హెల్మెట్ ధరించక 4 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదు
పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి
ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలుంటాయనే భయం ప్రజల్లో కలిగించాలి
చలాన్లు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
విద్యుత్, నీటి సరఫరా ఆపడం వంటివి చేయాల్సిన అవసరముంది
ట్రాఫిక్ పోలీసుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
తదుపరి విచారణకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జనరల్ హాజరవ్వాలి
నిబంధనల అమలుకు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: హెల్మెట్ లేకపోవడం వల్ల చోటు చేసుకుంటున్న మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 667 మంది చనిపోవడం చిన్న విషయం కాదని.. నిబంధనల అమలులో పోలీసుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తాము ఈ విధంగా మరింత మందిని కోల్పోనివ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలు విషయంలో పోలీసులు, ఆర్‌టీఏ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరవ్వాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈ వ్యాజ్యంలో రవాణా శాఖ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చింది. రాష్ట్రంలో మోటారు వాహన చట్ట నిబంధనల అమలుకు ముఖ్యంగా హెల్మెట్లు ధరించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?
రాష్ట్రవ్యాప్తంగా 8,770 మంది ట్రాఫిక్ పోలీసులు ఉండాలి కానీ.. కేవలం 1,994 మందే ఉన్నారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాళ్లు తెలంగాణ సరిహద్దు రాగానే సీటు బెల్టులు పెట్టుకుంటున్నారని.. ఇందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్న భయమే కారణమని పేర్కొంది.
కుటుంబానికి అండగా ఉండే వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే.. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రణతి జోక్యం చేసుకుంటూ.. మొత్తం బాధ్యత పోలీసులదే అంటే సరికాదని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజలను తప్పు పట్టొద్దని, అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని హితవు పలికింది. మోటారు వాహన చట్ట నిబంధనల అమలు, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసే విషయంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
జరిమానాలు కఠినంగా వసూలు చేయాలి..
రాష్ట్రంలో కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయట్లేదని.. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటుచేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేశ్ వాదనలు వినిపిస్తూ.. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని గత విచారణ సమయంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధారణ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని తాము జూన్‌లో ఆదేశాలిచి్చనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారని ప్రశ్నించింది. జూన్ నుంచి సెపె్టంబర్ వరకు 667 మంది చనిపోయారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి తెలిపారు. ఇది చిన్న విషయం కాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రణతి స్పందిస్తూ, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో 5,62,492 చలాన్లు విధించామని చెప్పారు.
కృష్ణా జిల్లాలో 20,824 చలాన్లు విధించి రూ.4.63 లక్షలు జరిమానా వసూలు చేశామన్నారు. ఇది చాలా తక్కువ మొత్తమన్న ధర్మాసనం.. నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకు నిస్సహాయంగా ఉందని ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్న భయాన్ని ప్రజల్లో కలిగించాలని సూచించింది. చలాన్లు కట్టని వారి విద్యుత్ సరఫరా, నీటి సరఫరా ఆపేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
చలాన్లు చెల్లించకపోతే సదరు వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని పోలీసులను, ఆర్‌టీఏ అధికారులను ప్రశ్నించింది. భారీ జరిమానాలు విధించే బదులు.. ఇప్పటికే ఉన్న జరిమానాలను కఠినంగా వసూలు చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment