రక్తదానం = ప్రాణదానం | Square root of negative | Sakshi
Sakshi News home page

రక్తదానం = ప్రాణదానం

Published Mon, Jun 9 2014 10:55 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తదానం = ప్రాణదానం - Sakshi

రక్తదానం = ప్రాణదానం

జూన్ 14పపంచ రక్తదాతల దినం
 
రక్తం శరీరంలోని ప్రతి కణంతో అనుక్షణం అనుసంధానమై ఉండే కీలక అంశం.
ఓ వ్యక్తి జీవంతో మనుగడ సాగించాలంటే కావాల్సిన అత్యంత ప్రధానమైన ద్రవం. ఒక కణంలోని జీవక్రియలన్నీ సక్రమంగా సాగడానికి అవసరమైన ఆక్సిజన్‌నూ, ఆహారాన్ని, పోషకాలనూ అందించే వాహకం. అలాగే జీవక్రియల తర్వాత అక్కడ వెలువడిన వ్యర్థాలను తిరిగి మోసుకుని, వాటిని శుభ్రపరిచే యంత్రాంగాల వద్దకు చేరవేసే మాధ్యం. శరీరంలోని ఏ చిన్న కణానికైనా దాని సరఫరా ఆగిపోతే... ఇక ఆ కణం క్రమంగా చచ్చిపోతుంది. అది మామూలు చిన్న కణమైనా... లేదా అత్యంత కీలకమైన గుండె కండరమైనా సరే. అందుకే ఇంతటి ప్రధానమైన, కీలకమైన, అవసరమైన ఆ ఎర్రటి ద్రవం... నిత్యం ఒక క్రమపద్ధతిలో మన రక్తనాళాల్లో పారుతూ జీవాన్ని పండిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా కొద్దిపాటి ప్రమాదం జరిగినప్పుడు రక్తం వృథా పోకుండా ఆపేసుకోడానికి శరీరానికి ఒక స్వయం నియంత్రిత యంత్రాంగం ఉంటుంది. కానీ పెద్ద ప్రమాదం జరిగి అదే పనిగా రక్తం ప్రవహిస్తూ పోతుంటే... దాన్ని భర్తీ చేయడం అవసరం. అలా భర్తీ చేసేందుకు దాతలు రక్తాన్ని ఇవ్వడమూ అవసరం. అలా భర్తీ చేయాల్సిన ప్రాధాన్యాన్ని వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ జూన్ 14ను ‘స్వచ్ఛంద రక్తదాతల  దినం’ గా నిర్వహిస్తున్నారు.

 
ఈ ఏడాది నినాదం తల్లుల కోసం...

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాతల దినాన ప్రతి ఏడాదీ ఆ సంస్థ ఒక నినాదం లాంటి అంశంతో ప్రపంచ ప్రజలకు ఒక పిలుపునూ, సందేశాన్ని అందిస్తుంటుంది. ఈ ఏడాది నినాదం ‘‘తల్లుల ప్రాణరక్షణ కోసం సురక్షితమైన రక్తం’’ (సేఫ్ బ్లడ్ ఫర్ సేవింగ్ మదర్స్). ప్రసవం ఒక అద్భుతమైన ప్రక్రియ. మరో జీవికి ప్రాణాన్నిచ్చే ఈ సమయంలో కాబోయే తల్లి అనివార్యంగా ఎంతో కొంత రక్తాన్ని చిందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా రక్తస్రావం కారణంగా ప్రసవించే తల్లులు 800 మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. మరికొందరు ఇలాంటి తీవ్రమైన రక్తస్రావం వల్ల దీర్ఘకాలిక వైకల్యాలతో జబ్బులతో బాధపడుతున్నారు. ఈ మరణాలనూ, ఇలాంటి ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌ఓ ఈ థీమ్‌తో ముందుకు వచ్చింది. ఈ నినాదాన్ని అన్ని దిశలా వ్యాపింపజేసి ప్రజలను చైతన్యపరచి కాబోయే తల్లులకు సురక్షితమైన రక్తం అందేలా ప్రజలందరిలోనూ అవగాహన పెంచడమే డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యం.
 
గాయపడినప్పుడు రక్తస్రావం ఆగడానికి ఏం జరుగుతుంది?

శరీరంలోని ఏ భాగంలోనైనా రక్తనాళం తెగి రక్తస్రావం జరుగుతుంటే వెంటనే  ప్లేట్‌లెట్స్ అనే ప్రత్యేక కణాలు రక్తాన్ని గడ్డకట్టించే దిశగా తమ బాధ్యతలను ముమ్మరం చేస్తాయి. ఇవి... రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే మరికొన్ని ప్రోటీన్ల సహాయంతో గాయం అయిన ప్రదేశంలో ఒక వలలాంటి దాన్ని అల్లడానికి ఉపక్రమిస్తాయి. రక్తంలోని ప్రోథ్రాంబిన్ అనే పదార్థం ఇతర గడ్డకట్టించే అంశాల (క్లాటింగ్ ఫ్యాక్టర్ల)తో పాటు  క్యాల్షియం ఆయాన్లూ, ఫాస్ఫోలైపిడ్స్ అనే కొవ్వు పదార్థాలతో కలిసి థ్రాంబిన్ అనే పదార్థంగా రూపొందుతుంది. అది రక్తంలోని గడ్డ కట్టించే పదమూడు ఫ్యాక్టర్లలో కలిసి ఫైబ్రినోజెన్‌గానూ, చివరకు ఫైబ్రిన్‌గానూ మారుతుంది. ఈ ఫైబ్రిన్ అనే పదార్థం పొరలు పొరలుగా ఉంటుంది. ఈ పొరలన్నీ వలలాగా రూపొంది రక్తాన్ని గడ్డలా మారేలా చేస్తాయి. దాంతో ద్రవరూపంలో ఉండే రక్తం కాస్తా ఘనరూపంలోకి మారిపోవడంతో స్రవించడం ఆగిపోతుంది. ఈ ప్రక్రియనే క్లాటింగ్ లేదా రక్తం గడ్డకట్టడం అంటారు. దెబ్బ తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పుడు జీవి మనుగడ సాగించేందుకు  ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ ఏర్పాటు వల్ల రక్తం వృథా పోకుండా ఆగుతుంది. దాంతో ప్రాణాలు నిలబడతాయి. ఏదైనా  కారణాలతో ఏ దశలోనైనా లోపాల వల్ల ఈ మొత్తం రక్తం గడ్డ కట్టే ప్రక్రియలో ఎక్కడ అవాంతరం వచ్చినా ‘క్లాటింగ్’ ప్రక్రియ సరిగా జరగక ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ క్లాటింగ్ పని జరిగే సరికే శరీరానికి అవసరమైన దానికంటే రక్తం పరిమాణం తగ్గితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందుకే రక్తస్రావం అయిన సందర్భాల్లో బయటి నుంచి దాతలు ఇచ్చిన రక్తాన్ని ఎక్కిస్తారు.
 
డిమాండుకు సరిపోయే రక్తం ఉందా...?

ఒక్కోసారి ప్రత్యేకమైన సందర్భాల్లో మన వద్ద ప్రజలు చాలా మానవీయంగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు గత ఏడాది హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల సమయంలో క్షతగాత్రులకు రక్తం అవసరమవుతుందని భావించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేశారు. ఒక దశలో రోగులకు సరిపోయే రక్తం కంటే ఎక్కువగానే సేకరణ జరిగిందనీ, దాతలు ఇక దశలవారీగా రావాలంటూ బ్లడ్‌బ్యాంకులు పేర్కొన్నాయి. అంటే ఆ దశలో మానవీయత వెల్లివిరిసిన కారణంగా రక్త సేకరణ ఎక్కువగా జరిగిందన్నమాట. కానీ చాలా సందర్భాల్లో అవసరమైనంత రక్తం ఉండదు. అంటే డిమాండ్‌కంటే సప్లై చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఏదైనా ఒక ఆఫీసు నుంచి గానీ లేదా ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కార్యాలయంలోని ఔత్సాహికులుగానీ రక్తాన్ని దానం చేయదలచుకుంటే అందరూ ఒకేసారి రక్తదానం చేయడం కంటే... దశల వారీగా రోజుకు కొంతమంది చొప్పున రక్తదానం చేస్తుండటం మంచిది. దీనివల్ల రక్త సరఫరా మరీ ఎక్కువగా కాకుండానూ, మరీ తగ్గకుండానూ ఉంటుందన్నమాట. మన వద్ద ఆసుపత్రి పడకల సామర్థ్యం (బెడ్ స్ట్రెంగ్త్) ఆధారంగా కూడా రక్తం డిమాండ్‌ను లెక్కవేస్తారు. అంటే ఒక ఆసుపత్రిలోని  ఒక్కో పడకకు కనీసం 7 యూనిట్ల రక్తం అవసరమని అంచనా. అయినా ఇప్పటికి దొరుకుతున్నది కేవలం 75 శాతమే. రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా కేసుల్లో 70% మరణాలు కేవలం రక్తం అందకపోవడం వల్లనే సంభవిస్తున్నాయి. మొన్నమొన్నటి  వరకూ రక్తం ధర యూనిట్‌కి కేవలం రూ. 850 ఉండేది. కానీ ఇటీవల అది దాదాపు రెట్టింపు అయింది. కొన్ని సమయాల్లో కొన్ని ప్రైవేటు సంస్థలు... డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడుగానీ, ఎదుటివారి అవసరాన్ని ఆసరా చేసుకొని  అక్రమంగా వేలకు వేలు కూడా వసూలు చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. అందుకే ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులు, మంచి పేరున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన రక్తనిధులకు, అందునా రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న రక్తనిధి కేంద్రాలకు (బ్లడ్ బ్యాంకులకు) రక్తదానం చేయాలన్నది నిపుణుల సూచన.
 
ఇలాంటి దాతలు రావాలి ముందుకు...
రక్తదాతలు రకరకాలు. డబ్బు కోసం రక్తం దానం చేసేవాళ్లు. వీళ్లు ప్రొఫెషనల్ డోనార్స్. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికో జబ్బు చేయడంతో రక్తం అవసరమవుతుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా రక్తం దానం చేసి తమకు అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందేవారు. వీరిని డిస్ట్రెస్ డోనార్స్ అంటారు. మన సమాజంలో ఇప్పుడు అవసరం కోసమే రక్తదానం చేసే డిస్ట్రెస్ డోనార్సే ఎక్కువ. అవసరం లేకపోయినా సమాజంపై ఆపేక్షతో ఏ ప్రతిఫలాన్నీ ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారిని వాలంటరీ డోనార్స్ అంటారు. వీళ్ల సంఖ్య బాగా తక్కువ. ఆరోగ్యకరమైన రక్తం కోసం ఇలాంటి వాళ్ల సంఖ్యను పెంపొందించేందుకు ఉద్దేశించిందే... జూన్ 14న జరుపుకొనే ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం.
 
ఎన్నెన్నో అపోహలు
రక్తదానం పట్ల ప్రజల్లో ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే మనిషి బలహీనమైపోతాడన్నది ప్రధానమైన అపోహ. ఇది ఏ మాత్రం నిజం కాదు. వాస్తవానికి ఓ వ్యక్తిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 350 మి.లీ. రక్తం మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం 21 రోజుల్లో పూర్తిగా భర్తీ అవుతుంది. అయినాగానీ ముందుజాగ్రత్త చర్యగా ఓసారి ఓ వ్యక్తి నుంచి రక్తం సేకరిస్తే మరో మూడు నెలల పాటు అతడి నుంచి రక్తం సేకరించరు. అంటే... ఆరోగ్యరకమైన వ్యక్తి ప్రతి 90 రోజులకు ఓ మారు రక్తదానం చేయవచ్చు. వయస్సు 18-60 ఏళ్ల మధ్యనున్న ఆరోగ్యకరమైన వ్యక్తి ఎవరైనా రక్తం ఇవ్వవచ్చు. దీంతో ఎలాంటి బలహీనతా రాదు. ఇప్పుడు కొన్ని అధునాతన ఆసుపత్రుల్లో కేవలం రోగులకు అసవరమైన ప్లేట్‌లెట్స్ మాత్రమే సేకరిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో రక్తాన్ని నష్టపోవడమనేది అసలే ఉండదు. ఇలాంటప్పుడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మరోమారు ప్లేట్‌లెట్స్ దానం చేయవచ్చు. అంటే కాంపోనెంట్లుగా రక్తాన్ని దానం చేయగల సందర్భాల్లో ఒక వ్యక్తి రక్తదానం చేశాక మళ్లీ మూడు నెలలు ఆగనవసరం లేదు. ఒకవేళ అతడు ప్లేట్‌లెట్లను మాత్రమే దానం చేస్తే... మళ్లీ నాలుగో రోజు తర్వాత మరోమారు ప్లేట్‌లెట్స్ దానం చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుని, మరో ప్రాణాన్ని కాపాడటానికి అర్హుడవుతాడు. అందుకే రక్తాన్ని కాంపోనెంట్లుగా సేకరించగల చోటే దానం చేయడం చాలామంది ప్రాణాలను కాపాడుతుందని గుర్తుంచుకోండి.
 
ఇవీ రక్షణ చర్యలు

రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులను తరచూ సందర్శించి అక్కడి కోల్డ్ చైన్ పరిస్థితులను పర్యవేక్షిస్తారు. రక్తాన్ని 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ వద్ద సంరక్షించాలి. రక్తనిధుల్లో ఆ ఉష్ణోగ్రతను కొనసాగిస్తున్నారో లేదో పరీక్షిస్తారు. ఓసారి సేకరించిన రక్తం కేవలం 35 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ కాలపరిమితి దాటిన రక్తాన్ని రోగికి అందకుండా తనిఖీలు నిర్వహిస్తుంటారు.
 
కాంపోనెంట్లు... వాటి ఉపయోగాలు...

ఎర్రగా ఒకేలా (హోమోజీనియస్‌గా) కనిపించే రక్తంలో అనేక అంశాలు (కాంపోనెంట్లు) ఉంటాయి. అందులో ప్రధానమైనవి... ప్లాస్మా, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు... మొదలైనవి. ఈ కాంపోనెంట్లన్నీ వేర్వేరు విధులను నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటే... అందులో రెండున్నర లీటర్లు నీళ్లే. అంటే యాభై శాతం నీరేనన్నమాట. ఇక మిగతా దాంట్లో ప్రధానమైన అంశం (కాంపోనెంట్) ప్లాస్మాయే. దానితో పాటు ఎర్రరక్తకణాలు (ఆర్‌బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ఆ వేర్వేరు కాంపోనెంట్లలో ఉండే పదార్థాలు, విధుల తీరుతెన్నులివే...
 
ప్లాస్మా: ఇందులో లవణాలు, ప్రోటీన్లు, ఇమ్యూనో గ్లోబ్యులిన్‌లు ఉంటాయి.
 
ఎర్ర రక్తకణాలు : వీటిలో రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేసే రంగు పదార్థమైన హిమోగ్లోబిన్ ఉంటుంది. అన్ని జీవకణాలకూ ఆక్సిజన్‌ను చేరవేసేందుకు వాహకంగా పనిచేసేది ఈ ఎర్రరక్తకణమే. దాంతో పాటు జీవకణాల్లో వెలువడే వ్యర్థాలు, కాలుష్యాలను బయటకు చేరవేసేది కూడా ఆర్‌బీసీనే.
 
తెల్ల రక్తకణాలు : మన శరీరాన్ని బయటి నుంచి దాడి చేసే అనేక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడే రక్షణ కణాలు ఈ తెల్ల రక్తకణాలే. ఇందులో మళ్లీ ఐదు రకాల కణాలుంటాయి. అవి...
 
న్యూట్రోఫిల్స్ : ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, ఫంగైల నుంచి రక్షిస్తాయి.
 
లింఫోసైట్స్ : ఇవి కొన్ని రకాల వైరస్‌ల నుంచి, క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
 
మోనోసైట్స్ : చెడిపోయిన కణాలను నిర్మూలించి, ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి ఇవి మన శరీరాన్ని కాపాడతాయి.
 
ఇజినోఫిల్స్ : కొన్ని రకాల పరాన్న జీవుల నుంచి, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
 
బేసోఫిల్స్ : ఇవి అలర్జీల నుంచి రక్షణ కలిగిస్తాయి.
 
ప్లేట్‌లెట్స్ : శరీరానికి ఏదైనా గాయం తగిలి, రక్తస్రావం జరుగుతుంటే ఆ సమయంలో రక్తం గడ్డకట్టి, ప్రాణరక్షణ జరిగేలా పనిచేసే కణాలే ఈ ప్లేట్‌లెట్స్. ఇవి లోపిస్తే అంతర్గత రక్తస్రావం జరగవచ్చు. లేదా గాయం తగిలినప్పుడు ఎంతకీ రక్తం గడ్డకట్టక అలా రక్తస్రావం జరుగుతూ పోయి ప్రాణాపాయం కలగవచ్చు. ఇలా రక్తాన్ని గడ్డకట్టించడం ద్వారా ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలే ఈ ప్లేట్‌లెట్స్.
 
 ఒక దానం... మూడు ప్రాణాలు...

రక్తదాతల్లో ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే రక్తదాతలు తాము రక్తదానం చేసే చోట అడగాల్సిన ప్రశ్న ఒకటుంది. అదే... ‘రక్తాన్ని వివిధ కాంపోనెంట్లుగా (అంశాలుగా) విడదీసే సౌకర్యం మీ బ్లడ్ బ్యాంకులో ఉందా?’’ అని. రక్తదానాన్ని స్వీకరించే చాలా సంస్థలు ఒక దాత నుంచి స్వీకరించే రక్తాన్ని ‘హోల్ బ్లడ్’ అంటారు. అయితే రక్తంలో ప్లాస్మా, ప్లేట్‌లెట్లు, తెల్ల, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం... ఇలా చాలా రకాల అంశాలుంటాయి. ఒక హోల్‌బ్లడ్‌ను కనీసం మూడు రకాల కాంపోనెంట్లుగా విడదీయవచ్చు. అప్పుడు ఒకరి రక్తమే కనీసం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుంది. ఇంకా మరిన్ని కాంపోనెంట్లుగా విడదీయగల సౌకర్యం ఉంటే ఒకే రక్తం పలువురి ప్రాణాలు కాపాడుతుందన్నమాట!
 
రక్తం ప్రధాన విధులివే!


ఆహారం జీర్ణమై అది గ్లూకోజ్‌గా మారాక అన్ని కణాలకూ ఆ ఆహారాన్ని అందించడానికి రక్తం తోడ్పడుతుంది. గ్లూకోజ్‌తో పాటు అమైనోయాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్‌నూ కణాలన్నింటికీ అందజేస్తుంది.
     
రక్తం అందజేసిన గ్లూకోజ్‌తోనే కణాలు తమలో శక్తిని ఉద్భవింపజేసుకునే జీవక్రియలు జరుగుతాయి. దీన్నే మెటబాలిజమ్ అంటారు. ఈ క్రమంలో కార్బన్-డై-ఆక్సైడ్, యూరియా, ల్యాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని శుభ్రపరిచేందుకు ఉద్దేశించిన మూత్రపిండాల వంటి అవయవాల వద్దకు ఆ వ్యర్థాలను చేరవేసే కార్యక్రమం కూడా రక్తమే చేస్తుంది.
 
రక్తంలోని తెల్లరక్తకణాలు బయటి నుంచి శరీరంలోకి ప్రవేశించే రోగకారక క్రిములతో పోరాడి, మనకు వ్యాధినిరోధకతను కల్పిస్తాయి.
 
ఇంతటి కీలకమైన కార్యకలాపాలన్నీ అనునిత్యం జరగాల్సి ఉంటుంది కాబట్టే... ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం అవుతుంటే, దాన్ని అరికట్టడానికి మన శరీరం కృషి చేస్తుంది. అలా రక్తస్రావం మొదలు కాగానే రక్తం చుట్టూ ఒక వల లాంటిది ఏర్పడి రక్తం గడ్డకట్టి, స్రావాన్ని ఆపే పని సమర్థంగా జరుగుతుంది.
 
కాంపోనెంట్లుగా విడదీసిన రక్తంతో ప్రయోజనాలెన్నో!
 
ఒక వ్యక్తి నుంచి మొత్తం రక్తాన్ని (హోల్ బ్లడ్‌ను) సేకరించి ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తికి పూర్తి రక్తాన్ని ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. కానీ... ఏ అంశం లోపించిందో నిర్దిష్టంగా రక్తంలోని అదే అంశాన్ని (అదే కాంపోనెంట్‌ను) ఎక్కించే ఆధునిక వసతి సదుపాయాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఒక వ్యక్తికి పూర్తి రక్తం కంటే ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీనత ఎక్కువగా ఉన్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్‌బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగ్యూ లాంటి వ్యాధి సోకి ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి కేవలం ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే చాలు. ఇలా... రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు ఒకరి నుంచి సేకరించిన హోల్‌బ్లడ్‌ను వివిధ అవసరాలు ఉన్న రోగులకు ఎక్కించి ఒకరికంటే ఎక్కువ మందికి ఒకే రక్తం ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు నేరుగా ఏదైనా బ్లడ్‌బ్యాంకుకు వెళ్లడం కంటే.... రక్తాన్ని వివిధ కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేయడం చాలా మంచిది.
 
