గంజాయి సాగు, రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టడంతో మన్యంలో సాగుదారులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 20 రోజుల్లో ఏజెన్సీలో మూడు వేల కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొందరు స్మగ్లర్లు పోలీసుల కదలికలను పసిగట్టి వారి కళ్లుగప్పి గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు గంజాయి రవాణాకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో ఈ ఏడాది గంజాయి సాగు, రవాణా భారీగా పెరిగింది. పోలీసులు కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికేదాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులను, యువకులను వ్యాపారులు, ఏజెంట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు మభ్యపెట్టి, డబ్బు ఎరచూపి గంజాయి సాగు, రవాణా చేయటానికి దింపుతున్నారు. గతంలో మన్యంలో జి.కె.వీధి, చింతపల్లి, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో 20 నుండి 30 గ్రామాలకు మాత్రమే పరిమితమైన గంజాయి సాగు ఈ ఏడాది ప్రతీ మండలంలోను 20 నుండి 50 గ్రామాలకు పాకింది. గంజాయి స్మగ్లర్లు పెట్టుబడులు అందించి ప్రోత్సహించటంతో మారుమూల గ్రామాల్లో కొండపోడు, పంట భూముల్లో గంజాయి సాగు విస్తృతం చేశారు. ఈ ప్రాంతంలో శీలవతి, పిక్క వంటి విలువైన గంజాయి రకాలు పండిస్తున్నారు.
గంజాయి రవాణాకు ఏజెంట్లే కీలకం
గిరిజన ప్రాంతాల్లో పండించే గంజాయిని కొనుగోలు చేసి వాహనాలు, మోతబరువుతో హైదరాబాద్, విశాఖపట్నం, వంటి మైదాన ప్రాంతాలకు తరలించటానికి స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లు కీలకంగా మారారు. వీరు గంజాయి సాగుదార్ల నుండి సులువుగా కొనుగోలు చేసి రహస్య ప్రాంతాలకు తరలించి 2కిలోలు బరువు ఉండేలా కూలీలతో ప్యాక్ చేయిస్తారు. పోలీస్, ఎక్సైజ్ పోలీస్‌ల కదలికలను పసిగట్టి జీపులు, కార్లు, వ్యాన్ల, లారీ, అటో వంటి వాహనాల్లో స్మగ్లర్లు చెప్పిన చోటకు తరలిస్తుంటారు. గంజాయి సాగుదార్ల కంటే ఏజెంట్లు, దళారీ వ్యాపారులకే అధిక మొత్తంలో నగదు ముడుతుంది. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో స్మగ్లర్లు ఏర్పాటు చేసుకొన్న ఏజెంట్లు స్థిరాస్తులుతో పాటు రూ.లక్షల్లో సొమ్ము కూడపెడుతున్నారు. వాహనాలపై ప్రెస్, పోలీస్, ప్రభుత్వవాహనం, ప్రొహిబిషన్, ఎక్సైజ్ వంటి పేర్లతో పోలీసులు అభ్యంతరం చెప్పని వాహనాల్లో ముందు, వెనుక పెలైట్ ద్విచక్ర వాహనాలు ఏర్పాటు చేసుకొని రూ.లక్షల విలువ చేసే గంజాయి తరలిస్తుంటారు. మండలంలో అనేక గ్రామాల్లో రవాణాకు సిద్ధం చేసిన గంజాయి నిల్వలు ఉన్నట్టు తెలిసింది. మండలాల్లో గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు ఏజెంట్లను గుర్తిస్తున్నామని పోలీస్, ఎక్సైజ్ పోలీస్‌లు అధికారులు చెప్పడం తప్ప ఇప్పటివరకు పెద్దగా చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్త్తోంది. గంజాయి వ్యాపారులు, స్మగ్లర్లు, ఏజెంట్లు ఎవరన్నది బహిరంగ రహస్యమే అయినా వారిని విచారించడం, వారి సంపాదన, కదలికలపై దృష్టిపెట్టడం, కూడబెట్టిన ఆస్తులు జప్తు చేయటం, కేసులు నమోదు వంటి చర్యలు లేకపోవడం గంజాయి వ్యాపారులకు వరంగా మారింది,
చిన్న వ్యాపారాలు.. పెద్ద ఆస్తులు
గ్రామాలు, మండల కేంద్రాల్లో పైకి చిన్న వ్యాపారాలు నడుపుకుంటూ పెద్దపెద్ద ఆస్తులు సంపాదించారంటే దీని వెనుక రహస్యమేమిటో అర్థం చేసుకొవచ్చు. వీరికి మైదాన ప్రాంతాల్లో రూ. కోట్ల ఆస్తులున్నాయంటే అది గంజాయి సొమ్మేనని ఈ ప్రాంతంలో చెప్పుకుంటారు.
అమాయకుల బలి!
గంజాయిని వాహనాలు, మోత బరువుతో మైదాన ప్రాంతాలకు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే అసలు స్మగ్లర్లు, ఏజెంట్లు తప్పించుకొని అమాయక గిరిజనులు బలైపోతున్నారు. గంజాయి మూటలు (ఒక్కో మూట 25 కిలోలు) వ్యాపారులు చెప్పిన చోటికి చేర్చటానికి కూలీలకు రూ. మూడు నుంచి నాలుగు వేల వరకు ముట్టచెబుతారని తెలిసింది. గంజాయి దాడుల్లో ఎక్కువ మంది అమాయక గిరిజనులే విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. జి.మాడుగుల మండలంలో పలు ప్రాంతాల్లో 20 రోజుల్లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ దాడుల్లో భారీ ఎత్తున రవాణాకు సిద్ధం చేసిన సుమారు మూడ వేల కిలోల గంజాయి పట్టుబడగా 14 మందిని అరెస్టు చేశారు. ఏదేమైనా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇటీవల దాడులు పెరిగాయనే చెప్పొచ్చు. దీంతో స్మగ్లర్లలో కూడా వణుకు ప్రారంభమైంది. కొందరు ఆచితూచి అతి జాగ్రత్తగా గంజాయిని తరలిస్తుండగా, మరి కొందరు కొత్తకొత్త ఎత్తుగడలతో పోలీసుల కళ్లుగప్పి గంజాయిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారని తెలిసింది.
గంజాయిపై గట్టి నిఘా
Published Fri, Feb 19 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement