నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి సురేష్ ప్రభు
నత్తనడకన శ్రీకాళహస్తి-నడిగుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలు
తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు ఊపు
రైల్వే బడ్జెట్‌పై జిల్లా ప్రజానీకం పెట్టుకున్న కొండంత ఆశలు మంత్రి సురేష్‌ప్రభు సాకారం చేస్తారా.. గత రైల్వే మంత్రుల తరహాలోనే నీళ్లు చల్లుతారా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది. విభజన నేపథ్యంలో రాష్ట్ర రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన శ్రీకాళహ స్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖ నిబంధనలను సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను కేంద్రం ఏమేరకు అంగీకరిస్తున్నదనేది నేడు తేలిపోనుంది.
తిరుపతి గాంధీరోడ్డు: నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు గురువారం లోక్‌సభలో పూర్తిస్థాయి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కానీ జిల్లాలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇందులో ప్రధానమైన రైలు మార్గాల పరిస్థితి అంతంత మాత్రమే. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి శరాఘాతకంగా మారింది. అపార ఖనిజ సంపదకు.. వ్యవసాయ ఉత్పత్తులకు.. పర్యాటక రంగానికి పెట్టింది పేరైన జిల్లా అభివృద్ధిలో మాత్రం అథమస్థానంలో ఉండడానికి ప్రధాన కారణం రైలు మార్గాలు సక్రమంగా లేకపోవడమేనని నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పశ్చిమ మండలాల్లో పారిశ్రామిభివృద్ధికి బాటలు వేసేలా కడప, మదనపల్లి, బంగారుపేట, బెంగళూరు రైల్వే మార్గాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రతిపాదించారు. తూర్పు మండల సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా శ్రీకాళహస్తి, నడికుడి మార్గాన్ని మంజూరు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.
వాటా నిధుల కేటాయింపునకు సాకుగా..
నిధుల లభ్యత లేదనే సాకుచూపి ఆరెండు రైల్వే మార్గాలను మంజూరు చేసేందుకు అప్పట్లో రైల్వే శాఖ అంగీకరించలేదు. దీంతో ఆ మార్గాలకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అప్పట్లో వైఎస్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 2008-09 రైల్వే బడ్జెట్‌లో ఆరెండు మార్గాలను మం జూరు చేసింది. 2008-09, 2009-10 బడ్జెట్‌లో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ఆరెండు రైల్వే మార్గాలకు రాష్ట్రప్రభుత్వం చెల్లించిన వాటా నిధులు ఇచ్చారు. ఫలితంగా కడప -బెంగళూరు, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే మార్గాల పనులను కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం కడప- బెంగళూరు రైల్వే మార్గం పనులు 129 కోట్ల రూపాయల వ్యయంతో కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21.59 కిలోమీటర్ల మేర సాగుతోంది. శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే మార్గం సర్వే పనులు 2010 నాటికి పూర్తయ్యాయి. పనులు మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఐదేళ్లల్లో పూర్తి కావాల్సిన ఈ బడ్జెట్‌లో ఎన్నటికీ పూర్తవుతుందో రైల్వే శాఖ ఒక అంచనాకు రాలేక పోతోంది.
దీనికి ప్రధాన కారణం వైఎస్ హఠాత్తు మరణం తర్వాత శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగళూరు రైల్వే మార్గాలకు రాష్ట్రం ప్రభుత్వం తనవాటా నిధులను విడుదల చేయకపోవడమే ఇదే సాకుగా చూపి రైల్వే శాఖ కూడా ఆ మార్గాలకు నిధులు కేటాయించడం లేదు. ఈ నేపథ్యంలో సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు రైల్వే శాఖే నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కోరడం గమనార్హం.
డివిజన్ పోయి జోన్ వచ్చే ..
గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్లలో కొన్ని భాగాలు వేరు చేసి తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తిరుపతి కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే శాఖకు రాజకీయ పారిశ్రామిక వర్గాల ప్రతిపాదనలు కూడా పంపాయి. గురువారం రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రైల్వే జోన్ ఏర్పాటుపై స్పష్టత వస్తుందో రాదో చూడాల్సి వుంది.
రైళ్ల సంఖ్య పెరగాలి
తిరుపతి నుంచి షిరిడీ, విశాఖ, సికింద్రాబాద్‌లకు దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ముంబయి- హౌరా, అహ్మదాబాద్, ఢిల్లీలకు గరీబ్థ్ ్రరై లు ప్రతిపాదనలు చాలా కాలంగా పెండిం గ్‌లో ఉన్నాయి. వీటిని మంజూరు చేయాలి. తిరుపతి నుంచి బెంగళూరు, చెన్నై, మదురై, త్రివేండ్రం, ఢిల్లీ, విశాఖ, కోల్‌కతా తదితర ప్రధాన నగరాలకు, పారిశ్రామిక కేంద్రాలకు, పుణ్యక్షేత్రాలకు రైళ్ల సంఖ్య పెంచాలి.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి
తిరుపతి రైల్వే స్టేషన్‌లో యుద్ధప్రాతిపదికన అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి. తిరుపతి-కాట్పాడి మధ్య రెండు లేన్ల మార్గాన్ని తిరుపతి నుంచి ధర్మవరం మీదుగా సికింద్రాబాద్, ముంబ యి రైలు మార్గాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచాలి.
ఉద్యోగుల కోర్కెలు
తిరుపతిలో రైల్వే ఆసుపత్రి, ఉద్యోగుల పిల్లల కోసం వైద్య కళాశాల స్థాపించాలి. రైల్వే స్టేషన్‌లో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలి.
పెరిగిన రైళ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఉద్యోగాలను నియమించాలి.రైల్వే భద్రతా విభాగంలో 2లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. హెచ్‌ఆర్‌ఏ 20 శాతం చెల్లించాలి, ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మించాలి.
‘ప్రభు’ కరుణిస్తారా..!
Published Thu, Feb 26 2015 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement