హిందూ వివాహ వ్యవస్థలో మేనరికపు వివాహాలు సర్వసాధారణంగా చూస్తుంటాం. కుటుంబాల మధ్య సంబంధాలు నిలిచి ఉండాలనే ఆలోచనతో కొంతమంది, ఆస్తుల పరిరక్షణ కోసంమరికొంతమంది మేనత్త, మేనమామ పిల్లల మధ్య మేనరికపు వివాహాలు జరుగుతుంటాయిం. అయితే ఇలా మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని కుటుంబాల్లో పిల్లలు జెనెటిక్ లోపాలతో పుట్టడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20శాతం పెళ్లిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతున్నాయి. ఇలాంటి వివాహాలను వైద్య పరిభాషలో ‘కన్‌సాంగ్వినియస్ మ్యారెజెస్’ అంటారు. అసలు మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
బావ మరదలు పెళ్లి, మేనమామ మేనకోడలు పెళ్లి, ఇంకా రెండు కుటుంబాల మధ్య తరాల తరబడి కుండ మార్పిడిఅంటే వీళ్ల అమ్మాయిని, వారి అబ్బాయికి, వారి అబ్బాయిని వీరి అబ్బాయికి ఇచ్చి పెళ్లిళ్లు చేయడం. డా.శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో పోస్ట్ చేసిన వివరాలు.
సాధారణంగా రక్తసంబందీకులు కాని తల్లిదండ్రులకి పుట్టే పిల్లల్లో సుమారు 2-4శాతం మందికి చిన్న లేదా పెద్ద అవకారాలు పుట్టుకతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అది సాధారణం. అయితే ఈ మేనరికపు వివాహాల్లో ఇది రెట్టింపు అవుతుంది. అయితే పిల్లలు అవకారాలతో పుట్టే స్థితి పైన చెప్పిన మూడింట్లో చివరిదాంట్లో ఎక్కువ. మొదటి దాంట్లో తక్కువ. ఈ ఎక్కువ తక్కువలు పెళ్లి చేసుకున్న జంటలో భార్య భర్తల మధ్య జన్యుసారూప్యం ఎంత అన్నదానిబట్టి ఉంటుంది. బావమరదళ్ల కంటే, మేనమామ మేనకోడలి మధ్య జన్యుసారూప్యం ఎక్కువ, అలాగే కుండ మార్పిడిలో అవే జన్యువులు మాటిమాటికీ పంచుకోవడం వలన ఇంకా ఎక్కువ.
ఇటువంటి వివాహాలవలన అబార్షన్లు ఎక్కువవటం, మృత శిశువులు జన్మించటం, పుట్టినపిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, గుండెలో అవకారాలు, బుద్ధిమాంద్యంతో పాటు ఇతర మానసిక సమస్యలు, మెదడు జబ్బులు, రక్తహీనత మొదలైన రకరకాల సమస్యలు చాలా ఎక్కువగా కలుగుతాయి. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అవకారాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కానీ పుట్టే పిల్లలందరూ అవకారాలతో పుడతారని కాదు.
అయితే ఈ వివాహాలు మిగతా వివాహాల కంటే దృఢంగా ఉండటం, విడాకుల సంఖ్య తక్కువగా ఉండటం, ఆరోగ్య సమస్యలున్నప్పుడు రెండు కుటుంబాలూ సహాయపడటం మొదలైనవి లాభాలు.
ఇటువంటి వాళ్లు పెళ్లిచేసుకునేముందు జెనిటిక్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. దీనిలో ఇప్పటికే కుటుంబంలో ఉన్న వంశపారంపర్య జబ్బుల్ని కనుక్కుని, అవి పుట్టే పిల్లలకి వచ్చే అవకాశం లెక్కగట్టి చెబుతారు. దాన్ని బట్టి కాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చు. ఇప్పటివరకూ కుటుంబంలో పెద్ద సమస్యలు లేనివాళ్లు, అవగాహన ఉంటే, ప్రేమ ఉన్న బావమరదళ్ల వరకూ ఫర్వాలేదు కానీ మిగతావి సమంజసం కాదు.
Comments
Please login to add a commentAdd a comment