సభ్యులతో మాట్లాడుతున్న కలెక్టర్ మల్లికార్జున
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న 301 మంది జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రతిపాదనల్ని ఆమోదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ డా.ఎ.మల్లికార్జున తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులు ప్రభుత్వ ఉత్తర్వుల్ని అనుసరించి వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులతో పాటు అవసరమైన ధృవపత్రాల కాపీలను జిల్లా పౌర సంబంధాల కార్యాలయానికి అందజేయాలన్నారు.
జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అక్రిడిటేడ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కోర్డినేటర్ డా.రాజేష్‌ని ఆదేశించామన్నారు. ప్రధాన పత్రికలు మినహా ఇతర పేపర్లలో విధులు నిర్వహిస్తున్న నిరుపేద రిపోర్టర్లకు జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌కు అవసరమైన చలానా నగదుని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యుడు, సాక్షి బ్యూరో చీఫ్, కె.రాఘవేంద్రారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డా.మల్లికార్జున హెల్త్‌స్కీమ్ చలానాల్ని సీఎస్‌ఆర్ నిధుల్లో భాగంగా చెల్లించేందుకు అంగీకరించారు.
అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం ఆర్టీసీ పాస్ చెల్లుబాటు అయ్యేలా చూడాలని కమిటీ సభ్యులు కోరగా.. ఇప్పటికే దానికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎన్‌ఎస్‌ఆర్‌కే బాబూరావు, చిట్టిబాబు, అనురాధ, డి.రాణి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్, మోహనలక్ష్మి, ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, కన్వీనర్, మెంబర్ మణిరామ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment