పట్టాలు పడుతున్నాయి | new railway projects in this railway budget | Sakshi
Sakshi News home page

పట్టాలు పడుతున్నాయి

Published Sat, Feb 4 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

పట్టాలు పడుతున్నాయి

పట్టాలు పడుతున్నాయి

రాష్ట్ర పరిధిలోని రైల్వే లైన్లకు భారీగా నిధులు
మొత్తంగా ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు
సీఎం కలల ప్రాజెక్టు కొత్తపల్లి– మనోహరాబాద్‌కి రూ.350 కోట్లు
బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు రూ.260 కోట్లు


సాక్షి, హైదరాబాద్‌: ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి తగినంత ప్రాధాన్యం లభించింది. పలు పెండింగ్‌ ప్రాజెక్టులు సహా కొత్త రైల్వే మార్గాలకు సైతం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు అయిన కొత్తపల్లి–మనోహరాబాద్‌ (కరీంనగర్‌–హైదరాబాద్‌) ప్రాజెక్టుకు రూ.350 కోట్లు ఇవ్వడం గమనార్హం. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వేకు రూ.5,135 కోట్లను కేటాయించగా.. అందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు ఇచ్చారు. మొత్తంగా రైల్వే బడ్జెట్‌లో ఒక్క కొత్త రైలును ప్రకటించకున్నా.. కొత్త లైన్ల ఏర్పాటు, ఉన్న లైన్లకు అదనంగా రెండు, మూడు లైన్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం గమనార్హం.

కొత్త పంథాలో..
దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆనవాయితీని పక్కనపెడుతూ సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను కలిపేసిన కేంద్రం.. కేటాయింపుల్లోనూ కొత్త పంథా చూపింది. అయితే బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి ఏయే ప్రాజెక్టులకు ఎన్ని నిధులిచ్చారనే పూర్తి వివరాలను పేర్కొనలేదు. పింక్‌బుక్‌గా వ్యవహరించే ఈ పద్దుల వివరాలను శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ఆ వివరాలను శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆయన వెల్లడించిన ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వేకు ఈసారి మొత్తంగా రూ.5,135 కోట్లను కేటాయించారు. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1,729 కోట్లు కేటాయించారు. ముఖ్యంగా కొత్త లైన్లు, రెండు, మూడో లైన్‌ నిర్మాణ పనులకు ఎక్కువ నిధులు ఇచ్చారు. బల్లార్షా–కాజీపేట–విజయవాడ మూడో లైన్‌ నిర్మాణానికి రూ.260 కోట్లు, మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌ లైన్‌కు రూ.300 కోట్లు, అక్కన్నపేట–మెదక్‌కు రూ.160 కోట్లు కేటాయించారు. దీంతో ఇంతకాలం నత్తనడకన జరుగుతున్న ఈ పనుల్లో వేగం పెరగబోతోంది.

సీఎం కలల ప్రాజెక్టుకు రూ.350 కోట్లు
తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేట పట్టణాలకు రాజధానితో రైల్వే అనుసంధానం లేదు. సిద్దిపేటకు అసలు రైల్వే మార్గమే లేదు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌కు రైల్వే లైన్‌ నిర్మించాలంటూ కేసీఆర్‌ రెండు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల క్రితం కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు రైల్వే బడ్జెట్లో చోటు దక్కినా.. ముందుకు సాగలేదు. ఇటీవల సీఎం కేసీఆర్‌ గట్టిగా ప్రయత్నించడంతో కదలిక వచ్చింది. గతేడాది ప్రధాని మోదీ స్వయంగా ఈ రైల్వే లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.350 కోట్లు కేటాయించారు. హైదరాబాద్‌ శివార్లలోని మనోహరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త లైన్‌.. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లల మీదుగా కరీంనగర్‌ శివారులోని కొత్తపల్లి వరకు 148.9 కిలోమీటర్లు కొనసాగుతుంది.

బల్లార్షా–కాజీపేట–విజయవాడ నాలుగో లైన్‌
అత్యంత రద్దీ మార్గంగా పేరున్న బల్లార్షా–కాజీపేట–విజయవాడ మార్గంలో ప్రస్తుతం మూడో లైన్‌ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి రావటానికి మరో రెండేళ్లు పట్టనుంది. అయితే ఆ మార్గంలో నాలుగో లైన్‌ కూడా అవసరమని భావించిన రైల్వే దానికి సర్వే పనులు చేపట్టనుంది. ఇక ఈ ఏడాదితో పూర్తికానున్న పెద్దపల్లి– కరీంనగర్‌–నిజామాబాద్‌ (178 కి.మీ.) లైనుకు రూ.25 కోట్లు కేటాయించారు. ఈ ఏడాదిలోనే ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు పరుగెత్తనున్నాయి.

టీకాస్‌కు మరిన్ని నిధులు
రైళ్లు ఢీ కొనకుండా అభివృద్ధి చేస్తున్న ‘ట్రెయిన్‌ కొలిజన్‌ అవాయిడెన్స్‌ సిస్టం (టీకాస్‌)’ను మరిన్ని చోట్లకు విస్తరించనున్నారు. దీనిని ఇప్పటికే సికింద్రాబాద్‌– వాడి–వికారాబాద్‌–బీదర్‌ సెక్షన్లలో వినియోగి స్తుండగా.. తాజాగా సికింద్రాబాద్‌– గద్వాల–డోన్‌– గుంతకల్‌ మార్గానికి విస్తరించారు. ఇందుకు రూ.120 కోట్లు కేటాయించారు.

కొత్త మార్గం
ఆర్మూర్‌–ఆదిలాబాద్‌ వయా నిర్మల్‌ (220 కి.మీ). అంచనా వ్యయం రూ.2,800 కోట్లు. (రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టు)
రైళ్ల క్రాసింగ్స్‌ కోసం కొత్త స్టేషన్ల నిర్మాణం: (అంచనా రూ.15 కోట్లు)
– వనపర్తి రోడ్డు–కౌకుంట్ల; మానవపాడు–అలంపూర్‌ రోడ్డు; ఇటిక్యాల–మానవపాడు

కొత్త లైన్ల కోసం సర్వే
బొల్లారం–ముద్ఖేడ్‌ డబ్లింగ్‌ (235 కి.మీ)
కాజీపేట–బల్లార్షా నాలుగో లైన్‌(234 కి.మీ)  
కాజీపేట–విజయవాడ నాలుగో లైన్‌ (219 కి.మీ.)
మంచిర్యాల–గడ్చిరోలి కొత్త లైన్‌ (115 కి.మీ.)


భద్రతా పరమైన పనులు
12 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), 7 రైల్వే అండర్‌ బ్రిడ్జిలు (ఆర్‌యూ బీ). అంచనా వ్యయం రూ.941 కోట్లు. రైల్వే వాటా రూ.383 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.558 కోట్లు
9 కొత్త వంతెనలకు రూ.31 కోట్లు
లెవల్‌ క్రాసింగ్స్, ఇంటర్‌లాకింగ్‌ పనులకు రూ.69.5 కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement