ఎబోలా మృతులు 1,229
జెనీవా: పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం తెలిపింది. ఈనెల 14, 16 తేదీల మధ్యనే 84 మంది ఎబోలాతో మరణించారని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌నుంచి ఇప్పటివరకూ 2,240 కేసులు నమోదయ్యాయని, పశ్చిమాఫ్రికాలోని గినియా లో తొలుత మొదలైన ఎబోలా వైరస్ మిగతా దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.
ఎబోలాతో అస్వస్థులైనవారిని ప్రత్యేక ఏర్పాట్లతో ఆసుపత్రుల్లో చేర్చారు, వారి ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కాగా, ఎబోలాతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పదిలక్షలమంది బాధితులకు 3నెలలపాటు ఆహార పంపిణీకోసం సన్నాహాలు చేస్తున్నట్టు ఐరాస తెలిపింది.