హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి చలాన్లు వేస్తున్నారు
ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.. ఇలాగే కొనసాగించండి
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ 29కి వాయిదా
సాక్షి, అమరావతి : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాల అమలులో పురోగతి కనిపిస్తోందని హైకోర్టు తెలిపింది. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసు లు చలాన్లు వేయడం ఆశ్నింనించదగ్గ పరిణామమని పేర్కొంది. ఈ విధానాన్ని, అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని పోలీసులను ఆదేశించింది. గత 20 రోజుల్లోనే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు వాహనదారుల నుంచి రూ.95 లక్షలు చలాన్ల రూపంలో వసూలు చేయడం పట్ల కూడా హైకోర్టు సంతృప్తిని వ్యక్తం చేసింది.
చట్ట నిబంధనలను అత్రికమించే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందేనని తేల్చి చెప్పింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే దుష్ప్ర భావాలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యల గురించి పత్రికలు, టీవీల్లో ప్రముఖంగా ప్రకటనలు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. చలాన్లు చెల్లించని వారి వివరాలు వెంటనే రవాణా శాఖ అధికారులకు చేరేలా ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చలాన్ల వసూలు, హెల్మెట్ ధారణ విషయంలో చేపడుతున్న చర్యలు, చలాన్ల వసూళ్లు పెరిగాయా లేదా తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచా రణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చట్ట నిబంధనలు పాటించడం లేదంటూ
కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడంలేదని, దీంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ని సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. తమ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కొంత మేర చర్యలు చేపట్టారని ధర్మాసనం తెలిపింది.
అయినప్పటికీ ప్రతి 10 మందిలో ఇద్దరు ముగ్గురే హెల్మెట్ ధరిస్తున్నారంది. తన సిబ్బందిలో ఒకరిని రోడ్డుపైకి పంపి ఈ విషయాన్ని రూఢీ చేసుకున్నానని సీజే తెలిపారు. ఈ చర్యలు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు.
పిటిషనర్ తాండవ యోగేష్ జోక్యం చేసుకుంటూ.. విజయవాడలోనే తనిఖీలు చేస్తున్నారని, చాలా జిల్లాల్లో తనిఖీలు చేయడం లేదని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. చలాన్లు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు భౌతికంగానే వసూలు చేస్తున్నామని, యూపీఐ ద్వారా కూడా వసూలు చేస్తామని ప్రణతి చెప్పారు. గత 20 రోజుల్లో చలాన్ల రూపంలో రూ.95 లక్షలు వసూలు చేశామన్నారు. గతంలో ఈ మొత్తం ఎంత ఉండేదని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ. 4 లక్షలు ఉండేదని చెప్పారు.
కాగా వచ్చే విచారణలో చలాన్ల మొత్తం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. చలాన్లు చెల్లించని వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని, చట్టం ఏం చెబుతోందని ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ యోగేష్ చట్ట నిబంధనలను వివరించారు. నిర్ణీత కాల వ్యవధిలో చలాన్లు చెల్లించకుంటే అధికారులు సంబంధిత మేజి్రస్టేట్ ద్వారా ఆ వాహనాన్ని జప్తు చేయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment