- రేపు పెంటావలెంట్ టీకా ప్రారంభం
- ప్రాణాంతక వ్యాధుల నుంచి సంరక్షణ
- తిరుపతిలో సీఎంచే పిల్లలకు టీకాలు
చిత్తూరు (అర్బన్): హిమోఫిలస్ ఇన్‌ప్లూయెంజా టైప్ బీ (హిబ్) .. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులను బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి. దీనిబారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 3.7లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పేర్కొంది. మృతుల్లో సుమారు 20 శాతం మంది మనదేశానికి చెందిన వారే. మరికొంతమంది పిల్లలు శాశ్వత పక్షవాతం, చెవుడు, మెదడు వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెంటావలెంట్‌ను ప్రవేశపెట్టింది.
ప్రాణాంతకమైన ఐదు వ్యాధులను నియంత్రించే శక్తి ఇందులో ఉంది. మన జిల్లాలోనూ పిల్లలకు ఈ టీకా వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ నెల 7న సీఎం చేతులమీదుగా పెంటావలెంట్‌ను రాష్ట్రంలోనే మొదటి సారిగా జిల్లాలో ప్రారంభిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పెంటావలెంట్ టీకాను చిన్నారులకు వేయనున్నారు.
పిల్లల్లో రోగనిరోధక శక్తిలో భాగంగా ప్రస్తుతం వైద్యశాఖాధికారులు అందిస్తున్న టీకాలు ఏదో ఒక వ్యాధిని నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏ వ్యాధికి అనుగుణంగా ఆ టీకా వేస్తున్నారు. ఆరునెలల శిశువుకే ఆరు నుంచి ఏడు టీకాలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఫలితంగా శిశువు శరీరం ఇబ్బందులకు గురవడంతో పాటు టీకాలు వేసే సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఐదు ప్రాణాంతర వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చేలా ఒకే ఒక పెంటావలెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పెంటా అంటే ఐదు. వలెంట్ అంటే టీకా అని అర్థం. కంఠసర్పి (డిఫ్తీరియా), కోరింత దగ్గు, ధనుర్వాతం(టెటనస్), హెపటైటీస్ -బి,హిమోఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (హిబ్) అనే ఐదు రకాల ప్రాణాంతక వ్యాధులను పెంటావలెంట్ నియంత్రిస్తుంది.
శిశువు పుట్టిన ఆరు వారాలకు ఈ పెంటావలెంట్ టీకా వేస్తారు. 10, 14వ వారాల్లోగా సైతం ఈ టీకా వేస్తారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన చర్యలపై డీఎంహెచ్‌వో కోటీశ్వరి జిల్లాలోని వైద్యాధికారులకు, సిబ్బందికి దాదాపు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చారు.
ఆ ‘ఐదు’ వ్యాధులిక దూరం.
Published Wed, May 6 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement