మోన్‌శాంటోకు కళ్లెం | GM cotton row: Government says India 'not scared' if Monsanto | Sakshi
Sakshi News home page

మోన్‌శాంటోకు కళ్లెం

Published Thu, Mar 17 2016 1:36 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

మోన్‌శాంటోకు కళ్లెం - Sakshi

మోన్‌శాంటోకు కళ్లెం

వ్యాపారంలోకి దిగే ఏ సంస్థ అయినా లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంది. అందులో వింతేమీ లేదు. కానీ అలాంటి లాభార్జన కోసం అడ్డదారులు తొక్కకూడదు. బీటీ పత్తి విత్తనాల అమ్మకంలో గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న బహుళజాతి దిగ్గజం మోన్‌శాంటో దశాబ్దాలుగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇష్టం వచ్చిన ధర నిర్ణయించి రైతుల్ని నిలువుదోపిడీ చేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది. ఈ నేపథ్యంలో బీటీ పరిజ్ఞానం ఉన్న ఇతర కంపెనీలు సైతం బీటీ పత్తి విత్తనాల వ్యాపారాన్ని చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. ఈ నిర్ణయం పర్యవసానంగా మోన్‌శాంటోతోపాటు అనేక సంస్థలు బీటీ పత్తి విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి గనుక వాటి మధ్య పోటీ పెరిగి విత్తనాల ధరలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా ఆమేరకు సాగు ఖర్చు తగ్గి రైతుకు ఊపిరి పీల్చుకునే వీలు కలుగుతుంది.

మోన్‌శాంటో సంస్థ తీరుతెన్నులు మొదటినుంచీ సరిగా లేవు. అమెరికాలో ప్రభుత్వ విధానాలనే శాసించేంతగా ఎదిగిన ఈ సంస్థ ఇక్కడ సైతం తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. పరిశోధనల చాటున ప్రస్థానాన్ని ప్రారంభించి, కొత్త టెక్నాలజీని చూపి పేద రైతుల ఆశలతో ఆడుకుని వారిని పీల్చిపిప్పి చేయడం మొదలెట్టింది. చట్టాలంటే లెక్కలేదు. నిబంధనలంటే గౌరవం లేదు. ఆ సంస్థ 1995లో మన దేశంలోకి తొలిసారి జన్యుపరివర్తిత పత్తి వంగడాన్ని తీసుకొచ్చిన ప్పుడు అందుకవసరమైన అనుమతులే లేవు. నిబంధనల ప్రకారం జన్యు పరివర్తిత వ్యవహారాల మదింపు కమిటీ(జీఈఏసీ) అంగీకరించాకే బీటీ విత్తనాలను వినియో గించాల్సి ఉండగా...దాన్ని బేఖాతరు చేసి దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో ఆ సంస్థ బీటీ పత్తి విత్తనాల సాగును ప్రయోగాత్మకంగా మొదలెట్టింది.

1986 నాటి  పర్యావరణ పరిరక్షణ చట్టం నిబంధనలకు ఇది విరుద్ధం. అంతేకాదు అలాంటి సాగు చేసిన పంటపొలాల్లో కనీసం ఏడాదిపాటు ఏ పంటా వేయ కూడదని 1994 నాటి జీవ పరిరక్షణ మార్గదర్శకాలు చెబుతున్నాయి. వాటిని సైతం ఉల్లంఘించి ఆ పొలాల్లో వెంటనే ఇతర పంటలు వేశారు. అసలు మన దేశంలోని చట్టాలు విత్తనాలపై పేటెంట్లను అంగీకరించవు. కానీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను అడ్డుపెట్టుకునీ, అమెరికా ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చీ ఈ స్థితిని మార్చడానికి చాన్నాళ్లుగా అది చేయని ప్రయత్నమంటూ లేదు. అడుగడుగునా ఇక్కడి చట్టాలనూ, నిబంధనలనూ ఉల్లంఘిస్తూ ఇన్ని దశాబ్దాలుగా తన పబ్బం గడుపుకుంటున్న మోన్‌శాంటో విషయంలో ప్రభుత్వాలన్నీ కళ్లు మూసుకున్నాయి. చూసీచూడనట్టు వదిలేశాయి.

మోన్‌శాంటో సంస్థ ధనదాహానికి కళ్లెం వేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. 2006నాటికి 450 గ్రాముల పత్తి విత్తనాల ధరను రూ. 1,850 చొప్పున అమ్ముతున్న మోన్‌శాంటోపై ఆయన ప్రభుత్వం గుత్తాధిపత్య నియంత్రణ కమిషన్(ఎంఆర్‌టీపీసీ)కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకూ వెళ్లి మోన్‌శాంటోపై పోరాడింది. అమెరికాలో రైతుల నుంచి వసూలు చేసే విత్తన ధరలతో పోలిస్తే ఇక్కడి రైతులనుంచి అది దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నదని వివరించింది.

దీంతోపాటు కిలో దాదాపు రూ. 9 కే లభించే దేశవాళీ విత్తనాలను అది కొరగాకుండా చేస్తున్నదని పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి వ్యయం వల్లనే ఆ ధరను నిర్ణయించాల్సి వచ్చిందన్న మోన్‌శాంటో వాదనను గణాంకాలతో తిప్పికొట్టింది. పర్యవసానంగా 2008లో బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ. 650కి లభ్యంకావడం మొదలైంది. వైఎస్ ప్రభుత్వం సాధించిన ఈ విజయాన్ని చూశాక గుజరాత్‌లో ఆనాటి నరేంద్ర మోదీ ప్రభుత్వం, మరికొన్ని ఇతర రాష్ట్రాలూ మోన్‌శాంటో మెడలు వంచాయి.

వాస్తవానికి మోన్‌శాంటో ఉత్పత్తి చేస్తున్న బీటీ విత్తనాలు అది ప్రచారం చేస్తున్నట్టుగా పురుగును తట్టుకునే శక్తితో లేవు. బీటీ-2 పత్తి విత్తనం వాడిన పంటకు గులాబి రంగు పురుగు సోకడంతో రైతులు దేశవ్యాప్తంగా భారీయెత్తున నష్టపోయారు. తాము తయారుచేసిన విత్తనాలు అన్ని రకాల చీడలనూ, వాతా వరణ పరిస్థితులనూ తట్టుకుంటాయని మోతెక్కించడం తప్ప తీరా అందుకు భిన్నమైన ఫలితాలొచ్చినప్పుడు మోన్‌శాంటో బాధ్యత స్వీకరించి రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇందువల్ల లక్షలాదిమంది పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు అనువుగా బీటీ టెక్నాలజీ ఉన్న ఏ కంపెనీ అయినా ఆ మాదిరి విత్తనాల ఉత్పత్తికి లెసైన్స్ తీసుకునేందుకు వీలు కల్పించడం రైతును రక్షించే చర్య. మొత్తానికి మోన్‌శాంటోను దారికి తీసుకురావడానికి ఇన్నేళ్లు పట్టింది. బహుళజాతి సంస్థల సేవలో తరించే ప్రభుత్వాలవల్లే వాటి ఆటలు సాగుతున్నాయి. ఉత్పత్తి ఖర్చుకు ఎన్నో రెట్లు అధికంగా వసూలు చేసే ఈ బాపతు సంస్థలను అదుపు చేయకపోగా, వాటికి మేలు చేయడం కోసం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా విత్తనాభివృద్ధి సంస్థనే ఎత్తేయాలని చూసింది. మోన్‌శాంటో విషయంలో మంచి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బక్క రైతును బాధిస్తున్న ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలి.

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఆకాశాన్నంటడంవల్ల సాగు వ్యయం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దానికితోడు ప్రకృతి వైపరీత్యాలు మరింత కుంగ దీస్తున్నాయి. మెజారిటీ రైతులకు బ్యాంకుల్లో అప్పు పుట్టడం లేదు. వీటన్నిటి ఫలితంగా రైతులు రుణాల ఊబిలో కూరుకు పోతున్నారు. చావు తప్ప మార్గం లేదనుకుంటున్నారు. మొన్నటి బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టుగా వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఈ సమస్యల పరిష్కారం తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement