చెన్నూర్/మందమర్రిరూరల్/మంచిర్యాల టౌన్ : మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. బుధవారం రాత్రి మంచిర్యాల పోలీసుస్టేషన్, గురువారం చెన్నూర్, మందమర్రిలోని పోలీసుస్టేషన్‌లను తనిఖీ చేశారు. సెంట్రీ, తుపాకులు భద్రపర్చే గదులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయా స్టేషన్లలో విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల నుంచి జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, కాసిపేట మండలం తిర్యాణిలో ఎదురుకాల్పులు జరిగాయని, అక్కడ తప్పించుకుని పారిపోయారని అన్నారు. జిల్లాలో ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో 15ఏళ్ల క్రితం సికాస పనిచేసిందని, ఆ సమయంలో పనిచేసిన సానుభూతి పరులను ఆకట్టుకుని ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా బుధవారం మందమర్రిలో వాల్‌పోస్టర్లు వేశారని తెలిపారు. వీటిపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. మందమర్రి పోలీసుల పనితీరు బాగుందని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల్లోపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌తోపాటు మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఎస్సై నియామకానికి త్వరలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా
Published Fri, Nov 28 2014 2:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
Advertisement