మళ్లీ బ్రేక్!
- ఎంఎంటీఎస్ రెండో దశను అడ్డుకున్న రక్షణశాఖ
- 50 చోట్ల జీహెచ్‌ఎంసీ నుంచి అందని భూములు
- ఎయిర్‌పోర్టు మార్గంపై మరో దఫా చర్చలు
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు మరోసారి బ్రేక్ పడింది. ఫైరింగ్ రేంజ్‌లో ఉన్న భూమిని రైల్వే లైన్లకు ఇవ్వబోమంటూ రక్షణ శాఖ తెగేసి చెప్పింది. గతంలో తమ నుంచి పొందిన భూములకు ప్రతిగా మరోచోట భూమి కానీ, పరిహారం కానీ ఇవ్వకపోవడం... అదే మార్గంలో ప్రస్తుతం రెండో దశ డబ్లింగ్ పనులు చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు అడ్డుకున్నారు.
ఈ అంశంపై రక్షణ, రైల్వేశాఖల మధ్య ఇప్పటి వరకు ఉన్నత స్థాయి చర్చలు లేకపోవడంతో రెండు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. సుచిత్ర నుంచి సనత్ నగర్ వరకు నాలుగు కిలోమీటర్ల మార్గం రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలోనే సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు 1983లో సింగిల్ ట్రాక్ నిర్మించారు. దాని కోసం తీసుకున్న భూమికి ప్రతిగా మరో చోట తమకు స్థలం కేటాయించాలని రక్షణ శాఖ కోరింది. తమకు అంత భూమి అందుబాటులో లేదని, పరిహారం చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే రైల్వే నుంచి డిఫెన్స్‌కు భూమి, పరిహారం.. ఏవీ అందలేదు. ఈ వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది.
రెండో దశతో తెరపైకి...
తాజాగా రెండో దశ పనుల ప్రారంభంతో పాత వివాదం తిరిగి తెరపైకి వచ్చింది. గతంలో నిర్మించిన సింగిల్ లైన్‌కు పరిహారం చెల్లించకుండా... రెండో దశ కు అదే మార్గంలో డబ్లింగ్ చేపట్టడంతో డిఫెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. అప్పట్లోనే తాము 900 ఎకరాలు కోల్పోయామని, మరోసారి భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు చేపట్టిన ఆరు మార్గాల్లోనూ భూముల సేకరణపై ఇప్పటి వ రకు స్పష్టత లేకపోవడం గమనార్హం. రూ.819 కోట్లతో కూడిన ఈ ప్రాజెక్ట్ పనులు 2013లో ప్రారంభమయ్యాయి.
50 చోట్ల ప్రతిష్టంభన....
రెండో దశ ప్రాజెక్టులో చేపట్టిన మౌలాలీ-ఘట్కేసర్, మౌలాలీ-సనత్‌నగర్, బొల్లారం-మేడ్చెల్, సికింద్రాబాద్-బొల్లారం, ఫలక్‌నుమా-ఉందానగర్ మార్గాల్లో సుమారు 50 చోట్ల జీహెచ్‌ఎంసీ నుంచి 35 ఎకరాలకు పైగా భూమి అందవలసి ఉంది. నిర్మాణ సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్ ఈ మేరకు ట్రాక్‌ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం భూమి అవసరమని జీహెచ్‌ఎంసీకి ప్రతిపాదనలు అందజేసింది. వాటిపై ఎలాంటి పురోగతి లేదు. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 6.5 కిలోమీటర్ల మేర రెండో దశ విస్తరణలోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో దఫా జీఎమ్మార్‌తో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.