ఎబోలా కాదు.. ఆందోళన వద్దు
తేల్చి చెప్పిన గాంధీ వైద్య నిపుణులు
గాంధీ ఆస్పత్రి: అనుమానిత వైరస్‌తో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితునికి సోకింది ఎబోలా వైరస్ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లేబొరేటర్ (ఎన్‌సీడీసీ) నుంచి మంగళవారం రాత్రి అందిన నివేదికలో ‘ఎబోలా నెగిటివ్’అని రిపోర్టు వచ్చిందని స్పష్టం చేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన శ్రీనివాసప్రసాద్ (52) అనుమానిత వైరస్‌తో సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యసేవలు అందజేస్తున్న డాక్టర్లు నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలకు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో లేబొరేటరీ నివేదికలో ఎబోలా కాదని తేలడంతో రాష్ట్ర వైద్య అధికారులు, గాంధీ ఆసుపత్రి వైద్య నిపుణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కొంటాం: నోడల్ అధికారి శుభాకర్
ఎలాంటి వైరస్‌నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఎబోలా, స్వెన్‌ఫ్లూ వంటి వైరస్‌లపై అప్రమత్తంగా ఉండాలి తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎబోలా వ్యాధిపై రాష్ట్ర నోడల్ అధికారిగా వ్యవహరిస్తోన్న డాక్టర్ శుభాకర్ విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలంగాణ హెల్త్ సర్వీసెస్ డెరైక్టర్ సాంబశివరావు, గాంధీ సూపరింటెండెంట్ ధైర్యవాన్, ట్రీటింగ్ ఫిజీషియన్ నర్సింహులతో కలసి శుభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబర్ 19న నైజీరియా ఎబోలా రహిత దేశంగా ప్రకటించుకుందని గుర్తు చేశారు.
5న గాంధీలో ఎబోలాపై సదస్సు
ఈనెల 5న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎబోలాపై అవగాహ న సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్ అధికారి శుభాకర్ తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 లే రేటరీలు పుణే, ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలోని లెవల్-2 లేబొరేటరీలను లెవల్-3కి అప్‌గ్రెడేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ లో గాంధీ, ఏపీలో విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రులు ఎబోలా నోడల్ సెంటర్లుగా పనిచేస్తాయన్నారు.