సాక్షి, హైదరాబాద్: గ్లైపోసేట్ కలుపు మందుతో క్యాన్సర్ వస్తుందని తేలిపోయింది. ఈ విషయాన్ని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టు ముందు ఓ అడ్వొకేట్ ఆధారాలతో సహా ఉంచాడు. ఈ మందును తయారుచేసిన మోన్‌శాంటో కంపెనీ అంతర్గత ఈ–మెయిళ్ల నివేదికను ఆయన బట్టబయలు చేశాడు. ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఆ కీలకమైన నివేదికను కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో అమెరికాలోనూ గ్లైపోసేట్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. బీజీ–3లో కలుపు నివారణకు మోన్‌శాంటో బహుళజాతి విత్తన కంపెనీ గ్లైపోసేట్ అనే మందును తయారుచేసింది. దీనివల్ల జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, జంతుజాలం, మానవాళికి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు.
అయితే మోన్‌శాంటో దీనికి సంబంధించిన పరిశోధనల ఫలితాలను ఇన్నాళ్లూ రహస్యంగా దాచి ఉంచింది. క్యాన్సర్ వస్తుందన్న వివరాలు ఇప్పుడు బట్టబయలు కావడంతో అంతా విస్తుపోతున్నారు. ఈ పరిణమాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంగళవారం ఢిల్లీలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అమెరికాలో గ్లైపోసేట్‌ను నిషేధించే అవకాశం ఉన్నందున దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. తేయాకు తోటల వరకు గ్లైపోసేట్ వాడకానికి అనుమతి ఉందని, అయితే దాన్నీ కూడా నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్లైపోసేట్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్లైపోసేట్ అమ్మకాలను నిలుపుదల చేయాలని వ్యవసాయశాఖ ఆదేశాలిచ్చింది. ఎవరైనా ఈ మందును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే 15 శాతం విస్తీర్ణంలో బీజీ–3 పత్తి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ) కూడా గ్లైపోసేట్‌తో క్యాన్సర్ వచ్చే అవకాశముందని 2015లోనే నిర్ధారించింది. గ్లైపోసేట్‌ను ప్రపంచంలో 130 దేశాల్లో వాడుతున్నారు. దీంతో ఈ మందు అవశేషాలు ఆహారం, నీరు, వ్యవసాయ కూలీల మూత్రంలో కనిపిస్తున్నాయి. రాష్ట్రం గ్లైపోసేట్‌పై నిషేధం విధించినా బీజీ–3 పత్తి పెద్దఎత్తున సాగైంది. ఇప్పటికే 36.86 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. అందులో 5.40 లక్షల ఎకరాల్లో బీజీ–3 సాగైనట్లు తెలుస్తోంది. ఈ సాగుకు గ్లైపోసేట్ కలుపు మందు వాడకం తప్పనిసరి. దాన్ని నిషేధించినా రైతులు ఏదో విధంగా కొనుగోలు చేయాల్సిన íస్థితి. తమ టాస్క్‌ఫోర్స్ టీం దాడులు చేసి దీన్ని అరికడుతుందని రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులు ‘సాక్షి’కి తెలిపారు.
గ్లైపోసేట్‌తో క్యాన్సర్
Published Thu, Jul 19 2018 2:16 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment