సెనెటర్‌ మెక్‌కెయిన్‌ కన్నుమూత | Senator John McCain has passed away at the age of 81 | Sakshi
Sakshi News home page

సెనెటర్‌ మెక్‌కెయిన్‌ కన్నుమూత

Published Mon, Aug 27 2018 3:36 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Senator John McCain has passed away at the age of 81 - Sakshi

మెక్‌కెయిన్‌

న్యూయార్క్‌: అమెరికా ప్రఖ్యాత రాజకీయవేత్త, ట్రంప్‌ బద్ద్ధ విరోధి, భారత్‌కు మంచి మిత్రుడిగా పేరుపడ్డ సెనెటర్‌ జాన్‌ మెక్‌కెయిన్‌(81) అనారోగ్యంతో కన్నుమూశారు. వియత్నాం యుద్ధ హీరోగా అమెరికన్ల మనసు గెలుచుకున్న ఆయన బ్రెయిన్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం సాయంత్రం 4.28 గంటలకు(భారత కాలమానం ఆదివారం తెల్లవారుజామున) తుదిశ్వాస విడిచారు. మెక్‌కెయిన్‌ కోరిక మేరకు వైద్య సేవలు నిలిపివేసినట్లు ఆయన కుటుంబం శుక్రవారమే ప్రకటించింది.

అరిజోనా రాష్ట్రం నుంచి ఆరుసార్లు సెనెటర్‌ పనిచేసిన కెయిన్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు 2017లో బయటపడింది. అప్పటి నుంచి రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటున్నా ఆరోగ్యం పూర్తి క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ‘నా హృదయం బద్ధలైంది. 38 సంవత్సరాలు ఈ అద్భుతమైన వ్యక్తితో ప్రేమ ప్రయాణం చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. బతికున్నంత కాలం నచ్చినట్లుగానే జీవించారు. మరణం కూడా అంతే.. ఆయనను ప్రేమించినవారు చుట్టుఉండగా.. తాను ఎంతో ఇష్టపడిన చోటే ప్రాణాలు వదిలారు’ అని మెక్‌కెయిన్‌ భార్య సిండీ ట్విట్టర్‌లో తెలిపారు.

వియత్నాం యుద్ధంలో నేవల్‌ అధికారిగా పనిచేసిన కెయిన్‌ దాదాపు ఐదేళ్లు శత్రువు చేతిలో చిత్రహింసలు అనుభవించారు. అయినా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలతో బయటపడి అమెరికన్ల ప్రశంసలు అందుకున్నారు. సెనేట్‌ ఆర్మ్‌డ్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన కెయిన్‌ రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. 2000లో రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి పోరులో జార్జి బుష్‌ చేతిలో ఓడిపోగా.. 2008 రిపబ్లికన్‌ అభ్యర్థిగా ఎంపికైనా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేతిలో ఓడిపోయారు.

అంత్యక్రియలకు ట్రంప్‌ రావద్దు
రిపబ్లికన్‌ సెనేటర్‌గా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిరంకుశ నిర్ణయాల్ని ఎండగట్టడంలో మెక్‌కెయిన్‌ ఎప్పుడూ ముందుండేవారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రకటనల్ని తీవ్రంగా విమర్శించారు. శరణార్థుల విషయంలో అమెరికా విధానాల్ని తూర్పారపడుతూ ట్రంప్‌కు పక్కలో బల్లెంలా మారారు. తన అంత్యక్రియలకు సైతం రావద్దని ట్రంప్‌కు తన వైఖరిని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు ట్రంప్‌ను ఆహ్వానించడం లేదని ఇప్పటికే కెయిన్‌ కుటుంబం ప్రకటించింది. మెక్‌కెయిన్‌ మృతి పట్ల పార్టీల కతీతంగా సంతాపం వెల్లువెత్తింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జి బుష్‌ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. మెక్‌కెయిన్‌ మృతికి భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

భారత్‌తో స్నేహానికి పెద్దపీట
భారత్‌తో స్నేహ సంబంధాల్ని కాంక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సీఎన్‌ఎన్‌కు సంపాదకీయం రాస్తూ.. ‘ఈ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పార్టీలకతీతంగా అమెరికా–భారత్‌ సంబంధాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏవో కొన్ని దేశాలకు మాత్రమే ఇంత తక్కువ కాలంలో గొప్ప గౌరవం లభించింది. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో మోదీ పర్యటన చాటిచెప్పింది’ అని ప్రస్తుతించారు. అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని, ఉద్యోగ కల్పనలో అవి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement