2,000 కోట్ల భారీ జరిమానా | Monsanto ordered to pay $289m as jury rules weedkiller caused man's cancer | Sakshi
Sakshi News home page

మోన్‌శాంటోకు 2,000 కోట్ల భారీ జరిమానా

Published Sun, Aug 12 2018 2:29 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Monsanto ordered to pay $289m as jury rules weedkiller caused man's cancer - Sakshi

డ్వేన్‌ జాన్సన్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: బహుళజాతి విత్తన, పురుగుమందుల కంపెనీ మోన్‌శాంటోకు అమెరికాలోని ఓ న్యాయస్థానం షాకిచ్చింది. తమ ఉత్పత్తుల్ని వాడితే కేన్సర్‌ సోకుతుందన్న విషయాన్ని దాచిపెట్టి ఓ వ్యక్తి కేన్సర్‌ బారిన పడేందుకు కారణమైనందుకు ఏకంగా రూ.2,003 కోట్ల(29 కోట్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మేరకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ కోర్టు జ్యూరీ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళతామని మోన్‌శాంటో ప్రతినిధులు తెలిపారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న డ్వేన్‌ జాన్సన్‌(46) బెనికాలో ఓ పాఠశాలలో గ్రౌండ్‌మెన్‌గా పనిచేసేవారు. విధుల్లో భాగంగా స్కూల్‌ ప్రాంగణం, మైదానంలో కలుపుమొక్కలు పెరగకుండా మోన్‌శాంటో తయారుచేసిన ‘రౌండర్‌’ మందును స్ప్రే చేసేవారు. ఈ కలుపుమొక్కల నాశినిలో ప్రధానంగా ఉండే గ్లైఫోసేట్‌ అనే రసాయనం వల్ల కేన్సర్‌ సోకుతుంది. ఈ విషయం సంస్థాగత పరీక్షల్లో వెల్లడైనా మోన్‌శాంటో బయటకు చెప్పలేదు.

రౌండప్‌ కలుపు నాశినిని తరచుగా వాడటంతో తెల్ల రక్తకణాలకు వచ్చే అరుదైన నాన్‌హడ్జ్‌కిన్స్‌ లింఫోమా అనే కేన్సర్‌ సోకినట్లు జాన్సన్‌కు 2014లో తెలిసింది. చికిత్స చేసినా జాన్సన్‌ బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చారు. మరుసటి ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కేన్సర్‌(ఐఆర్క్‌) పరిశోధనలో సంచలన విషయం బయటపడింది. మోన్‌శాంటో తయారుచేస్తున్న కలుపుమొక్కల నాశనులు రౌండప్, రేంజ్‌ ప్రోలో కేన్సర్‌ కారక గ్లైఫోసేట్‌ అనే ప్రమాదకర రసాయనం ఉందని ఐఆర్క్‌ తేల్చింది. ఈ విషయాన్ని కస్టమర్లకు మోన్‌శాంటో తెలపలేదంది.

కాలిఫోర్నియాలో కేసు దాఖలు..
మోన్‌శాంటో కలుపు మందులపై వినియోగదారుల్ని హెచ్చరించకపోవడంతో కాలిఫోర్నియాలోని కోర్టులో కేసు దాఖలైంది. మోన్‌శాంటో తయారుచేసిన రౌండప్‌ కారణంగా జాన్సన్‌కు కేన్సర్‌ సోకిందని ఆయన లాయరు వాదించారు. తమ ఉత్పత్తులు సురక్షితమైనవని మోన్‌శాంటో ప్రతినిధులు కోర్టులు తెలిపారు. దాదాపు 8 వారాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ.. ఐఆర్క్‌ నివేదికనూ అధ్యయనం చేసింది. చివరగా కేన్సర్‌ కారక గ్లైఫోసేట్‌ గురించి మోన్‌శాంటో వినియోగదారుల్ని హెచ్చరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

జాన్సన్‌కు నయంకాని కేన్సర్‌ సోకేందుకు కారణమైనందున ఆయనకు పరిహారంగా రూ.1,727 కోట్లు, ఇతర ఖర్చుల కింద మరో రూ.276 కోట్లు, మొత్తంగా రూ.2,003 కోట్లు(29 కోట్ల డాలర్లు) చెల్లించాలని మోన్‌శాంటోను ఆదేశించింది. జాన్సన్‌ ఆరోగ్యస్థితిపై జ్యూరీ సానుభూతి వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుతో జాన్సన్‌ కన్నీటిపర్యంతమయ్యారు. తీర్పు ఇచ్చిన జ్యూరీలోని సభ్యులందరికీ జాన్సన్‌ ధన్యవాదాలు తెలిపారు. కాగా కోర్టు తీర్పుపై తాము అప్పీల్‌కు వెళతామని మోన్‌శాంటో కంపెనీ ఉపాధ్యక్షుడు స్కాట్‌ పాట్రిడ్జ్‌ చెప్పారు.
డ్వేన్‌
జాన్సన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement