అక్రమార్కులకు ‘పండుగ’ | Irregulars 'festival' | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు ‘పండుగ’

Published Wed, Dec 31 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

అక్రమార్కులకు ‘పండుగ’

అక్రమార్కులకు ‘పండుగ’

⇒ ఏటీబీల నిలువు దోపిడీ
⇒కృత్రిమ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు
  ⇒టిక్కెట్ బుకింగ్ కేంద్రాలపై నిఘా
⇒ రంగంలోకి ప్రత్యేక బృందాలు

 సాక్షి, సిటీబ్యూరో: సొంత ఊళ్లకు వెళ్లే నగర వాసుల సంక్రాంతి సంబరాల సంగతి ఎలా  ఉన్నా...ఆర్టీసీ, ప్రైవేట్  ట్రావెల్స్, టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలు మాత్రం అక్రమార్జనతో ‘పండగ’ చేసుకుంటున్నాయి. సాధారణ చార్జీలపై 50 శాతం అదనపు భారాన్ని మోపుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ... పండుగకు వారం, పది రోజుల ముందు నుంచే చార్జీలను అమాంతంగా రెండింతలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తున్నారు.

వీరికి ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఏజెన్సీలు సైతం ప్రయాణికులపై ప్రతాపం చూపుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నాయి. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల్లో కనిపించే ఇలాంటి అక్రమ వ్యాపార ధోరణి కొంతకాలంగా ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలకూ విస్తరించింది. నగరంలోని వందలాది ఏటీబీ కేంద్రాలలో కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ఆర్టీసీపై ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది.
 
బినామీ పేర్లతో బుకింగ్
పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రధానరూట్లలో బినామీ పేర్లతో సీట్లు బుక్ చేస్తున్నారు. నిజమైన ప్రయాణికులు బుకింగ్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే సీట్లు నిండిపోయాయని, ఎవరైనా రద్దు చేసుకుంటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక్కో సీటుపైన రూ.100 అదనంగా చెల్లిస్తే రద్దు చేసుకున్న ప్రయాణికుల స్థానంలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో చాలా మంది ఇలా అదనంగా చెల్లించి వెళ్లవలసి వస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఏకంగా రూ.400 అదనంగా చెల్లించవలసిందే.

ఏటా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఈసారి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ 5,560 ప్రత్యేకబస్సులను ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 13 వరకు ఈ  బస్సులు  విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిజామాబాద్, బెంగళూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు బయలుదేరుతాయి. రెగ్యులర్‌గా వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి.

సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లకు  ప్రత్యేక బస్సులు తప్ప మరో అవకాశం లేదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడంతో  ప్రయాణికులకు  ఆర్టీసీ బస్సులే శరణ్యం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీ, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా చాలా వరకు దూర ప్రాంత బస్సులు ఏటీబీ కేంద్రాల నుంచే బయలుదేరుతాయి. దీంతో వీటి నిర్వహణ, ప్రయాణికుల భర్తీ వంటి వాటిపైన ఏటీబీల ఆధిపత్యమే కొనసాగుతోంది.
 
ప్రత్యేక నిఘా
ఇలా ఉండగా.. అక్రమాలకు పాల్పడే ఏటీబీ ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు చెప్పారు. ప్రత్యేక బస్సుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా ఏటీబీ ఏజెంట్లు టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడకుండా  ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఇవి ఏటీబీ కేంద్రాలపై నిఘా ఉంచడంతో పాటు, ప్రయాణికుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత ఏటీబీ కేంద్రాలను రద్దు చేయనున్నట్లు  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement