ఇది.. మరచిపోలేని రోజు | It was a memorable day .. | Sakshi
Sakshi News home page

ఇది.. మరచిపోలేని రోజు

Published Sun, Sep 28 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

ఇది.. మరచిపోలేని రోజు

ఇది.. మరచిపోలేని రోజు

  •  కేసీఆర్ ఆశీస్సులతో హెల్త్ యూనివర్సిటీ మంజూరు
  •  ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య
  •  కేఎంసీలో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయం ప్రారంభం
  •  వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌చందా
  • పోచమ్మమైదాన్ : తన హయూంలో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ మంజూరు కావడం మరచిపోలేనని,  తన జీవితంలో ఇంతకంటే సంతోషమైన రోజు ఎన్నడూ లేదని డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో శనివారం కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కార్యాలయూన్ని ప్రారంభించారు.

    ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ పుట్టిన గడ్డకు, చదివిన కళాశాలకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగి... కేసీఆర్‌ను మెప్పించి వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీని మంజూరు చేయించుకోగలిగామన్నారు. హెల్త్ యూనివర్సీటీకి కాళోజీ పేరు పెట్టడం సైతం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.

    సీఎం కేసీఆర్ అశీస్సులతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాజ్యం ఇది ..... మనం అనుకున్నది సాధించకున్నామని, ప్రతిఒక్కరూ సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆరోగ్య సేవలను విస్తరించే దిశగా ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ లోపు హెల్త్ యూనివర్సిటీ వస్తే... మన విద్యార్థులు ఇక్కడే నమోదు చేసుకోవచ్చనే ఉద్దేశంతో  కేసీఆర్ ఇంత వేగంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

    మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని, అందుకే కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య కృషి చేయడం వల్లే సీఎం కేసీఆర్ మంజూరుచేశారని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తదో అన్నారు కాదా .... ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. మన ఆత్మగౌరవం మనకు దక్కింది... మన ఇంటిని మనం పాలించుకునే అవకాశం దక్కిందన్నారు.

    తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో పీజీ చేసిన తర్వాత వారు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని... ఏపీలో మన తెలంగాణ వారు నాన్‌లోకల్ అవుతున్నారని... ఈ సమస్యను తేల్చాలని సీతారాం నాయక్ కోరారు. వెంటనే డీఎంఈ శ్రీనివాస్ స్పందించి అక్కడ చదివిన విద్యార్థులు ఎన్‌ఓసీ అందజేస్తే... వెంటనే ఇక్కడ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేలా ఆర్డర్లు అందజేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    ఉపముఖ్యమంత్రి రాజయ్య కృషి, పట్టుదలతో వరంగల్‌కు హెల్త్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. వరంగల్ జిల్లా అభివృద్ధికి మేధావులు, నిపుణులు సలహాలు ఇవ్వాలని, వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ చందాకు ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

    కార్యక్రమంలో డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, ఐఎంఏ ప్రతినిధులు పెసరు విజయచందర్ రెడ్డి, భూమిగారి మోహన్ రావు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, డీఐఓ సూర్యప్రకాష్, ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ పాండురంగ జాదవ్, హాస్టల్ వార్డెన్ సీతామహాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే  దోనెపూడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement