చిన్నారుల cry క్రైసిస్‌లు | Children cry Crisis | Sakshi
Sakshi News home page

చిన్నారుల cry క్రైసిస్‌లు

Published Mon, Jan 12 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

చిన్నారుల  cry  క్రైసిస్‌లు

చిన్నారుల cry క్రైసిస్‌లు

వాళ్ల సమస్య ఏదైనా దాన్ని వ్యక్తం చేయడంకోసం ఆరునొక్కరాగాన్నే ఆశ్రయిస్తుంటారు పిల్లలు. తమ నోటి ద్వారా తమ సమస్యను తెలపలేనంత చిన్న పిల్లలకూ సమస్యలుంటాయి. నొప్పులుంటాయి. బాధలుంటాయి.  వ్యాధులుంటాయి. మరి వాటిని తెలుసుకునేదెలా? సాధారణంగా ఆ వయసు పిల్లలకు వచ్చే రకరకాల సమస్య  లేమిటి అన్న అంశంపై అవగాహన పెంచుకుంటే ‘ఏడ్వకు ఏడ్వకు చిన్నారి కన్నా’ అంటూ వాళ్ల బాధను దూరం  చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ వయసు పిల్లలున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడటం కోసమే  ఈ ప్రత్యేక కథనం. కొత్తగా తల్లిదండ్రులైన వారు మొదలుకొని తల్లిదండ్రులు కాబోయే వారితో పాటు   ప్రతి ఒక్కరూ ఏడ్చే పిల్లల బాధలను అర్థం చేసుకునేందుకు భద్రపరచుకోవాల్సిన కథనమిది.
 
ఎప్పుడెప్పుడు ఏడుస్తుంటారు?
 
చిన్నారులు ఏడుస్తున్నారంటే... ఒక వరస క్రమంగా ఈ బాధలు కారణం కావచ్చు. వాళ్లకు ఆకలిగా ఉండవచ్చు. తమ పక్కబట్టలను తడిపి ఉండటమో లేదా మలవిసర్జన చేసి ఉండటమో జరగవచ్చు. అలాంటప్పుడు డయపర్ / పక్కబట్ట మార్చడం జరిగితే ఏడుపు ఆగిపోతుంది. ఒకవేళ ఈ రెండు సమస్యలూ లేక... అప్పుడే పాలు తాగి ఉంటే... ఒక తేన్పు వచ్చేలా వాళ్లను కాసేపు భుజం మీదే ఉంచాలి. వాళ్లు తృప్తిగా తేన్చాక హాయిగా ఫీలవుతారు. ఇక తల్లిదండ్రులో పెద్దలో తమను ఎత్తుకొని ఉండాలంటూ పిల్లలు ఒక్కోసారి కోరుకుంటారు. అది జరగనప్పుడూ ఏడుస్తారు.

ఇక కడుపునొప్పి వచ్చినప్పుడూ, చెవి నొప్పి వచ్చినప్పుడూ ఏడుస్తారు. కొత్తగా తల్లి హోదా పొందిన అమ్మలకు క్రమంగా తమ అనుభవంతో పిల్లల ఏడుపులోని తేడాలు తెలిసిపోతుంటాయి. ఇక మాట్లాడలేని వయసులో పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలేమిటో తెలుసుకుందాం.
 
శ్వాసకోశ సమస్యలు
 
చాలా సాధారణంగా తల్లులు తమ బిడ్డ గురించి చేసే ఫిర్యాదు ఏమిటంటే... శ్వాస తీసుకునేటప్పుడు గురగురమంటూ శబ్దం వస్తుంటుందని. సాధారణంగా కొందరి ముక్కురంధ్రాల్లో కొన్ని స్రావాలు వెలువడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ శబ్దం వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ చిన్నారుల ముక్కు రంధ్రాల్లో సెలైన్ నేసల్ డ్రాప్స్ (ముక్కులో వేయాల్సిన చుక్కల మందు) వాడాలి. ఆ తర్వాత ముక్కులో ఉండే జిగురు పదార్థం (మ్యూకస్)ను లాగివేసే ‘నేసల్ ఆస్పిరేటర్’ అనే యంత్రం తొలగిస్తుంది. ఈ సమస్య గురించి ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. దీన్ని చాలా సులభంగా పరిష్కరించవచ్చు.

 పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్లుగా గుర్తించేందుకు  ఉపయోగపడే లక్షణాలూ, హెచ్చరికలు (వార్మింగ్ సిగ్నల్స్) ఇవే... ఆయాసపడుతున్నట్లుగా చాలా వేగంగా శ్వాసిస్తుండటం అంటే నిమిషంలో ఆరుసార్లకు పైగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతుండటం. (వాస్తవానికి పెద్దలతో పోలిస్తే పిల్లల్లో శ్వాస వేగం ఎక్కువే ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో అది మరీ పెరుగుతుంది)  రిట్రాక్షన్స్ (ఎదుర్రొమ్ము ఎగిరెగిరి పడుతున్నట్లుగా అనిపిస్తుంటం)  ముక్కు నుంచి శ్వాస శబ్దం ఎక్కువగా వినిపిస్తుండటం  శ్వాసించే సమయంలో మూల్గుతుండటం   పిల్లలు ఒక్కోసారి నీలిరంగులోకి మారిపోవడం.

 బ్లూ బేబీస్: కొందరు పిల్లల్లో అరచేతులు, అరికాళ్లు చల్లగా మారి, నీలంగా మారిపోతుంటుంది. వాటిని రుద్ది కాస్త వెచ్చబరచగానే వెంటనే గులాబి (పింక్) రంగులోకి మారిపోతాయి. కొందరిలో కాస్త అరుదుగా ముఖం, నాలుక, పెదవులు నీలంగా మారిపోతాయి. అప్పుడు చిన్నారులు చాలా గట్టిగా ఏడుస్తుంటారు. వాళ్లు ఏడుపు ఆపివేయగానే మళ్లీ వాళ్ల ఒంటిరంగు మామూలుగా అయిపోతుంది. అయితే చిన్నారుల్లో ఇలా నీలం రంగు దీర్ఘకాలం ఉండిపోయి, శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండి, పాలుతాగడం కష్టమవుతోందంటే వాళ్ల ఊపిరితిత్తులు/గుండెలో ఏదో లోపం ఉందనీ, అందుకే రక్తానికి తగినంత ఆక్సిజన్ అందక వాళ్లు ఇలా నీలంగా మారిపోతున్నారని అర్థం. అప్పుడు వీలైనంత త్వరగా చిన్నపిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
 
 బద్దకంగా ఉండటం లేదా ఎప్పుడూ నిద్రపోతూ ఉండటం

చిన్నపిల్లలు రోజులో చాలా సేపు నిద్రపోతూనే ఉంటారు. ఒకటి రెండు గంటలు మాత్రమే మెలకువతో ఉంటారు. ఇలాంటప్పుడు పాలు బాగా తాగుతూ, మూత్రవిసర్జన బాగానే చేస్తూ ఉంటే రోజులో ఎక్కువ భాగం నిద్రపోతున్నా అది సాధారణమే. దాన్ని సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే ఆకలి వేసినప్పుడు తనంతట తానే నిద్రలేవకుండా ఉండటం, ఆహారం తీసుకోడానికి ఆనాసక్తి ప్రదర్శిస్తూ ఉండటం, మెలకువగా ఉన్న సమయంలో చురుగ్గా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక పిల్లల డాక్టర్‌కు చూపించాలి. ఎందుకంటే అది బిడ్డలో ఏదైనా లోపానికి సూచన కావచ్చు.
 
పొట్టలో ఇబ్బంది  (అబ్డామినల్ డిస్టెన్షన్)
 
చాలా మంది పిల్లల పొట్ట ముందుకు వచ్చి ఉంటుంది. మరీముఖ్యంగా చాలాసేపు పాలు తాగాక పొట్ట పెరుగుతుంది. ఇక పాలు తాగడానికీ, పాలు తాగడానికీ మధ్య మళ్లీ కాసేపు మెత్తగా ఫ్లాట్‌గా అయిపోతుంది. కానీ దీనికి బదులు పొట్ట ఎప్పుడూ ఉబ్బుగా ఉండి, అది గట్టిగా మారి, విరేచనం సరిగా కాకుండా ఉండటంతో పాటు, వాంతులు అవుతుంటే తప్పనిసరిగా పిల్లల డాక్టర్‌కు చూపించాలి. దీనికి కారణం మలబద్ధకం కావచ్చు. లేదా ఒక్కోసారి అది పేగులకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకూ సూచన కావచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి నెలబాలురు, నెలల పిల్లల విసర్జన అలవాట్లు క్రమబద్ధంగా ఉండవు. కానీ తగినంత పాలు తాగుతూ... ఏ వేళకైనా విసర్జన చేస్తూ ఉండటం సాగుతూ ఉంటే దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
 
పసిపిల్లల్లో పొట్టనొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్)

పుట్టిన మూడు వారాల పిల్లల్లో చాలామంది ఒక దశలో సాయంత్రాల వేళగానీ లేదా రాత్రివేళల్లోగానీ చాలా గట్టిగా ఏడుస్తుండటం పరిపాటి. వారు ఏడ్చే సమయాల్లో పాలు తాగరు. కొద్దిమంది పిల్లలు ప్రతిరోజూ నిర్దిష్టంగా ఒక సమయంలోనే ఏడుస్తుంటారు. ఇలా ఏడ్వటం అన్నది కొద్ది నిమిషాలు మొదలుకొని కొంతమంది పిల్లల్లో గంటలకొద్దీ కొనసాగుతుంటుంది. ఒక్కోసారి మూడుగంటల పాటు అదేపనిగా ఏడుస్తుంటారు. కొంతమంది పిల్లల్లో ఇది కొద్దిరోజుల్లోనే సర్దుకున్నా మరికొందరిలో మాత్రం మూడు నెలల పాటూ ఇదే కొనసాగుతుండవచ్చు. దీనికి కారణం పసిపిల్లల్లోని పొట్టనొప్పి (కోలిక్) కావచ్చు. ఈ పొట్టనొప్పి వచ్చే ముందర మలద్వారం నుంచి కొద్దిగా గ్యాస్ వెలువడటం వంటివి జరగవచ్చు. కొన్నిసార్లు పెద్ద శబ్దాలతోనూ గ్యాస్ వెలువడవచ్చు. ఇలా పొట్ట నొప్పితో ఏడుస్తున్న సమయాల్లో పసిపిల్లల ముఖంలో వాళ్లు అనుభవిస్తున్న అసౌకర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది.
 
పసిపిల్లల పొట్టనొప్పి (కోలిక్)కి కారణాలు

పసిపిల్లల్లో ఇలా పొట్టనొప్పి రావడానికి గల కారణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టంగా దీనికి ఫలానా కారణం అంటూ ఇంకా తెలియదు. పరిశోధకులు దీనికి అనేక సంభావ్య కారణాలను పేర్కొంటున్నారు. పిల్లల్లో అలర్జీలు, పాలల్లోని చక్కెరని సక్రమంగా గ్రహించలేకపోవడం (ల్యాక్టోజ్ ఇన్‌టాలరెన్స్), పొట్టలో ఉండే బ్యాక్టీరియాలలో మార్పులు, జీర్ణవ్యవస్థ చక్కగా ఎదగకపోవడం, తల్లిదండ్రుల్లో అవగాహనలేమితో పొట్ట నిండుగా ఉన్నప్పుడే మళ్లీ ఆతృతతో పాలు పట్టించడానికి ప్రయత్నించడం, దానితో పసిపిల్లల పొట్టలో అసౌకర్యం ఏర్పడటం వంటి ఎన్నో అంశాలు పసిపిల్లల పొట్టనొప్పికి కారణాలవుతాయి. పిల్లల్లో పొట్టనొప్పి వచ్చినప్పుడు కోలిక్ డ్రాప్స్‌తో చికిత్స చేస్తే వాళ్లకు ఉపశమనం ఉంటుంది.
 పిల్లలు ఆకలిగా ఉన్నట్లు గ్రహించి, చిన్నారికి పాలు పట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ చిట్కాలు పొట్టనొప్పిని తగ్గించడానికి బాగా

ఉపయోగపడతాయి. అవి...

 పాపాయికి పాలు తాగించే సమయంలో పడుకోబెట్టి పాలు తాగించకుండా, వారిని సాధ్యమైనంత వరకు నిటారుగా ఉండే భంగిమలో ఉంచి పాలు తాగించడం మంచిది. రోజులో కొద్ది కొద్ది మోతాదుల్లో అనేకసార్లు పాలు పట్టించడం మేలు. పిల్లలకు చనుబాలు పట్టిస్తున్నప్పుడు ఒక రొమ్ములోని పాలు పూర్తయ్యాయని అనిపించాకే మరో పక్కకు మార్చాలి. ఎందుకంటే రొమ్ములో మొదట ఊరే పాలు కాస్త పలుచగా ఉండి పోషకాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ అనంతరం ఊరే పాలు (హైండ్‌మిల్క్) చాలా చిక్కగా ఉండి, పోషకాల పాళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే రొమ్ములోని పాలు పూర్తయ్యేవరకూ తాగిస్తే... హైండ్‌మిల్క్‌లో ఉండే చిక్కగా ఉండి, కొవ్వులతో కూడిన, పోషకాలతో నిండిన పాలు వస్తాయి.