సేకరణ ఎక్కడెక్కడ...?

దాతల నుంచి రక్తం సేకరణ అన్న ప్రధానమైన కార్యక్రమాన్ని  ప్రభుత్వ, వైద్యవిధాన పరిషత్, జిల్లా ఆసుపత్రులు, ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ (ఐఆర్‌సీఎస్), లయన్, రోటరీ వంటి సంస్థలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలవి (2012 నాటి లెక్కల ప్రకారం) 244 కు పైగా బ్లడ్‌బ్యాంకులున్నాయి. రక్తంలోని ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ వంటి అంశాలను వేర్వేరుగా విడదీసే ‘కాంపోనెంట్ సపరేషన్ యూనిట్లు’  కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలా రక్తంలోని కాంపోనెంట్లను వేటికవి విడదీసే వాటికంటే మొత్తం రక్తాన్ని సేకరించే బ్లడ్‌బ్యాంకులే ఎక్కువ.  
 
వాళ్లతోనే ప్రమాదం...

రక్తదానంపై సమాజంలో పెద్దగా అవగాహన లేనందున కొందరు దీన్నే వృత్తిగా పెట్టుకుని డబ్బు కోసం రక్తదానం చేస్తుంటారు. వీళ్ల వల్ల కలుషిత రక్తం, వ్యాధులు వ్యాపించి ఉన్న రక్తం, అనారోగ్యకరమైన రక్తం సేకరణ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రొఫెషనల్ రక్తదాతలను ప్రోత్సహించకూడదు.
 
స్వచ్ఛందంగా సమష్టి ప్రయత్నం

రక్తదానం చేయాలనుకున్న వారు మంచి పేరున్న బ్లడ్‌బ్యాంకులు, కాంపోనెంట్లుగా రక్తాన్ని విడదీయగల సౌకర్యాలున ఉన్న రక్తనిధి కేంద్రాల్లో రక్తదానం చేయాలన్నది  నిపుణుల మాట. అలాగే లాభాపేక్ష లేకుండా మరో సంస్థ కూడా రక్తదానాన్ని ప్రోత్సహించడానికి ముందుకు వచ్చింది. ఇది ఫ్రెండ్స్, సన్నిహితులు, సహచరులు, బంధువులూ వీళ్లందరినీ రక్తదానానికి ప్రోత్సహిస్తుంది. ఆ సంస్థ పేరే... ‘ఫ్రెండ్స్ టు సపోర్ట్’. దీని వివరాల కోసం www.friendstosupport.org వెబ్‌సైట్‌ను సందర్శించండి.
 
చివరగా...

రక్తదానం చేయడం అంటే... మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయడం అన్నమాట. మనం ఇచ్చిన రక్తం కొద్ది వ్యవధిలోనే భర్తీ అవుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా కోల్పోయేది ఏదీ ఉండదు. ఇక మనం ఏమీ పోగొట్టుకోకుండానే ప్రాణదానం చేస్తున్నామంటే అంతకంటే కావాల్సిందేముంది. అందుకే ఈ ‘బ్లడ్ డోనార్స్ డే’ సందర్భంగా రక్తదానం చేసేందుకు ముందుకు రండి. క్షతగాత్రులూ! రక్తం అవసరమైన ఎందరో రోగుల ప్రాణాలను కాపాడండి.

 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 
1- ప్రమాద సమయంలో (ట్రామా కేసుల్లో) రోగికి అత్యవసరంగా అవసరమయ్యేది రక్తమే. కాబట్టి రక్తదానం చేస్తే బలహీనతలు కలుగుతాయేమో వంటి  అర్థం లేని అపోహలు వీడి నిర్భయంగా రక్తదానం చేయండి.
 
2- ఏదైనా సంస్థ నుంచి రక్తదానం చేయదలచినప్పుడు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు కొందరు చొప్పున వంతుల వారీగా చేయడం రక్తం వృథా కావడాన్ని నివారిస్తుంది.
 
3- ఈసారి డబ్ల్యూహెచ్‌ఓ సందేశం - కాబోయే తల్లి రక్షణ కోసం రక్తదానం. అంటే... మీరందించే సహాయం కేవలం తల్లికే కాదు... పరోక్షంగా బిడ్డకూ దక్కుతుందన్న విషయం గుర్తుంచుకోండి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement