ఏలూరు/తాడేపల్లిగూడెం : కేంద్ర రైల్వే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటిస్తారా, మన జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ఈసారైనా నిధులు ఇస్తారా.. ఎప్పటిలా ఉసూరుమనిపిస్తారా అనేది కొద్దిగంటల్లోనే తేలిపోనుంది. ఎంపీలు మాత్రం జిల్లాలోని రైల్వే సమస్యలను, అవసరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఈసారి సానుకూల స్పందన ఉంటుం దని చెబుతున్నారు.
వీటికి మోక్షం కలిగేనా..
ఏటా రైల్వే బడ్జెట్‌లో జిల్లా ప్రజలకు మొండిచెయ్యే దక్కుతోంది. రాకపోకలు, సరుకుల రవాణా ద్వారా రైల్వేకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం జిల్లా నుంచి సమకూరుతోంది. అయినా ఏ స్టేషన్‌లో చూసినా అక్కడి సౌకర్యాలు ప్రయాణికులను అసహనానికి గురి చేస్తున్నాయి.
కొవ్వూరు-భద్రాచలం మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా నలుగుతోంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.745 కోట్లకు చేరింది. ఈ ైరె ల్వే లైను పూర్తయితే కొత్తగూడెం, సింగరేణి, మణుగూరు బొగ్గు గనుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సింహాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌కు బొగ్గు తరలించడానికి ఉపయోగపడుతుంది. నరసాపురం-కోటిపల్లి రైల్వే లైన్ ప్రతిపాదన దశలోనే ఉంది. భీమవరం-నిడదవోలు-గుడివాడ బ్రాంచి లైన్ డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
హాల్ట్‌ల సంగతేంటో..
ఏలూరు ైరె ల్వేస్టేషన్‌లో కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ లేదు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ మీదుగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలన్న డిమాండ్ నెరవేరడం లేదు.
తాడేపల్లిగూడెంస్టేషన్‌లో 1, 2 ప్లాట్‌ఫారాలకు లిఫ్టు సౌకర్యం కల్పించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. ఇక్కడి ఫుట్ బ్రిడ్జిని మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు విస్తరిం చే ప్రతిపాదన పెండింగ్‌లోనే ఉంది. కాకినాడ నుంచి భావనగర్ మధ్య ప్రతి గురువారం నడిచే రైలు, విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ (స్వర్ణజయంతి), దిబ్రూఘర్-కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం-కొల్లాం తదితర రైళ్లకు హాల్ట్ ఇవ్వడం లేదు. నరసాపురం నుంచి రోజుకు 23 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఒక్కటే ప్లాట్‌ఫాం ఉంది. ఒక్కటే ఫిట్‌లైన్ ఉండటంతో స్టేషన్‌కు వచ్చి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిర్వహణ కోసం మచిలీపట్నం పంపించాల్సి వస్తోంది.
ఎక్స్‌ప్రెస్‌లు నిలిపేలా చర్యలు
విశాఖపట్నం వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలపాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఎస్కలేటర్ ఏర్పాటుకు కృషి చేస్తాం.
- మాగంటి బాబు, ఏలూరు ఎంపీ
సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం
జిల్లాలోని రైల్వే సమస్యలకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చాం. ఈ సారైనా వాటికి మోక్షం కలుగుతుందని ఆశిస్తున్నాం. వైజాగ్‌ను ప్రత్యేక రైల్వే జోన్‌గా ప్రకటించాలని, విజయవాడ, రాజ మండ్రి వైజాగ్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు నడపాలని కోరాం. పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం రైల్వే స్టేసన్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడపాలని కోరాం. కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం వంటి అంశాలనూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం.
- తోట సీతారామలక్ష్మి, రాజ్యసభ సభ్యులు
దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి
జిల్లాలో దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన ప్రాజెక్ట్‌లు, సమస్యలపై ప్రతిపాదనలు ఇచ్చాం. బ్రాంచిలైన్ డబ్లింగ్ పనులు, విద్యుదీకరణతో పాటు భీమవరం, పాలకొల్లు రైల్వేగేట్ల వద్ద ఓవర్ బ్రడ్జిల నిర్మాణానికి నిధులు కేటాయించాలని అడిగాం. బడ్జెట్‌లో వాటికి స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాం.
- గోకరాజు గంగరాజు, నరసాపురం ఎంపీ
‘కూత’లేనా!
Published Thu, Feb 26 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement