అందుకే రైల్వే మంత్రి రాలేదట..
రైల్వే జోన్ ప్రకటనపై సరికొత్త ఎత్తుగడ
మరోసారి విశాఖ వాసులకు దగా
విశాఖపట్నం: చిన్నపాటి వర్షం వస్తే చాలు.. చిన్నపిల్లలు దానిని ఆసరాగా తీసుకుని బడికె ళ్లడం మానేస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి రైల్వే జోన్‌పై ప్రకటన నుంచి తప్పించుకోవడానికి ఆ వర్షాన్నే ఆసరాగా చేసుకున్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారంటూ నానా హంగామా చేశారు. ఆయన విశాఖ రావడమే తరువాయి అన్నంతగా ప్రచారం సాగించారు. దీంతో తమ చిరకాల కల నిజంగా సాకారమవుతుందని విశాఖ వాసులు తెగ సంబరపడ్డారు. ఇంతలో 24 గంటలైనా గడవక ముందే వారి పర్యటన రద్దయిపోయింది. అందుకు వర్షాలు, వాతావరణం అడ్డుపడ్డాయన్నమాట! పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో కోస్తాంధ్రలో తేలికపాటి వానలే కురుస్తున్నాయి. ఆవర్తనమంటే అల్పపీడనం కన్నా బలహీనంగా ప్రభావం చూపుతుంది. ఈదురుగాలులు, పెనుగాలులకూ ఆస్కారమివ్వదు. ప్రశాంత వాతావరణంతో వానలు కురుస్తాయి తప్ప ఎలాంటి అనర్థాలకు తావివ్వదు. భారీ వర్షాలూ కురవవు.
విమాన సర్వీసులూ రద్దు కావు.. కాలేదు. కానీ బంగాళాఖాతంలో ఆవర్తనంతో తలెత్తిన వాతావరణ పరిస్థితుల వల్ల ఈనెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభుల విశాఖ పర్యటన రద్దయినట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వాస్తవానికి విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదన్న విషయం ఇప్పటికే పలుమార్లు రుజువయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనీ తేటతెల్లమయింది. ఇంతలో సాక్షాత్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొత్తగా మన రాష్ట్రం నుంచే రాజ్యసభకు ఎన్నికవడంతో రైల్వే జోన్‌కు మోక్షం కలుగుతుందని అంతా ఆశపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, టీడీపీ నేతలు సురేష్ ప్రభు విశాఖ వస్తున్నారని, జోన్‌పై ఆయన ఇక్కడే అనుకూల ప్రకటన చేస్తారని ఊదరగొట్టారు. పత్రికలు, టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈసారి నెపాన్ని వర్షం, వాతావరణంలపైకి నెట్టేసి రైల్వే మంత్రి తన పర్యటనను రద్దు చేసుకుని తప్పించుకున్నారు. రైల్వే జోన్ ఆశలపై నీళ్లు చల్లారు. విశాఖ వాసుల్ని మరోసారి దగా చేశారు. మోకాలికీ, బోడి గుండుకూ ముడిపెట్టారన్న సామెతను నిజం చేస్తున్నారంటూ జనం నిట్టూరుస్తున్నారు.