పరివార్‌.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ | My country is my family, dynasts incapable of thinking beyond own families | Sakshi
Sakshi News home page

పరివార్‌.. ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ

Published Tue, Mar 5 2024 5:20 AM | Last Updated on Tue, Mar 5 2024 11:03 AM

My country is my family, dynasts incapable of thinking beyond own families - Sakshi

ప్రధానిపై లాలూ విమర్శలతో రాజకీయ రగడ

మోదీకి సంతానమెందుకు లేదన్న ఆర్జేడీ నేత

కుటుంబం లేదు, హిందువే కాదని వ్యాఖ్యలు

తనకు దేశమంతా కుటుంబమేనన్న మోదీ 

మతి చెడి తనపై విమర్శలంటూ ధ్వజం

ప్రధానికి మద్దతుగా ఏకమైన బీజేపీ నేతలు

తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రకటనలు

సోషల్‌ ప్రొఫైల్స్‌లో ‘మోదీ కా పరివార్‌’ క్యాప్షన్‌

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి సరికొత్త నినాదం!

న్యూఢిల్లీ/ఆదిలాబాద్‌:  ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ విమర్శలు పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. దేశవ్యాప్తంగా మంటలు రాజేశా యి. మోదీకి కుటుంబమూ లేదు, సంతానమూ లేరంటూ ఆదివారం పట్నా జన్‌సందేశ్‌ ర్యాలీలో లాలూ ఎద్దేవా చేశారు. ఆయనసలు హిందువే కాదంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, రాహుల్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన విపక్ష నేతల సమక్షంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలకు మోదీ సోమవారం గట్టిగా కౌంటరిచ్చారు. దేశం కోసమే జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు.

భారతదేశం, 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబమని పునరుద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలంతా వెంటనే అందిపుచ్చుకున్నారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా మొదలుకుని రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జి.కిషన్‌రెడ్డి, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ తదితర కేంద్ర మంత్రులు, నేతలంతా ఈ మేరకు ప్రకటనలు చేశారు.

మోదీపై లాలు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. విపక్షాలపై పెద్దపెట్టున విరుచుకుపడ్డారు. తామంతా మోదీ కుటుంబమేనంటూ ప్రధానికి బాసటగా నిలిచారు. అంతేగాక సోషల్‌ మీడియా అకౌంట్లలో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్‌’ అంటూ జోడించుకున్నారు.

దేశవ్యాప్తంగా బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు కూడా ఇదే బాటపట్టి ‘మోదీ కా పరివార్‌’ అంటూ సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. చివరికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా తన ఎక్స్‌ ప్రొఫైల్‌కు ‘మోదీ కా పరివార్‌’ అని చేర్చుకున్నట్టు ట్రోల్స్‌ వెల్లువెత్తుతున్నాయి! విపక్షాలు మరోసారి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీకి చేజేతులా పదునైన నినాదమే అందించాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

చిల్లర వ్యాఖ్యలు: బీజేపీ
మోదీపై వ్యక్తిగత విమర్శలు విపక్షాలకు కొత్తేమీ కాదంటూ బీజేపీ ఆగ్రహం వెలిబుచి్చంది. ‘‘17 ఏళ్లుగా ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. ఇది నిజంగా బాధాకరం’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది అన్నారు. విపక్షాల రాజకీయ దురహంకారానికి దేశ ప్రజలు తగిన విధంగా బదులు చెబుతారన్నారు. ‘‘మొత్తం దేశాన్నే తన కుటుంబంగా మార్చుకున్నారు మోదీ. అందుకే ఎంత పని చేసినా ఆయనకు అలుపే రాదు.

గత పదేళ్లలో మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదు’’ అని చెప్పారు. మోదీకి సంతానం లేదన్న లాలు వ్యాఖ్యలను కూడా సుధాన్షు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘హిందూ మతం గురించి లాలుకేం తెలుసు? అసలు విపక్ష ఇండియా కూటమిలో ఒక్కరు కూడా హిందువు లేదు! సనాతన ధర్మంలో భక్తికే పెద్దపీట తప్ప కుమారునికి కాదు. భారత్‌లో గురుశిష్య సంప్రదాయముంది తప్ప తండ్రీ కొడుకుల సంప్రదాయం లేదు. రామ భక్తుడైన హనుమంతునికే ఊరూరా గుళ్లున్నాయి.

రాముని కుమారులు లవకుశులకు ఎక్కడైనా ఆలయముందా?’’ అని ప్రశ్నించారు. ‘‘మోదీ నాయకత్వంలో 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మోదీ లక్ష్యమైతే ఎలాగైనా అధికారం సాధించి 2047 దాకా కూడా దాన్ని తమ కుటుంబాల గుప్పెట్లోనే ఉంచుకోవడం విపక్షాల లక్ష్యం’’ అంటూ దుయ్యబట్టారు. వీలైనంత భారీగా అవినీతికి పాల్పడి, తద్వారా తాము, తమ కుటుంబాలు మాత్రమే తరతరాలకు సరిపడా సంపద పోగేసుకోవాలన్నది విపక్షాల ఉద్దేశమని ఆరోపించారు.

నేరగాళ్లే మోదీ పరివారం: కాంగ్రెస్‌
ఇండియా కూటమి నానాటికీ బలోపేతమవుతుండటం చూసి అధికార బీజేపీలో అక్కసు పెరిగిపోతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘మోదీ కా పరివార్‌’ పేరిట కొత్త డ్రామాకు తెర తీసిందని మండిపడింది. ‘‘రైతులను కార్లతో తొక్కించి చంపిన నేరగాడి తండ్రయిన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా, క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ వంటి బీజేపీ నేతలే నిజమైన మోదీ కుటుంబం. అదే ‘మోదీ కా అస్లీ పరివార్‌’’ అంటూ ఎద్దేవా చేసింది.

‘‘మణిపూర్‌ హింసాకాండకు బలైన మహిళలకు మోదీ కుటుంబంలో చోటేది? ఢిల్లీ శివార్లలో నిరసన గళమెత్తుతున్న రైతులను తన కుటుంబంగా చెప్పుకోగలరా? ఉపాధి లేక నిత్యం ఆత్మహత్యల బాట పడుతున్న నిరుద్యోగ యువతను తన కుటుంబమని చెప్పుకోరేం? బీజేపీ సర్కారు కేవలం క్రూరమైన నేరగాళ్లు, మోదీ సన్నిహిత పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తోంది’’ అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ దుయ్యబట్టారు.

‘‘రైతుల హత్య, మహిళలపై అత్యాచారాలు... ఇదే నిజమైన మోదీ కుటుంబం’’ అంటూ కాంగ్రెస్‌ నేతలంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిజ్‌భూషణ్, అజయ్‌ మిశ్రా తదితరులు తమ సోషల్‌ హ్యాండిల్స్‌కు ‘మోదీ కా పరివార్‌’ అని జోడించుకోవడాన్ని విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. సంఘ్‌ పరివార్‌ కాస్తా చివరికి మోదీ పరివార్‌గా మారిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

2019లో ‘మై భీ చౌకీదార్‌’
సాక్షి, న్యూఢిల్లీ: మోదీపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఇది తొలిసారి కాదు. 2007 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీపై ‘మౌత్‌ కా సౌదాగర్‌ (మృత్యు వ్యాపారి)’ అంటూ అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో మత అల్లర్లకు కారకుడనే అర్థంలో ఆమె చేసిన విమర్శలు వివాదానికి దారి తీశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాగా నష్టం చేశాయి.

అనంతరం 2018లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు. తాను దేశానికి చౌకీదార్‌లా ఉంటానన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్‌ ఎక్కుపెట్టిన ఆ విమర్శలూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నింటికీ తీవ్రంగా చేటు చేశాయి. ఆ వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకుని ఘనవిజయం సాధించింది. మోదీ తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో ‘నరేంద్ర మోదీ చౌకీదార్‌’ అని చేర్చుకున్నారు.  బీజేపీ నేతలు కూడా ‘మై భీ చౌకీదార్‌’ అని ప్రొఫైల్స్‌లో చేర్చుకున్నారు.
 
‘‘నువ్వేమీ మరీ అంత పెద్దవాడివి కాదు. మాట్లాడితే కుటుంబ రాజకీయాలంటూ మాపై పదేపదే దాడికి దిగుతున్నావ్‌! కుటుంబాల గురించి నీకెందుకు? నీకు సంతానం ఎందుకు లేదో చెప్పు. కుటుంబమే లేదు నీకు. అయోధ్యలో రామాలయం కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటావు. కానీ నువ్వసలు హిందువువే కాదు. అమ్మ మరణిస్తే ప్రతి హిందువూ శిరోముండనం చేయించుకుంటాడు. నువ్వు మాత్రం చేయించుకోలేదు. కారణమేంటో చెప్పు! దేశమంతటా విద్వేష వ్యాప్తి చేస్తున్నావ్‌!’’    
– పట్నా ర్యాలీలో మోదీపై లాలూ విమర్శలు

‘‘ఇండియా కూటమిలోని విపక్ష నేతలంతా అవినీతి, వారసత్వ,  సంతుస్టీకరణ రాజకీయాల్లో పీకల్లోతున కూరుకుపోయారు. పార్టీ ఏదైనా ఝూట్‌–లూట్‌ (అబద్ధాలు, దోపిడీ) అన్నదే వాళ్లందరి నైజం. దీనిపై ప్రశి్నస్తే నాకు కుటుంబమే లేదంటూ ఆక్షేపిస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయులే నా కుటుంబం. నా భారతదేశమే నా కుటుంబం. ఒక సేవకునిలా ప్రజా క్షేమానికే నా జీవితాన్ని అంకితం చేశా. దేశసేవ చేయాలనే కలను నిజం చేసుకోవడానికి చిన్న వయసులోనే ఇల్లు వీడా. నా జీవితమంతా తెరిచిన పుస్తకం. ప్రతి భారతీయునికీ ఆ విషయం తెలుసు’’
– ఆదిలాబాద్‌ సభలో మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement