పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్
‘సహాయ నిరాకరణ’కు వ్యూహం
సిద్ధు రాజకీయ చతురతతో చల్లారిన అసమ్మతి
అసంతృప్తుల సమావేశం వాయిదా
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస్ ప్రసాద్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ వల్ల అమాత్య పదవిని కోల్పోయిన ఆయన సీద్ధును సీఎం పీఠం నుంచి దింపడమే లక్ష్యంగా తన ప్రయత్నాలను కొనసాగిస్తూ అందులో భాగంగా అసంతృప్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకురావడానికి విఫలయత్నం చేస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఆయనతో కలిసి రావడానికి నిరకరిస్తున్నారని తెలుస్తోంది. మంత్రి మండలి పునర్‌వ్యవస్థీకరణ వల్ల కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీనివాస్ ప్రసాద్‌తో పాటు ఖమరుల్‌ఇస్లాం, అంబరీష్‌లతో పాటు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని ముఖభంగం ఎదురైన యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్ వంటి వారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే.
అయితే సీఎం సిద్ధరామయ్య తన రాజకీయ చాతుర్యంతో పాటు వివిధ రకాల మార్గాల ద్వారా అసంతృప్తుల ఆగ్రహాన్ని కొంత వరకూ చల్లార్చగలిగారు. దీంతో ఆదివారం బెంగళూరులో జరగాల్సిన ‘అసంతృప్తుల సమావేశం.’ వాయిదా పడింది!. అయితే సిద్ధుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీనివాస ప్రసాద్ మాత్రం పట్టు వీడటం లేదు. అసంతృప్తులకు స్వయంగా ఫోన్ చేసి తమ పోరాటాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తాను హైకమాండ్‌తో మాట్లాడుతానని ఇందుకు హైకమాండ్‌లోని కొంతమంది మంది మద్దతు తనకు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణను కలుసుకుని తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా శనివారం రాత్రి పొద్దుపోయాక కోరారు. అయితే ఇందుకు ఎస్.ఎం కృష్ణ అంగీకరించలేదని సమాచారం. అనవసర విషయాలపై దృష్టి సారించి హైకమాండ్ ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. దీంతో తమకు అండగా నిలబడుతారని భావించిన ఎస్.ఎం కృష్ణ ఇలా వ్యాఖ్యానించారని తెలుసుకున్న కొంతమంది అసంతృప్తులు తమ నిరసన దిక్కార స్వరాన్ని తగ్గించేశారు. అయితే పట్టువీడని శ్రీనివాస్ ప్రసాద్ మాత్రం ఒకటి రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న అసంతృప్తులతో బెంగళూరులో ఓ సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక వేళ అసంతృప్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే వచ్చే నెల 4 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో అసంతృప్త నాయకులతో కలిసి ‘సహాయ నిరాకరణ’ విధానాన్ని అవలంభించాలని శ్రీనివాస్ ప్రసాద్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఆదివారం నాటికి అసంతృప్తుల ఆగ్రహావేశాలు చాలా వరకూ తగ్గిపోవడం, అసంతృప్తుల సమావేశం వాయిదా పండటంతో సిద్ధరామయ్య కొంతవరకూ ఊపిరి పీల్చుకున్నట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.