ఆదాయం ఉన్నా.. అభివృద్ధి శూన్యం
- ప్రధాన స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు కరువు
- వరంగల్,కాజీపేటలో లిఫ్టులు లేవు
- డోర్నకల్‌లో వేధిస్తున్న ప్లాట్‌ఫాం సమస్య
- హామీలకే పరిమితమవుతున్న రైళ్ల హాల్టింగ్
సాక్షి, హన్మకొండ :‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది దక్షిణ మధ్య రైల్వేకు మన జిల్లా. వివరాల్లోకెళితే.. దక్షిణ మధ్య రైల్వేకు అధిక ఆదాయం చేకూర్చి పెట్టడంలో వరంగల్ జిల్లా ముందంజలో ఉంది. కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకంజలో ఉంది. నిత్యం వరంగల్ జిల్లా నుంచి సగటున రైల్వేకు *20లక్షలవరకు ఆదాయం సమకూరుతోంది. కానీ జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన వరంగల్, కాజీపేట, డోర్నకల్ మహబూబాబాద్, జనగామలలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణీకులు అవాక్కవుతున్నారు.
40వేల మంది రాకపోకలు
జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి సగటున 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీటికి పోస్టాఫీసు రిజర్వేషన్లు, ఆన్లైన్ రిజర్వేషన్లు కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్లలో రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా డెబ్భైవేలుగా ఉంది. తద్వారా ప్రతిరోజు జిల్లాలో సగటున *20 లక్షల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కానీ రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.
ఇబ్బందుల్లో ప్రధాన స్టేషన్లు
ప్రధాన రైల్వేస్టేషన్లయిన వరంగల్, కాజీపేటలలో ఆదాయానికి తగ్గ అభివృద్ధి లేదు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట స్టేషన్లో సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. మూడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్న ఈ స్టేషన్లో ఒక్కటంటే ఒక్కటే బ్రిటిష్ హయంలో నిర్మిం చిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండురైళ్లు రెండు ప్లాట్‌ఫారాల మీదకు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి కిక్కిరిసిపోతుంది.
ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారమ్ మీద నుంచి రెండు, మూడుఫ్లాట్ఫారమ్లకు చేరుకునేలోపు రైళ్లు వెళ్లిపోతున్నాయి. ఈ హాడావుడిలో ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పట్టాలు దాటి రైళ్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. రెండేళ్ల కిందే కాజీపేట స్టేషన్‌కు రెండో ఫుట్ ఓవర్‌బ్రిడ్జితో పాటు వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్టులు సైతం మంజూరు అయ్యాయి.
అమలుకు నోచుకోని లిఫ్టుల పనులు
అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వరంగల్ స్టేషన్‌కు లిఫ్టు లు రెండేళ్ల కిందే మంజూరయ్యాయి. కానీ వాటి పనులు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు డోర్నకల్ జంక్షన్ ఏర్పాటులో జరిగిన లోపం వల్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించకుండా నేరుగా ప్రయాణికు లు ప్లాట్‌ఫారమ్ మీదకు చేరుకోలేరు. దానితో ఈ సమస్య ను నివారించేందుకు రెండేళ్ల కిందే స్టేషన్లో లక్షలాది రూపాయల వ్యయంతో కొత్తగా ఫ్లాట్‌ఫారమ్‌లు నిర్మించారు. రెం డేళ్లు గడుస్తున్నా ఈ ఫ్లాట్ఫారమ్ను ప్రారంభించడం లేదు.
ఈ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి
పదేళ్ల క్రితం ప్రారంభించిన కాజీపేటటౌన్ స్టేషన్‌పై రైల్వే అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా సింగరేణి పాస్ట్‌ప్యాసింజర్, పెద్దపల్లి ప్యాసింజర్లు తప్ప మరోరైలుకు ఇక్కడ హాల్టింగ్ కల్పించడం లేదు. నగరంలో కలిసిపోయినట్లుగా ఉన్న హసన్‌పర్తిలో రైల్వేస్టేషన్లో సైతం ఇంటర్సిటీ, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలంటూ అనేక సార్లు రైల్వేశాఖకు వినతిపత్రాలు సమర్పించారు. కనీసం కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు ఇక్కడ హాల్టింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
డోర్నకల్‌లో పద్మావతి, మహబాద్‌లో హౌరా, జీటీ, రఫ్తీసాగర్కు హాల్టింగ్ ఇవ్వాలి
డోర్నకల్ రైల్వేస్టేషన్లో పద్మావతి, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మహబూబాబాద్‌లో గ్రాండ్‌ట్రంక్, రఫ్తీసాగర్ రైళ్లకు హాల్టిం గ్ ఇవ్వాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. డోర్నకల్ స్టేష న్లో రెండు, మూడోనంబరు ప్లాట్‌ఫారమ్‌లపై కనీసం మూ త్రశాలలు లేకపోవడం వల్ల ప్రయాణికలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భువనగిరి-సికింద్రాబాద్‌ల నడుమ నడుస్తోన్న మెమూ రైళ్లను జనగామ వరకు పొడిగించాల్సిన అవసరం ఉంది.
సరిపడా ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలి
జిల్లాలో ప్రధానంగా వరంగల్, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్ల మధ్యలో ఉన్నాయి. ఇక్కడ సరిపడా ఫుట్ఓటర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయా ప్రాంతాల్లోని ప్రయాణీకులు కోరుతున్నారు. కొన్ని సమయాల్లో టీసీల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. వీటితో పాటు కాజీపేట స్టేషన్లో బోడగుట్టను కలుపు తూ మరో బైపాస్ ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మిం చాలని ఏళ్ల తరబడి ప్రజలు కోరుతున్నారు.
పిట్‌లైన్, అదనపు ప్లాట్‌ఫాంపై మెలిక
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై పెరిగిపోతున్న భారాన్ని తగ్గించేందుకు కాజీపేట స్టేషన్ ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. అందులో భాగంగా కాజీపేటలో ప్రస్తుతం ఉన్న నాలుగు, ఐదు ప్లాట్ ఫారమ్‌లకు బదులుగా కొత్తగా మూడో నంబరు ప్లాట్‌ఫారమ్‌కు సమాంతరంగా మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాలని నిర్ణయించారు.
రైళ్ల మెయింటనెన్స్‌లో భాగంగా అదనపు పిట్లైన్లు సైతం మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన నిధులు విడుదల కాలేదు. ఈలోగా రైల్వే అధికారులు కొత్త మెలికలు పెడుతున్నారు. కాజీపేట స్టేషన్ కొత్తిపిట్లైన్లు నిర్మించేందుకు అనువుగా లేదంటూ సరికొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి పిట్లైన్లతో పాటు అదనపు ప్లాట్‌ఫారమ్‌లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాజీపేటకు పీఓహెచ్ దక్కేనా?
ఓకే అయితే మూడు వేలమందికి ఉపాధి
కాజీపేట రూరల్ : కాజీపేటలోని డిజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్లకు పీరియాడికల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) అనుమతి కోసం రైల్వే కార్మికులు, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈనెల 8న పార్లమెంట్లో రైల్వే మంత్రి సదానంద గౌడ 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైల్వేబడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
గౌడ బడ్జెట్లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరుగుతుందని కార్మికులు కోటి ఆశలతో ఉన్నారు. కాజీపేట ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ ఏర్పాటు చేస్తే రైల్వేలకు లాభంతో పాటు సుమారు మూడు వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక్కడ పీఓహెచ్ షెడ్లు లేకపోవడంతో రైల్వే అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
డీజిల్ లోకోషెడ్..
డీజిల్ లోకోషెడ్‌లో 142 డీజిల్ ఇంజిన్ల నిర్వహణ జరుగుతోంది. ఇందులో 800 మంది ైరె ల్వే కార్మికులు పని చేస్తున్నారు. డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా తిరుగుతున్న రైలు ఇంజిన్లకు ప్రతీ ఆరేళ్లకు ఒకసారి లేదా 60వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత పీఓహెచ్ చేయాలి. పీఓహె చ్ అంటే ఇంజిన్ టాప్ తప్ప అన్ని భాగాలు విప్పి సర్వీస్ చేసేవిధానం. డీజిల్ ఇంజిన్లకు తమిళనాడులో గోల్డెన్రాఖ్, ఒడిషాలో ఖరగ్‌పూర్, పంజాబ్‌లో పాఠియాలలో పీఓ హెచ్లున్నాయి. కాజీపేటలో పీఓహెచ్ లేక డీజిల్ ఇంజిన్లను ఈ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.
ఎలక్ట్రిక్ లోకోషెడ్..
కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో 143 ఇంజిన్ల నిర్వాహణ జరుగుతోంది. ఇందులో 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజిన్ జీవిత కాలం 36 ఏళ్లు. మహారాష్ట్రలో బుసావల్, పశ్చిమబెంగాల్లో కంచీరపార, చెన్నైలో పెరంబూర్‌లోని పీఓహెచ్కు ప్రతీ తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను తీసుకెళ్లాలి. ఇక్కడ ఇంజిన్‌ను విప్పి మేజర్ సర్వీస్ చేస్తారు.
రైల్వేకు లాభం.. నిరుద్యోగులకు ఉపాధి
దక్షిణ మధ్య రైల్వేలో వందల కొలది డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లు తిరుగుతున్నాయి. మనదగ్గర పీఓహెచ్ లేకపోవడంతో వేరే రాష్ట్రాలకు వెళ్తున్నాం. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను తీసుకెళ్తే 30 రోజుల్లో పీఓహెచ్ చేసి ఇవ్వాలని కార్మికులు అంటున్నారు. అయితే ఇప్పడు 50 రోజుల వరకు సమయం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక్క రోజుకు ఒక ఇంజిన్ నడవకుంటే రైల్వేకు రూ.2 లక్షలు నష్టం జరిగే అవకాశం ఉంది.
ఈ లెక్కన ఇంత పెద్ద సంఖ్యలో ఇంజిన్లు నడవకుంటే నష్టం భారీ స్థాయిలోనే ఉంటుంది. మన వద్ద నుంచి పీఓహెచ్కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు 10 రోజుల వరకు సమయం పడుతుంది. అదికూడా ఖాళీగానే వెళ్లి రావలసి ఉంటుంది. లక్నోలో మాదిరిగా కాజీపేటలో డీజిల్‌షెడ్, ఎలక్ట్రిక్ షెడ్లను పీఓహెచ్లుగా చేస్తే రైల్వేకు లాభంతో పాటు ఉద్యోగాల అవకాశాలు పెరగడంతోపాటు, ఇంజిన్లకు కావల్సిన కాంపోనెంట్లు, ఆక్సిలరీ భాగాలకు చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పడి వే లాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు.