బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్‌లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ భోలక్‌పూర్ కృష్ణానగర్ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్‌లో మాదాపూర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు.
మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్ బ్యాంక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు.
అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్ డివిజన్ ఏసీపీ మొగులయ్య, ఇన్‌స్పెక్టర్ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment