ఆ వైరస్ ఏమిటో..?
ఎటూ తేల్చని గాంధీ వైద్యులు
నైజీరియాకు చెందిన ఓ కొత్త వైరస్‌గా ప్రచారం
సాధారణ వైరల్ ఫీవర్‌గా వైద్యుల వెల్లడి
గాంధీ నుంచి ఎబోలా వార్డును మార్చాలని డిమాండ్
సిటీబ్యూరో: అనుమానిత వైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల బాధితునికి సోకింది ఏ వైరస్ అనేది ఇంకా స ్పష్టం కాలేదు. బాధితునికి సోకింది ఎబోలా వైరస్ కాదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లాబోరేటరీ (ఎన్‌సీడీసీ) పరీక్షల్లో తేలడంతో ఈ వైరస్ గుర్తింపు అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఓ కొత్తరకం వైరస్ కావొచ్చని కూడా ప్రచారం ఊపందుకుంది. అయితే బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. బాధితుడు సాధారణ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు ఎబోలా రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ శుభాకర్ స్పష్టం చేశారు. అ ంతేకాకుండా ఆయన ఆరోగ్యపరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతోందని పేర్కొన్నారు.
ఎబోలా వార్డుపై వైద్యుల అభ్యంతరం
ఆస్పత్రి ఏడో అంతస్థులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వెళ్లేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఒక వేళ అటు వెళ్తే ఎక్కడ ఆ వైరస్ తమకు వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. స్టేట్ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం నర్సింహులు (ట్రీటింగ్ ఫిజీషియన్), వినోద్ (ఎపిడిమియాలజిస్ట్), సత్యమూర్తి (మైక్రోబయాలజీ)లు మినహా ఇతరులెవ్వరూ వెళ్లడానికి సాహసించడం లేదు. ఆ స్పత్రిలో ఎబోలా వార్డును ఏర్పాటు చేయడంపై వైద్యులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో జనసంచారం లేని ప్రాంతంలో ఎబోలా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలంటున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే గాంధీలో దీన్ని ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్, సిద్ధిపేట రమేష్‌లు ప్రశ్నించారు.
కిడ్నీపై ప్రభావం...
గాంధీ ఆస్పత్రి : గాంధీ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితుని కిడ్నీపై వైరస్ ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. అలాగే మూత్రం ఎరుపురంగుకు మారడంతో మూత్రం ద్వారా రక్తం బయటకు వెళ్లిపోతుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రెండు లక్షణాల ఆధారంగా రూపాంతరం చెందిన కొత్త వైరస్ అని భావిస్తున్నారు. కిడ్నీ ప్రభావంపై నెఫ్రాలజీ వైద్య నిపుణులతో చర్చిస్తున్నామని ట్రీటింగ్ ఫిజీషియన్ నర్సింహులు తెలిపారు. పూర్తిస్థాయిలో నయం అయ్యేవరకు బాధితున్ని ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్యసేవలు అందిస్తామని ఆయన అన్నారు.
రేపు గాంధీలో అవగాహన సదస్సు
ఎబోలా వైరస్‌పై ఈ నెల ఐదో తేదీన గాంధీఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర నోడల్ అధికారి శుభాకర్ తెలిపారు. బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబోరేటరీలు పూణే, ఢిల్లీలో మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలోని లెవల్-2 లాబోరేటరీలను లెవ ల్-3కి అప్‌గ్రేడేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ ఎబోలా దేశంలోకి ప్రవేశించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో గాంధీ, ఏపీలో కేజీహెచ్ ఆస్పత్రుల్లో ఎబోలా నోడల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.