Srinivas Prasad
-
75వ బర్త్‌డే: రాజకీయాలకు బీజేపీ ఎంపీ గుడ్‌బై
సాక్షి, బెంగళూరు: చామరాజనగర బీజేపీ ఎంపీ వీ శ్రీనివాస ప్రసాద్ తన 75వ పుట్టిన రోజున రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. శుక్రవారం మైసూరులోని జయలక్ష్మపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తంగా 14 సార్లు ఎన్నికల్లో పోటీచేశానని, 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించానని అన్నారు. నాలుగేళ్ల క్రితమే రిటైర్ అవ్వాలనే నిర్ణయం తీసుకున్నానని, కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మరికొంత కాలం కొనసాగానని అన్నారు. అయితే, చామరాజనగర్ ఎంపీగా ప్రస్తుత పదవీకాలాన్ని పూర్తి చేస్తానని, వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగనని స్పష్టం చేశారు. కాగా 2017లో నంజన్‌గడ్ ఉపఎన్నికలో ఓడినపుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించినా, 2019 లోక్‌సభ బరిలో దిగి విజయం సాధించిన శ్రీనివాస ప్రసాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ రంగంలో తన అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాసిన పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు శ్రీనివాస్ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. ‘‘నిజాయితీ లేని వారికి, అవినీతిపరులకు చివరి గమ్యస్థానం రాజకీయాలే అని జార్జ్ బెర్నార్డ్ షా చెప్పినప్పటికీ.. రాజకీయ జీవితం అనేది సామాజిక సేవకై నిబద్ధతగా నిర్వర్తించే ఒక విధిగా నేనెలా భావించాను అన్న అంశాలను ఇందులో ప్రస్తావించాను’’ అని పేర్కొన్నారు. -
ఒకే ఒక్కడు !
పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్ ‘సహాయ నిరాకరణ’కు వ్యూహం సిద్ధు రాజకీయ చతురతతో చల్లారిన అసమ్మతి అసంతృప్తుల సమావేశం వాయిదా బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల అమాత్య పదవిని కోల్పోయిన ఆయన సీద్ధును సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూ అందులో భాగంగా అసంతృప్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకురావడానికి విఫలయత్నం చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆయనతో కలిసి రావడానికి నిరకరిస్తున్నారని తెలుస్తోంది. మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ వల్ల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీనివాస్ ప్రసాద్‌తో పాటు ఖమరుల్ఇస్లాం, అంబరీష్‌లతో పాటు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని ముఖభంగం ఎదురైన యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్ వంటి వారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్య తన రాజకీయ చాతుర్యంతో పాటు వివిధ రకాల మార్గాల ద్వారా అసంతృప్తుల ఆగ్రహాన్ని కొంత వరకూ చల్లార్చగలిగారు. దీంతో ఆదివారం బెంగళూరులో జరగాల్సిన ‘అసంతృప్తుల సమావేశం.’ వాయిదా పడింది!. అయితే సిద్ధుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీనివాస ప్రసాద్ మాత్రం పట్టు వీడటం లేదు. అసంతృప్తులకు స్వయంగా ఫోన్ చేసి తమ పోరాటాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాను హైకమాండ్‌తో మాట్లాడుతానని ఇందుకు హైకమాండ్‌లోని కొంతమంది మంది మద్దతు తనకు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా శనివారం రాత్రి పొద్దుపోయాక కోరారు. అయితే ఇందుకు ఎస్.ఎం కృష్ణ అంగీకరించలేదని సమాచారం. అనవసర విషయాలపై దృష్టి సారించి హైకమాండ్ ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. దీంతో తమకు అండగా నిలబడుతారని భావించిన ఎస్.ఎం కృష్ణ ఇలా వ్యాఖ్యానించారని తెలుసుకున్న కొంతమంది అసంతృప్తులు తమ నిరసన దిక్కార స్వరాన్ని తగ్గించేశారు. అయితే పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న అసంతృప్తులతో బెంగళూరులో ఓ సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక వేళ అసంతృప్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అసంతృప్త నాయకులతో కలిసి ‘సహాయ నిరాకరణ’ విధానాన్ని అవలంభించాలని శ్రీనివాస్ ప్రసాద్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఆదివారం నాటికి అసంతృప్తుల ఆగ్రహావేశాలు చాలా వరకూ తగ్గిపోవడం, అసంతృప్తుల సమావేశం వాయిదా పండటంతో సిద్ధరామయ్య కొంతవరకూ ఊపిరి పీల్చుకున్నట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
'అనుమానంతోనే పరీక్షలు, ఎబోలా లేదు'
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్న ఘటనపై సూపరింటెండెంట్ ధైర్యవాన్ స్పందించారు. 'నిన్న సాయంత్రం మూడు గంటలకు గాంధీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి చేరాడు. ఈనెల 21న నైజీరియా నుంచి ఆ వ్యక్తి వచ్చాడు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాం. నైజీరియాలో ఎబోలా ప్రభావం లేదు. పేషెంట్ పేరు, ఊరు, వ్యక్తిగత వివరాలు ప్రసారం చేయొద్దు. అనుమానంతో ఢిల్లీకి శాంపిల్స్ పంపాం. కొన్ని గంటల్లో రిపోర్టు వచ్చింది. ఆ పేషెంట్‌కు ఎబోలా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. కేవలం నైజీరియా నుంచి వచ్చారు కాబట్టి...అనుమానంతో పరీక్షలు చేస్తున్నాం' అని సూపరింటెండెంట్ తెలిపారు. ఎబోలా వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ధైర్యవాన్ తెలిపారు. -
నగరంలో అనుమానిత వైరస్?
గాంధీలో బాధితుడికి ప్రత్యేక వైద్యం నమూనాలు ఢిల్లీకి.. నేడు నివేదిక అందే అవకాశం సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కొత్త వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ ప్రసాద్ (52) నైజీరియాలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతడు నవంబర్ 21న నైజీరియా నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నాడు. నవంబర్ 24న తీవ్ర జ్వరంతో నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు చేయగా అతనిలో అనుమానిత వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారి సూచన మేరకు అతడిని సోమవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి యంత్రాంగం వెంటనే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి అతడికి ప్రత్యేక వైద్యసేవలందిస్తోంది. రోగి నుంచి సేకరించిన నమూనాలను సోమవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని ల్యాబొలేటరీకి పంపినట్లు ఆస్పత్రి వైరాలజీ విభాగం ఇంచార్జి డాక్టర్ నరసింహులు తెలిపారు. కాగా ఈ వైరస్ ఎబోలానా లేక స్వైన్ ఫ్లూ కారక వైరసా, మరొకటా నిర్ధారణ కావాల్సి ఉంది.