ఇబోలా ఎఫెక్ట్: నైజీరియాలో అత్యవసర పరిస్థితి
నైజీరియాలో ఇబోలా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అబుజా నగరంలో ఇబోలా విజృంభణపై దేశ రాజధాని నగరంలో ఆరోగ్య అంశాలపై హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కమిటీ ఓ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓన్యెబుచి చుక్వు తెలిపారు. ఇబోలా వైరస్ సోకినట్లు నిర్ధారించిన ఆరుగురు నైజీరియన్లలో ఒకరు మంగళవారం మరణించారని, మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఇబోలా వైరస్ ముప్పు ఉందని, నైజీరియా అనుభవం ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగించిందని ఆరోగ్య మంత్రి చెప్పారు. చేదుగా ఉండే కోలా వక్కలు ఈ అతి ప్రమాదకరమైన వైరస్ను అదుపు చేస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆయన తెలిపారు. గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా వచ్చిన ఈ వ్యాధి ఇప్పటివరకు 1711 మందికి సోకగా, నాలుగు పశ్చిమాఫ్రికా దేశాలలో 932 మంది ప్రాణాలను బలిగొంది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఈ వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.