‘మహదాయి’ పై రాజకీయాలు వద్దు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : మహదాయి విషయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. తాగునీటి విషయంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహదాయి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈనెల 21న చర్చలు జరపనున్నామన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న అఖిల పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేశారు. అదే విధంగా గోవాలోని అధికార పార్టీ బీజేపీ కూడా అఖిల పక్షం సమావేశాన్ని అక్కడ ఏర్పాటు చేస్తోందన్నారు. అయితే ఆ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తాము కళసాబండూరికి ఒప్పించాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ పేర్కొనడం సరికాదన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే విపక్షంలో లేదని శివసేనతో పాటు మరికొన్ని పార్టీలు కూడా విపక్ష స్థానంలో ఉన్నాయన్నారు. ‘అఖిల పక్షం సమావేశంలో ప్రభుత్వం అన్ని పార్టీల నాయకుల సలహాల అనంతరం తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ఈ విషయాలు తెలిసి కూడా రాజకీయాలు చేయడం బీజేపీకి తగదు.’ అని సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టీల్‌బ్రిడ్జి పారదర్శకం...
చాళుక్య సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ నిర్మించనున్న స్టీల్‌బ్రిడ్జ్ వివరాలన్నీ బీడీఏ వెబ్‌సైట్‌లో ఉన్నాయని మీడియాసమావేశంలో పాల్గొన్న బెంగళూరు నగరాభివద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అక్రమాలకు తావులేదన్నారు. స్టీల్‌బ్రిడ్జిని ఎస్టీం మాల్ వరకూ పొడగించనున్నామని అందువల్లే ఖర్చు కొంత ఎక్కువగా కనిపిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంలో అన్ని విషయాలు పారదర్శకంగా ఉన్నాయని విపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని కే.జే జార్జ్ అసహనం వ్యక్తం చేశారు.