కనికరించని ‘ప్రభు’
రెడ్ సిగ్నల్
వ్యాగన్‌కు కొత్త మెలిక గల్లంతైన కోచ్ ఫ్యాక్టరీ
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ మూడేళ్లకిత్రమే మంజూరు
ఆవిరైన రైల్వేవర్సిటీ ఆశలు జిల్లాలో పెరగనున్న రైళ్ల వేగం
కొత్త రైళ్ల భారం ఎంపీలపైనే..
హన్మకొండ : పార్లమెంట్‌లో గురువారం రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో బల్లార్షా- కాజీపేట-విజయవాడ మధ్య మూడోలైను నిర్మాణానికి నిధులు కేటాయించడం మినహా ఒరిగింది శూన్యం. రాష్ట్రస్థాయి ప్రాజెక్టులుగా గుర్తింపు తెచ్చుకున్న రైల్వేకోచ్ కర్మాగారం, వ్యాగన్ వర్క్‌షాప్, కాజీపేటకు డివిజన్ హోదా వంటి కీలక అంశాలన్నీ టెక్నాలజీమంత్రం మాటున మరుగున పడిపోయాయి. జిల్లావాసులు బడ్జెట్‌పై నిరాశ చెందారు.
వ్యాగన్ గల్లంతు
బడ్జెట్‌లో వ్యాగన్ పరిశ్రమకు నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. ఇటీవల భూసేకరణ పూర్తికావడం, అంతకుముందే సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి ఈ అంశంపై లేఖ రాయడంతో నిధులు కేటారుుస్తారని అందరూ భావించారు. కానీ, సురేష్‌ప్రభు అందరి అంచనాలు తలకిందులు చేశారు. రాబోయే మూడు నెలల కాలంలో ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో వ్యాగన్ల తయారీ, లీజుకు ఇవ్వడం వంటి అంశాలపై ‘వ్యాగన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీం’పై సమాలోచనలు చేస్తామంటూ కొత్త మెలిక పెట్టారు. మూడు నెలల తర్వాత కొత్తగా రూపుదిద్దుకునే విధివిధానాలపై కాజీపేట వ్యాగన్ వర్క్‌షాప్ భవితవ్యం ఆధారపడి ఉంది.
విభజన హామీలదీ అదేదారి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలో రైలు బోగీల తయారీ కర్మాగారం (రైల్ కోచ్‌ఫ్యాక్టరీ) ఏర్పాటుకు గల అంశాలను పరిశీలించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేశారు. గత బడ్జెట్‌లో ఈ అంశంపై మూడు నెలల కాలపరిమితితో రైల్వేశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై సానుకూల స్పందన రాకపోవడంతో జిల్లావాసులు నిరాశకు లోనయ్యూరు. అదేవిధంగా విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా మరో కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్‌ను రైల్వేమంత్రి పెడచెవిన పెట్టారు.
ఆవిరైన రైల్వేవర్సిటీ ఆశలు
భారతీయ రైల్వేల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సహకారంతో రైల్వే వర్సిటీ ఏర్పాటు చేయనున్నామంటూ ఎన్డీఏ మధ్యంతర రైల్వేబడ్జెట్‌లో పేర్కొంది. వరంగల్ నగరంలో కాజీపేటకు అత్యంత సమీపంలో నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్, వరంగల్) ఉండటంతో వరంగల్‌లో ఈ వర్సిటీ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కానీ రైల్వేశాఖ ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకర్గమైన ఐఐటీ-వారణాసిలో ఈ విద్యాసంస్థను నెలకొల్పుతున్నట్లుగా ప్రకటన చేశారు. దానితో వరంగల్‌లో రైల్వేవర్సిటీ ఆశలు గల్లంతయ్యాయి.
సర్వేలతో సరి
గత బడ్జెట్‌లో మంజూరై నిధుల కోసం ఎదురు చూస్తున్న భద్రాచలం రోడ్డు- కొవ్వూరు రైల్వేమార్గానికి ఈ బడ్జెట్‌లో మొండిచేయి ఎదురైంది. కేవలం రూ.కోటి కేటాయించారు. డోర్నకల్-మిర్యాలగూడ మార్గం సర్వేకు మరోసారి సర్వే కోసం రూ.14.57 లక్షలు, పాలకుర్తి- స్టేషన్‌ఘన్‌పూర్-సూర్యాపేట మార్గం సర్వేకు రూ 24.50 లక్షలు, హసన్‌పర్తి-కరీంనగర్ మార్గం సర్వేకు రూ 14.5 లక్షలు కేటాంచారు. జిల్లా మీదుగా వెళ్తూ ఇదే పరిధిలోకి వచ్చే మణుగూరు-రామగుండం రైల్వేమార్గానికి మరోసారి సర్వే చేపట్టాలంటూ రూ.50 లక్షలు కేటాయించారు.
మూడోసారి మూడోలైన్
ఢిల్లీ-చెన్నై గ్రాండ్‌ట్రంక్ మార్గంలో ఉన్న బల్లార్షా- కాజీపేట-విజయవాడ మార్గం అత్యంత రద్దీతో ఉంటుంది. ట్రాఫిక్ పరంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ మార్గంలో మూడోలైను నిర్మిస్తామంటూ మూడేళ్ల కిందట అప్పటి రైల్వేమంత్రి త్రివేది ప్రకటించారు. మూడేళ్లుగా పనులు ముందుకు సాగలేదు. ఈ బడ్జెట్ ఈ మార్గానికి ప్రాధాన్యత దక్కింది. ట్రిప్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు మార్గాల్లో కాజీపేట-విజయవాడ ఒకటి. 219.6 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గానికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. దీనితో పాటు 220 కిలోమీటర్ల నిడివిగల బల్లార్షా-కాజీపేట మార్గంలో ట్రిప్లింగ్‌కు రూ.46.19 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కాజీపేట బైపాస్ మార్గంలో డబ్లింగ్‌కు రూ.4.50 కోట్లు కేటాయించారు.
హైస్పీడ్ రైళ్లకు అవకాశం
దేశంలో తొమ్మిది మార్గాల్లో రైళ్ల గరిష్ట వేగాన్ని 110-130 నుంచి 160-200 కిలోమీటర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ కేటగిరిలోకి విజయవాడ-కాజీపేట సెక్షన్ రానుంది. డోర్నకల్-వరంగల్‌ల మధ్య ట్రాక్ అనువుగా ఉందా లేదా అనే అంశాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ఈ మార్గంలో పర్యటించి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌లో సికింద్రాబాద్-విజయవాడ, కాజీపేట-నాగ్‌పూర్‌ల మధ్య హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అధ్యయనం చేస్తామని ప్రకటించారు. ఆ పనులు ఎంత వరకు వచ్చాయనేది గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వివరించలేదు.
వై-ఫై సౌకర్యం
ఏ కేటగిరిలో ఉన్న రైల్వే స్టేషన్లలో వై-ఫై సౌక ర్యం కల్పిస్తామంటూ రైల్వేమంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఏ కేటగిరిలో వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లలో త్వరలో వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. అదేవిధంగా యాత్రికులు ఎక్కువగా వచ్చే స్టేషన్లలో స్వయంసేవా పద్ధతిలో లాకర్లను అందుబాటులోకి తెస్తామంటూ మంత్రి సురేశ్‌ప్రభు చెప్పారు. ఈ కోటాలో వరంగల్, కాజీపేటలకు వచ్చే యాత్రికులు, ప్రయాణికులకు లాకర్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే కాజీపేటకు రెండు లిఫ్టులు మంజూరు కాగా నిధులలేమి కారణంగా పనులు ఆగిపోయాయి. ముఖ్యమైన స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటుకు రూ.120 కోట్లు కేటాయించారు. వీటితోపాటు ప్రధాన స్టేషన్లలో మినరల్ వాటర్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు వాటర్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఉన్న కాజీపేట, వరంగల్, జనగామ, డోర్నకల్, మహాబూబాబాద్ స్టేషన్లలో ఈ మిషన్లు అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. వీటితో పాటుగా జిల్లాలో నాలుగు ఆర్‌వోబీ లేదా ఆర్‌యూబీలకు నిధులు మంజూరైనట్లుగా తెలుస్తోంది.
ఎంపీలపైనే భారం
బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా కొత్త రైళ్ల అంశాన్ని కొలిక్కి తెస్తామంటూ మంత్రి ప్రకటించారు. దానితో కొత్త రైళ్లు, ప్రాజెక్టులను జిల్లాకు సాధించాల్సిన బాధ్యత జిల్లాకు చెందిన ఎంపీలపై ఉంది. కాజీపేట-షిరిడీ, భద్రాచలంరోడ్డు-డోర్నకల్-తిరుపతి, భద్రాచలం రోడ్డు-కాగ జ్‌నగర్‌ల మధ్య కొత్త రైళ్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్లు చిరకాలంగా ఉన్నాయి. గత బడ్జెట్‌లో ప్రకటించిన ముంబై-కాజీపేట రైలును ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశాన్ని పేర్కొనలేదు.
త్వరితగితన సరుకులు రవాణా చేసేందుకు ట్రాన్స్‌పోర్టు లాజిస్టిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా 30 చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామన్నారు. దీనికి ప్రధాన అర్హత ఖాళీ రైల్వేస్థలాలు అందుబాటులో ఉండటం. డోర్నకల్ సమీపంలో రైల్వేకు వందల ఎకరల స్థలం అందుబాటులో ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి పెట్టడం మంచింది.
బొగ్గు, ఉక్కు పరిశ్రమలు ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ కొత్త మర్గాలు నిర్మిస్తామంటూ మంత్రి సురేశ్‌ప్రభు సెలవిచ్చారు. దాని ప్రకారం మణుగూరు-రామగుండం రైల్వేలైనుకు ప్రత్యేకంగా నిధులు రాబట్టాల్సి ఉంది.
దేశంలో మరో నాలుగు చోట్ల రైల్వే రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పుతామంటూ మంత్రి ప్రకటన చేశారు. కనీసం ఈ రీసెర్చ్ సెంటరైనా వరంగల్‌కు దక్కేలా ప్రజాప్రతినిధులు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాజీపేటలో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.కొత్త డివిజన్ల ఏర్పాటుపై ఎంపీలతో కమిటీ వేస్తామంటూ మంత్రి ప్రకటించారు. కాజీపేట డివిజన్ సాధన దిశగా ఎంపీలు తమ గళం విప్పాల్సిన అవసరం ఉంది.