 పిల్లలకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం వల్ల పొట్టనొప్పి తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ చనుబాలు పట్టించే అమ్మ ఈ అభిప్రాయంతో తన బిడ్డకు ఇచ్చే ఆహారంలో మార్పులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనమేదీ ఉండదు. అయితే కొందరి కుటుంబ ఆరోగ్య చరిత్రలో పిల్లల్లో పొట్టనొప్పి వచ్చే సహజగుణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆ విషయాన్ని పిల్లల డాక్టర్‌కు చెబితే... వారి కుటుంబంలో అలర్జీ కలిగించే అంశాన్ని డాక్టర్లు ఊహించి కనుగొని, పాలిచ్చే తల్లిని వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. సాధారణంగా కొన్ని రకాల పాల ఉత్పాదనలు, వేరుశెనగలు (పల్లీలు), కొన్ని రకాల నట్స్, కొందరిలో గోధుమలతో చేసిన ఆహారపదార్థాలు, సోయా ఉత్పాదనలు, చేపల వంటివి తల్లులకు సరిపడక... అవి పాలతో పాటు పిల్లల పొట్టల్లోకి చేరి వారిలో కడుపునొప్పిని కలిగించవచ్చు. అయితే తల్లి వాటిని మానేయగానే పిల్లలకూ సౌఖ్యం చేకూరవచ్చు. తల్లి తీసుకునే ఆహారాన్ని డాక్టర్లు చాలా నిశితంగా (మెటిక్యులస్‌గా), పరిశీలనగా చూస్తూ రకరకాల ఆహారాలను మార్చి ఇస్తూ... ఏ ఆహారాన్ని ఇచ్చినప్పుడు పిల్లల్లో కడుపునొప్పి వస్తుందో గ్రహించి దాన్ని మాన్పిస్తారు. అందుకే తాము ఏ ఆహారాన్ని మార్చాలని తల్లిదండ్రులు భావించినా, మొదట తమ డాక్టర్‌తో సంప్రదించాకే ఆ పని చేయాలి.
 
దగ్గు

 
పిల్లల్లో దగ్గు దీర్ఘకాలం పాటు వస్తున్నా లేదా పాలిస్తున్నప్పుడు మధ్యమధ్య ఎక్కిళ్లు వస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ లక్షణాలు చిన్నారిలో అంతర్గతంగా దాగి ఉన్న లంగ్స్ లేదా జీర్ణవ్యవస్థకు సంబంధించిన లోపాలకు సూచన కావచ్చు.
 
వాంతులు
 
పిల్లలకు పాలు పట్టించగానే కాసేపు చిన్నారిని భుజంపై వేసుకుని నిలువుగా ఉండేలా చూడాలి. ఇలాంటి సమయాల్లో ఎప్పుడైనా వాంతులైనా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కింది సూచనలు కనిపిస్తుంటే మాత్రం తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. అవి... పాలు తాగుతున్నా బిడ్డ సరిగా బరువు పెరగనప్పుడు  కడుపులో ఉన్నదంతా ఒక్కసారిగా బలంగా కక్కేస్తున్నప్పుడు   వాంతి చేసుకున్నప్పుడు ఆ ద్రవం ఆకుపచ్చరంగులో/పసుపు రంగులో/రక్తవర్ణంలో/కాఫీ రంగులో ఉన్నప్పుడు  విరేచనాల్లో రక్తం పడుతున్నప్పుడు  పై లక్షణాలతో పాటు జ్వరం, నీళ్లవిరేచనాలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలూ కనిపిస్తుంటే తప్పక పిల్లల డాక్టర్‌ను సంప్రదించాలి.
 
పుట్టుకామెర్లు
 
బిడ్డ పుట్టిన ఒకటి రెండు రోజులకే కామెర్ల సమస్య వారిని వేధిస్తుంది. నిజానికి పుట్టగానే పిల్లల కాలేయం ఇంకా తన కార్యకలాపాలకు సిద్ధమై ఉండదు. ఈ అస్తవ్యస్తత వల్ల బిలురుబిన్ అనే జీవరసాయనం పిల్లల రక్తంలో కలిసి, కామెర్లకు దారితీస్తుంది. పుట్టగానే కనిపించే కామెర్లు కాబట్టి వీటిని పుట్టుకామెర్లు అని వ్యవహరిస్తుంటారు. చాలామంది పిల్లలకు ఇది ప్రమాదకరం కానేకాదు. పైగా కొద్దిమేరకు లాభదాయకం కూడా. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లల్లో ఈ కామెర్లు చాలా తీవ్రంగా ఉండి చిన్నారి మెదడుకు సమస్యాత్మకం అవుతాయి. అయితే ఈ సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించి, చిన్నారి మెదడుకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చికిత్స చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తల్లిపాలు సరిగా పట్టని సందర్భాల్లో ఈ కామెర్లు కనిపించే అవకాశాలు ఎక్కువ. అందుకే ఇలా కామెర్లు కనిపించిన చిన్నారులకు తల్లులు రోజుకు కనీసం 8 నుంచి 12సార్లు తల్లిపాలు పట్టాలి. దీనివల్ల కామెర్లు అదుపులో ఉంటాయి.
 
కామెర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి?


పిల్లల్లో కామెర్లు తొలుత ముఖం మీద, ఆ తర్వాత ఛాతీ భాగంలో, చివరన కాళ్లూ చేతుల్లో కనిపిస్తాయి. కళ్లలోని తెల్లగుడ్డు పచ్చగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపించగానే చిన్నారిని చిన్నపిల్లల డాక్టర్‌కు చూపించాలి. ఆయన బిడ్డను పరీక్షించి చర్మపురంగు, పసుపుపచ్చరంగులోని తీవ్రత, బిడ్డ వయసు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కామెర్ల తీవ్రతను అంచనా వేస్తారు. ఒకవేళ చిన్నారి పుట్టిన 24 గంటల లోపే కామెర్లు వచ్చినట్లయితే బిలురుబిన్ పరీక్ష చేసి కామెర్లా కాదా అన్న అంశాన్ని నిర్ధారణగా తెలుసుకోవాలి. ఒకవేళ బిడ్డ పుట్టి 3 - 5 రోజులు గడిచిపోయాక కూడా కామెర్ల లక్షణాలు కనిపిస్తూ ఉంటే... అవి తగ్గేవరకూ ఆ బిడ్డను డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంచాలి.

ఒకవేళ బిడ్డ పుట్టాక 72 గంటల్లో తల్లీబిడ్డల్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తుంటే అప్పుడు కూడా బిడ్డలో ఏమైనా కామెర్ల లక్షణాలు కనిపిస్తున్నాయా అని చూశాకే పంపాలి. కొంతమంది పిల్లలను వెంటనే డిశ్చార్జి చేయకుండా ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలి. ఇది ఎవరికి అవసరం అంటే...  డిశ్చార్జి చేద్దామనే సమయానికి బిలురుబిన్ పాళ్లు చాలా ఎక్కువగా ఉన్న చిన్నారులకు  పుట్టాల్సిన సమయం కంటే రెండు వారాలు ముందుగానే పుట్టిన బిడ్డలకు  పుట్టిన 24 గంటల లోపు కామెర్లు వచ్చిన బిడ్డలకు  తగినంతగా తల్లిపాలు పట్టలేని బిడ్డలకు  ప్రసవ సమయంలో మాడుకు గాయం అయిన బిడ్డలకు  ప్రతి ప్రసవంలోనూ తీవ్రంగా కామెర్లు వచ్చిన మెడికల్ చరిత్ర ఉన్న వారికి పుట్టిన పిల్లలకు  అతి తక్కువ బరువుతో పుట్టిన చిన్నారులకు  తల్లి బ్లడ్ గ్రూప్ నెగెటివ్ అయినప్పుడు... ఈ సందర్భాల్లో బిడ్డకు కామెర్లు తీవ్రంగా ఉన్నాయనీ, బిడ్డకు చికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయిస్తే అప్పుడు చిన్నారిని ఆసుపత్రిలోనే ఉంచి ప్రత్యేకమైన కాంతికిరణాలను బిడ్డపై ప్రసరింపజేస్తూ (ఫొటోథెరపీ) చికిత్స అందించాలి. ఇలా ఫొటోథెరపీ ఇచ్చే సమయంలో బిడ్డ కళ్లపై అవి ప్రసరించకుండా చిన్నారి కళ్లను మూసివేసి ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి. తల్లిపాలపై ఉన్న చిన్నారుల్లో ఈ తరహా పుట్టుకామెర్లు రెండుమూడు రోజుల్లో తగ్గుతాయి. అదే ఫార్ములా పాలపై ఉన్నవారికి కామెర్లు తగ్గడానికి రెండు వారాలు పట్టవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement