మన్యంలో ‘మర్లపులి’ షూటింగ్ సందడి
ఏలూరు: కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం మండల పరిసర గ్రామాల్లో 4 రోజులుగా ‘మర్లపులి’ తెలుగు చలనచిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. కన్నాపురానికి చెందిన కె.మాణిక్యాలరావు స్వీయరచన గావించిన యథార్థగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాతలు ప్రదీప్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
దర్శకుడు డి.రామకృష్ణ పర్యవేక్షణలో నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్ కథతో మిళితమై ఉంటుందన్నారు. 1970,80 దశకంలో కన్నాపురం సమీపంలో జరిగిన యథార్థగాథ ఈ చిత్రానికి మూలకథ అని రచయిత చెప్పారు. మర్లపులిగా అమాయకురాలైన ఓ మహిళని చిత్రీకరించి అమానుషంగా కొట్టి ఆమె చావుకు కారణం ఎలా అయ్యారు? వారిపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది కథాంశం అన్నారు. హీరోయిన్ తాతగా సీనియర్ నటులు చంద్రమౌళి, తదితరులు నటిస్తున్నట్టు చెప్పారు.