సాక్షి, హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌కి పలు ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. వీటిలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు, రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కూడా ఉన్నాయి. ఆయా జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టులు తమను గట్టెక్కిస్తాయని టీఆర్‌ఎస్ అభ్యర్థులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా వీటి పనుల పురోగతిని ప్రజలకు వివరించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ఆదేశించారు.
ఐదింట రైలు కూత..: కరీంనగర్, మెదక్ జిల్లాల ప్రజలకు రైల్వే సదుపాయం అంతంతే. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట వాసులకు ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్డు మార్గమే ఆధారం. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ ఆమోదం పొందినా.. పనులు 2016లో ప్రారంభించారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల మీదుగా రైల్వేలైన్ వెళుతుంది. ఈ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ఎన్నికల హామీలో ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
తొమ్మిదింట ‘రింగు’..: రీజినల్ రింగురోడ్డు ఇప్పుడు 9 నియోజకవర్గాల్లో ప్రచారాస్త్రంగా మారింది. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఉద్దేశించిన ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. 338 కిలోమీటర్లతో నిర్మించే ఈ రోడ్డు సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, షాద్‌నగర్, చేవేళ్ల నియోజకవర్గాల గుండా వెళుతుంది. ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క కల్వకుర్తి మినహా మిగిలిన స్థానాల్లో టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలే ఉండటంతో ఆర్‌ఆర్‌ఆర్ గురించి వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment