ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లాలో బుధవారం నిర్వహించనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్‌కు జిల్లా వ్యాప్తంగా 9800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశమున్న అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. వీరితోపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న 18 మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.
గగనతలం నుంచి నిఘా...
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గగనతలం నుంచి రెండు హెలికాప్టర్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన హెలికాప్టర్లను ఎస్పీ గజరావు భూపాల్ పరి శీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద యం నుంచి సాయంత్రం వరకు గస్తీ నిర్వహించనున్నారు. మావోయిస్టుల నుంచి ముప్పును పసిగట్టేందుకు వీటిని వినియోగిస్తున్నారు. సరిహద్దుప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచామని, సమాచార వ్యవస్థతోపాటు స్పెషల్ బ్రాం చ్ పోలీసులు అనుక్షణం సమాచారం సేకరిస్తున్నారని ఎస్పీ భూపాల్ తెలిపారు. ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా ప్రతిచర్యలకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
పోలీసు బందబోస్తు..
జిల్లావ్యాప్తంగా మొత్తం 2318 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇందులో 185 కేంద్రాలు అతిసమస్యాత్మకం, 340 కేంద్రాలు సమస్యాత్మకం, 79 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున నలుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 1800 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 3000 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది మహిళా పోలీసులు, 800 మంది హోంగార్డులతోపాటు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన 2500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ రోజున అలజడి సృష్టించే అనుమానాస్పద వ్యక్తులున్నా కేంద్రాలుగా 47 కేంద్రాలను గుర్తించారు.
నిఘా నేత్రం
Published Wed, Apr 30 2014 12:38 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement