు పన్ను విధించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 2022లో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి తారాచంద్‌ కంపెనీ తన వాహనాలను రోడ్లపై తిప్పలేదని, స్టీల్‌ ప్లాంట్‌ లోపల ఉన్న సీడీవైలోనే తిప్పిందని, అందువల్ల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చారు. ఆ కంపెనీ చెల్లించిన రూ.22.71 లక్షల పన్ను మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని రవాణా అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.

ప్రభుత్వం అప్పీల్‌ చేయడంతో..
ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వాహనదారు పన్ను మినహాయింపు కావాలంటే.. పన్ను చెల్లించాల్సిన త్రైమాసికం మొదలు కావడానికి ముందే సదరు వాహనం తిరగడం లేదంటూ స్టాపేజ్‌ రిపోర్ట్‌ను రాతపూర్వకంగా రవాణా శాఖ అధికారులకు తెలియ­జేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.

వాస్తవానికి మోటారు వాహన పన్ను అనేది పరిహార స్వభావంతో కూడుకున్నదని, పన్నుల ద్వారా వచ్చే మొత్తాలతోనే అన్ని వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా రోడ్లను నిర్వహించడమన్నది ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది. తారాచంద్‌ కంపెనీకి రూ.22.71 లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement