మన్యంలో విసృ్తతంగా గంజాయి వ్యాపారం
భారీగా పట్టుబడుతున్న సరకు
రెండు నెలల్లో సుమారు 40 మంది అరెస్ట్
దొరికే వారంతా చోటామోటాలే స్మగ్లర్లతో చేతులు కలుపుతున్న పోలీస్
పెద్దఎత్తున గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్టు... ఇది నిత్యం మనకు పత్రికల్లో కనిపించే వార్త. అయితే పోలీసులకు దొరుకు తున్నదంతా చోటామోటా నిందితులే.. దీని వెనక ఉండే అసలు స్మగ్లర్లు మాత్రం చిక్కరు. పోలీసులు కూడా ఎవరైనా సమాచారం ఇస్తేనే దాడులు చేస్తున్నారు తప్ప స్వతహాగా దాడులు నిర్వహించే సందర్భాలు అరుదు. కొన్ని చోట్ల స్మగ్లర్లతో పోలీసులు చేతులు కలుపుతుండటంతో గంజాయి రావాణా సాఫీగా సాగిపోతోంది.
విశాఖపట్నం: గంజాయి రవాణాపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్న చిన్నచిన్న నిందితులే దొరుకుతున్నారు తప్ప అసలు నేరస్తులు మాత్రం పట్టుబడటంలేదు. మన్యంలో గంజాయి సాగు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారులు గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారు. అమాయక గిరిజన యువకులకు ఆశలు కల్పించి అక్రమంగా గంజాయిని ఏజెన్సీ నుంచి బయటకు తెప్పిస్తున్నారు. దానిని ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దీనిపై గత మార్చిలో ‘సాక్షి టాస్క్‌ఫోర్స్’ సమగ్ర కధనం ప్రచురించడంతో ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి గంజాయి సాగు, రవాణా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఓ కమిటీని వేస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఆ మాటలు ఆచరణకు నోచు కోలేదు. దీంతో మన్యంలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.
ఇంటి దొంగలు.. : కొందరు పోలీసులు స్మగ్లర్లతో చేతులు కలిపి, వారి నుంచి ముడుపులు తీసుకుని రవాణాకు సహకరిస్తున్నారు. కొద్ది నెలల క్రితం పాయకరావుపేటలో నకిలీ ఎస్‌ఐ పోలీసులకు దొరికాడు. నాతవరం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుళ్లు కొండయ్య, సత్యనారాయణ రూ.2లక్షలు తీసుకుని పట్టుబడ్డారు. వారిని పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. పోలీసులు వెళ్లలేని చోట, వారి సంచారం లేని సమయంలో నకిలీలు రంగ ప్రవేశం చేసి స్మగ్లర్ల నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. కొందరు పోలీసులు వీరి గురించి తెలిసి కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వారి దందాలో వాటాలు తీసుకోవడం వల్లనే వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తోటలపై దాడులు ఏవీ? : స్మగ్లర్ల మధ్య భేదాభిప్రాయాల వల్ల వారిలో కొందరు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అలా వచ్చిన సమాచారంతోనే రవాణాపై దాడులు చేస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ సుమారు కేసులు నమోదు చేశారు. 40 మంది వరకు పట్టుబడ్డారు. నాలుగు వేల కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నారు. 13 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడుతున్న వారంతా కేవలం కొరియర్లు, కూలీలు, అమాయక గిరిజనులు మాత్రమే. అసలు నేరస్ధులు ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉంటున్నారు. ఇక సాగు భూముల్లో గంజాయి పంటలను ధ్వంసం చేసేందుకు మాత్రం పోలీసులు సాహసించడం లేదు. ఏడాదికి రెండు మూడు సార్లు నామ మాత్రంగా రోడ్డు పక్కన ఉన్న తోటలను కొద్దిగా ధ్వంసం చేస్తుంటే స్థానిక గిరిజన రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనతో పాటు రాజకీయ వత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. పైగా అడవి లోపలికి వెళ్లి తోటలు ధ్వంసం చేస్తే అక్కడి నుంచి పంటను బయటకు తరలించడం చాలా కష్టం. ఈ నేపధ్యంలో తోటలు ధ్వంసం చేయడమే మానేస్తున్నారు.
రవాణా సాగుతోందిలా..: జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్‌లతో పాటు ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో 150 గ్రామాల్లో గంజాయి భారీగా సాగవుతోంది. వేల ఎకరాల్లో 6 వేల టన్నుల గంజాయిని ఏటా పండిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో అధిక భాగం మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలే కావడం విశేషం.
వేలాది ఎకరాల్లో ఏజెన్సీలో పండించిన గంజాయిని ఆరు నుంచి ఎనిమిది ప్రధాన, 120 ఇతర మార్గాల్లో పాడేరు, చింతపల్లి, సీలేరు, అరకు ఘాట్‌ల నుంచి మైదాన ప్రాంతాల మీదుగా హైదరాబాద్‌తో పాటు గోవా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. దీని కోసం ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు వచ్చి ఇక్కడి గిరిజనులు, యువత, విద్యార్థుల సహకారం తీసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీని గంజాయిని పట్టుకెళ్లేందుకు వచ్చిన స్మగ్లర్లలో మహారాష్ట్రకు చెందిన నలుగురి, ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన ఒకరిని పోలీసులు నాలుగు రోజుల క్రితం పాడేరు, నర్సీపట్నంలో పట్టుకున్నారు. వాహనాల్లో గంజాయి రవాణాకు ప్రత్యేక మార్పులు చేస్తున్నారు. ఆయుధాలు కూడా వెంటబెట్టుకుంటున్నారు. ఇటీవల పాడేరులో ఓ వ్యాపారి వద్ద ఆయుధాలు కూడా పట్టుబడ్డాయి. ఒక్కో బస్తా ఖరీదు రకాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.16 వేల వరకూ ఉంటోంది.