నగరంలో అనుమానిత వైరస్?
- గాంధీలో బాధితుడికి ప్రత్యేక వైద్యం
- నమూనాలు ఢిల్లీకి.. నేడు నివేదిక అందే అవకాశం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు నవంబర్ 21న నైజీరియా నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
నవంబర్ 24న తీవ్ర జ్వరంతో నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేయగా అతనిలో అనుమానిత వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారి సూచన మేరకు అతడిని సోమవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి యంత్రాంగం వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి అతడికి ప్రత్యేక వైద్యసేవలందిస్తోంది. రోగి నుంచి సేకరించిన నమూనాలను సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ల్యాబొలేటరీకి పంపినట్లు ఆస్పత్రి వైరాలజీ విభాగం ఇంచార్జి డాక్టర్ నరసింహులు తెలిపారు. కాగా ఈ వైరస్ ఎబోలానా లేక స్వైన్ ఫ్లూ కారక వైరసా, మరొకటా నిర్ధారణ కావాల్సి ఉంది.