పరిగి, న్యూస్‌లైన్: సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన గ్రామాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రాజకుమారితో కలిసి పరిగి మండల పరిధిలోని అతి సమస్యాత్మక గ్రామమైన రంగంపల్లిలో పోలింగ్ బూత్‌ను. అనంతరం పరిగిలోని నంబర్-1 ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇప్పటికే అన్ని చోట్లా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని చెప్పారు. ఆయా చోట్ల ప్రచారం నుంచి పోలింగ్ రోజు వరకూ వీడియో చిత్రీకరణ జరపనున్నట్టు, నిఘా బృందాల సేవలు కూడా వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. తర్వాత ఎస్పీ రాజకుమారి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అందులో లైట్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ విజయకుమార్ రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డిలకు సూచించారు. ఓటర్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్పీ వెంట చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు లింగయ్య, శంషోద్దీన్, హెచ్‌ఎం గోపాల్ ఉన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి
తాండూరు రూరల్: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఆయన తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల ఓట్లు భద్రపర్చే స్టాంగ్‌రూంల వద్ద ఆయన వివరాలు సేకరించారు. సమస్యాత్మకమైన పాత తాండూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ శశిధర్‌రెడ్డి సూచించారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ప్రజలు ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డీఐజీతో పాటు ఎస్పీ రాజకుమారి, రూరల్ సీఐ రవి, పట్టణ ఎస్‌ఐ ప్రణయ్‌లు ఉన్నారు.
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
Published Thu, Mar 20 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement