సాక్షి ప్రతినిధి, కాకినాడ : రైల్వే బడ్జెట్ ప్రతిసారీ ఊరించి ఉస్సూరనిపిస్తోంది. కొత్త రైళ్ల ఊసే ఉండడం లేదు. కొత్త రైల్వే లైన్ల పరిస్థితి కూడా అంతే. జిల్లా ఎంపీల నుంచి ప్రతిపాదనలు వెళ్తున్నా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైల్వే స్టేషన్లలో సమస్యల కూతలు వినిపిస్తున్నాయి. ఏటా కొత్త బడ్జెట్ ప్రవేశపెడుతున్నా స్టేషన్ల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. బడ్జెట్‌లో ప్రకటనలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలూ లేకపోలేదు.
ప్రధానమైన ప్రతిపాదనలివీ...
కాకినాడ–కోటిపల్లి రైల్వేను లైన్ నర్సాపురం వరకు విస్తరించేందుకు మరో రూ. 600 కోట్లు రైల్వే శాఖ నుంచి రావల్సి ఉంది. అవి వస్తే తప్ప కోటిపల్లి నుంచి రైల్వే పనులు ప్రారంభంకావు. వీటి విషయంలో అమలాపురం ఎంపీ రవీంద్రబాబు రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ బడ్జెట్‌లో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
♦ 30 ఏళ్ల క్రితం నివేదిక ఆధారంగా పిఠాపురం– కాకినాడ మెయిన్ లైన్ సాధ్యం కాదని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి మారింది. రద్దీ పెరిగింది. కొత్తగా కోటిపల్లి– నర్సాపురం లైన్ వేస్తుండటంతో ఈ మెయిన్ లైన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేరుగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి ఎంపీ తోట నర్సింహం తీసుకెళ్లారు. గత బడ్జెట్‌లో 200 కేటాయించినందున దీన్ని పూర్తి చేయాలని కోరారు. ఎంపీ తోట నర్సింహం పరువు నిలుపుతారో లేదో చూడాలి.
♦ రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో 3,4 ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి కోసం గత బడ్జెట్‌లో రూ.29 కోట్లు మంజూరయ్యాయి. కానీ ఇంతవరకు ఆ నిధులు రాలేదు. పనులు మొదలు కాలేదు.
♦ కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు లైన్ వేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకాస్త ప్రయోజనకరంగా, పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలంటే నర్సాపురం నుంచి మచిలీపట్నం, రేపెల్లె, నిజాంపట్నం మీదుగా బాపట్ల వరకు కలిపే కోస్తా రైలు మార్గం అవుతుందని,ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్న ప్రతిపాదన ఉంది.
♦ జిల్లాలో ఏ ఒక్క రైల్వే స్టేషన్‌లో ‘వైఫై’ సదుపాయం లేదు. ఇక నూతన రైల్వే లైన్ల ఊసే ఉండటం లేదు. కొత్తగా రైళ్లు రావడం లేదు. ఎంపీలు కోరడమే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు.
వీటికి ఈ బడ్జెట్‌లో మోక్షం కలుగుతుందో లేదంటే ఎప్పటిలాగే ప్రతిపాదనలు పక్కన పెట్టేస్తుందో చూడాలి. గతంలో ప్రకటించిన నిధులు ఈసారైనా విడుదల చేస్తుందో లేదో చూడాలి. దేశ వ్యాప్తంగా ప్రకటించినట్టుగా మన రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సౌకర్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందో? గత బడ్జెట్ మాదిరిగా మొండి చేయి చూపుతుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
Comments
Please login to add a commentAdd a comment