పట్టాలేక్కేనా?
- రైల్వే బడ్జెట్‌లో ప్రతిసారీ జిల్లాకు నిరాశే
- ప్రతిపాదనలకే పరిమితమైన పలు లైన్లు
- ప్రాజెక్టులకు నిధుల కొరత
- రైళ్ల హాల్టింగ్‌పై ఊసెత్తని కేంద్రం
- పాత ప్రాజెక్టులకే ప్రాధాన్యమన్న రైల్వే మంత్రి
సాక్షి, కరీంనగర్:కేంద్ర రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ప్రతిసారీ మొండిచేయే మిగులుతోంది. దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వేలైన్లు అంగుళం ముందుకు కదలడం లేదు. కొత్త లైన్ల ఏర్పాటుప్రతిపాదనలకే పరిమితమవుతోంది. సూపర్‌ఫాస్ట్ రైళ్ల హాల్టింగ్ కోసం స్థానికులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనలోనూ జిల్లాకు అన్యాయమే జరుగుతోంది.
ప్రతిసారి రైల్వే బడ్జెట్‌కు ముందు జిల్లా ఎంపీలు భారీగా ప్రతిపాదనలు చేస్తున్నా.. వాటిలో ఒక్క దానికి కూడా పూర్తిస్థాయిలో ఆమోదం లభించడంలేదు. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ ఈనెల 8న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రేపటి బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులు ఉండబోవని, పాత ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తామని మంత్రి సదానందగౌడ శనివారమే స్పష్టం చేశారు.
దీంతో ఏళ్ల నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టులకు నిధులు విడుదల అవుతాయా? లేదా? అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు లోక్‌సభ సభ్యులు ఇప్పటికే రైల్వే బోర్డుకు తమ ప్రతిపాదనలు అందజేశారు. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోడీ సర్కారు జిల్లాకు ఎలాంటి వరాలు కురిపిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
మనోహరాబాద్ లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో?
కొత్తపల్లి-మనోహరాబాద్ (కర్ణాటక) వయా మేడ్చల్ మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు అంశాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి ఈ లైన్ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. గత బడ్జెట్‌లో నామమాత్రంగా రూ.50 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. కనీసం సర్వే పనులు కూడా నిర్వహించలేదు.
ఈ లైన్ నిర్మాణానికి కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరముంది. ఈ లైను పూర్తయితే ప్రయాణికులకు, వాణిజ్య రంగానికి మేలు కలగడమే కాకుండా రైల్వేకు కూడా భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అలాగే సిరిసిల్ల, సిద్దిపేట ప్రజల కు రైలు అందుబాటులోకి వస్తుంది. జిల్లాకేంద్రం నుంచి రాజధానికి ప్రయాణ దూరం తగ్గుతుంది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత రైల్వేమంత్రిని కలిసి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని విన్నవించారు.
ఇందూరు చేరేదెన్నడో?
జిల్లాలో 22 ఏళ్ల క్రితం సాక్షాత్తు అప్పటి ప్రధాని పీవీ.నరసింహారావు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి-నిజామాబాద్ (ఇందూరు) రైలు మార్గానికి పట్టుకున్న గ్రహణం వీడడం లేదు. ఈ మార్గానికి 1993 సంవత్సరంలో రూ.925 కోట్లతో పరిపాలనాపరమైన మంజూరు లభించింది. ఇప్పటివరకు 134 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం పూర్తయింది. నిధుల కొరతతో పనులు నత్తకేనడక నేర్పుతున్నాయి. మొత్తం 178 కిలోమీటర్ల ఈ మార్గం కరీంనగర్ జిల్లాలో 122 కిలోమీటర్లు, నిజామాబాద్‌లో 56 కిలోమీటర్ల పొడవుంది. ఏళ్లకేళ్లుగా జాప్యం జరగడం వల్ల అంచనా వ్యయం రెట్టింపయ్యింది. ఇప్పటికే రూ.560 కోట్లు ఖర్చు చేయగా.. మరో రూ.385 కోట్లు అవసరమని అంచనా వేశారు.